Ravva Garelu Recipe : రవ్వతో టేస్టీ, క్రంచీ గారెలు.. ఈ రెసిపీకి మినపప్పు అవసరమే లేదు
Ravva Garelu : మీకు గారెలు తినాలని ఉందా? మినపప్పు నానబెట్టలేదని బాధ పడకండి. మీరు రవ్వతో కూడా వేడి వేడి టేస్టీ వడలు తినొచ్చు. అదేలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
Garelu Recipe : గారెలు అంటే మినపప్పు కచ్చితంగా నానబెట్టాల్సిందే. ఇది చాలామంది అనుకుంటారు. కానీ మినపప్పు లేకుండా కూడా మీరు టేస్టీ గారెలు తినొచ్చు. అదెలా మినప్పపు లేకుండా గారెలు అంటే ఆర్డర్ చేసుకోవాలా అని ఆలోచించకండి. వీటిని చేయడానికి ఇంట్లో రవ్వ ఉంటే సరిపోతుంది. అవును మీరు రవ్వతో టేస్టీ గారెలు చేసుకోవచ్చు. వీటిని తయారు చేయడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. కొన్ని పదార్థాలను రవ్వకు జోడించి.. టేస్టీగా ఈ రెసిపీని తయారు చేయవచ్చు. ఇంతకీ రవ్వ గారెలు ఏవిధంగా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
రవ్వ - 1 కప్పు
నీళ్లు - 1 కప్పు
జీలకర్ర - అర టీస్పూన్
నూనె - 1 టీస్పూన్
నిమ్మరసం - 1 టేబుల్ స్పూన్
కొత్తిమీర - 1 కట్ట
పచ్చిమిర్చి - 2
ఉల్లిపాయ - 1
కరివేపాకు - 1 రెబ్బ
ఉప్పు - రుచికి తగినంత
నూనె - డీప్ ఫ్రైకి సరిపడ
పెప్పర్ - చిటికెడు
తయారీ విధానం
ముందుగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకును బాగా కడగాలి. వాటిని చిన్న చిన్న ముక్కలుగా తురముకోవాలి. ఇప్పుడు వడలు తయారు చేయడం కోసం రవ్వను ఉడికించాలి. స్టౌవ్ వెలిగించి దానిపై ఓ గిన్నెపెట్టి దానిలో నీరు పోయండి. దానిలో నూనె, ఉప్పు వేసి మరిగించండి. అవి మరుగుతున్న సమయంలో రవ్వను వేయండి. నీరు మొత్తం నీటిని పీల్చుకునే వరకు రవ్వను కలుపుతూనే ఉండాలి. ఈ సమయంలో మంట లో ఫ్లేమ్‌లో ఉంచండి. పిండిని మాత్రం కలపుతూనే ఉండాలి. లేదంటే ఉండలుగా మారిపోతుంది. అడుగు పట్టకుండా పిండిని బాగా కలిపాలి. రవ్వ నీటిని మొత్తం పీల్చుకునే వరకు రవ్వను స్టౌవ్ మీదే ఉంచండి.
పిండి బాగా ఉడికిన తర్వాత దానిని ఓ గిన్నెలోకి తీసుకోండి. దానిలో తురిమిన కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర, జీలకర్ర, పెప్పర్ వేసి బాగా కలపాలి. దానిలోనే నిమ్మరసం వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాలు అన్ని పిండిలో బాగా కలిపోయేలా కలపండి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై కడాయి ఉంచి డీప్ ఫ్రైకి సరిపడ నూనెను వేయండి. నూనె వేగిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న పిండి నుంచి కొంచెం ముద్దను తీసుకుని దానితో గారెలు మాదిరిగా ఒత్తుకోవాలి. దానిని నూనెలో వేయండి. అది ఒకవైపు ఉడికిన తర్వాత మరోవైపు తిప్పండి. రెండు వైపులా గోధుమ రంగులో వచ్చేవరకు వేయించుకోవాలి. మిగిలిన పిండితో కూడా ఇదే మాదిరిగా గారెలు ఒత్తుకోవాలి. అంతే వేడి వేడి గారెలు సిద్ధమైపోయినట్లే. దీనిని కొబ్బరి చట్నీ లేదా పల్లీ చట్నీతో తింటే వేడివేడిగా తినొచ్చు. సాంబార్‌తో కలిపి తింటే దీని రుచి వీరలెవల్ ఉంటుంది.
రవ్వతో చేసిన ఈ గారెలను పిల్లలనుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు. దీనికి కేవలం ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌గా కాకుండా సాయంత్రం స్నాక్‌గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు దోశలు, ఇడ్లీలు తినను అని మారాం చేస్తున్నప్పుడు కచ్చితంగా మీరు వీటిని తయారు చేయవచ్చు. దాదాపు చాలామంది పిల్లలు గారెలు ఇష్టంగా తింటారు. పైగా ఇవి క్రంచీగా ఉంటాయి కాబట్టి ఈ రెసిపీ వారికి కచ్చితంగా నచ్చుతుంది.
Also Read : బియ్యం పిండితో హెల్తీ రొట్టెలు.. కన్నడ స్టైల్ రెసిపీ