Sabudana Dosa: సామలు సగ్గుబియ్యం దోశెలు, టమోటా చట్నీతో తింటే ఆ రుచే వేరు
దోశెలు ఒకేలా తింటే బోరు కొట్టేస్తాయి, అందుకే ఇలా కొత్తగా ప్రయత్నించండి.
మినపప్పు,బియ్యంతో నిత్యం దోశెలు వేసుకుంటున్నారా? ఎప్పుడూ ఆ దోశెలే అయితే బోరు కొట్టేయదూ. కొత్త రెసిపీలు కూడా ప్రయత్నించండి. ముఖ్యంగా సగ్గుబియ్యంతో చేసే దోశెలు రుచిగా ఉండడమే కాదు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి కూడా. ఈ రెసిపీలో సగ్గుబియ్యంతో పాటూ చిరు ధాన్యాలపైన సామలు కూడా ఉపయోగించాం. ఈ రెండూ చాలా ఆరోగ్యకరమైనవే. ఆరోగ్యానికి అన్ని రకాలుగా మేలు చేసేవి. ఒకసారి తిని చూస్తే మళ్లీ మళ్లీ మీరే వండుకుని తింటారు.
కావాల్సిన పదార్థాలు
సగ్గుబియ్యం - ఒక కప్పు
పెరుగు - రెండు టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
సామలు - అర కప్పు
నీళ్లు - సరిపడా
నూనె - తగినంత
తయారీ ఇలా...
1. సగ్గుబియ్యాన్ని నాలుగ్గంటలపాటూ నానబెట్టాలి. అలాగే సామల్ని అరగంట పాటూ నీళ్లలో నానబెట్టాలి.
2. మిక్సీలో నానబెట్టిన సగ్గుబియ్యం, సామలు, ఉప్పు, పెరుగు వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
3.ఒక గిన్నెలోకి రుబ్బుని తీసి పెట్టుకోవాలి.
4. దోశెలు వేసేందుకు జారేలా రుబ్బులో అవసరమైతే నీళ్లు కలుపుకోవచ్చు.
5. పెనంపై కాస్త నూనె రాసి పల్చగా దోశెల్లా వేసుకోవాలి. ఈ దోశెల్ని కొబ్బరి చట్నీ, టమోటా చట్నీలతో తింటే చాలా రుచిగా ఉంటుంది. పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ గా ఈ రెసిపీ ఉత్తమ ఎంపిక. లంచ్ బాక్సులో పెట్టినా మంచిదే. సాయంత్రం వరకు శక్తిని అందిస్తూనే ఉంటాయి.
సగ్గుబియ్యం ఉపయోగాలు
1. సగ్గుబియ్యంతో చేసే వంటకాలు తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బరువు తగ్గాలి అనుకునే వారికి ఇది ఉత్తమ ఆహారం.
2. ఇందులో పిండిపదార్థం అధికంగా ఉంటుంది. కాబట్టి ఇది సహజంగానే తీపి రుచిని కలిగి ఉంటుంది.
3. వీటిలో ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి అధికంగా ఉంటాయి. గర్భిణులకు ఈ రెండు అత్యవసరమైన పోషకాలు. కాబట్టి వారు సగ్గుబియ్యంతో చేసిన వంటకాలు తింటే ఎంతో మంచిది.
4. సగ్గుబియ్యంలో ఇనుము, క్యాల్షియం, విటమిన్ కె ఉంటాయి. ఇవన్నీ రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తాయి. అధిక రక్తపోటును తగ్గిస్తాయి.
5. రక్తహీనతతో బాధపడేవారు తరచూ సగ్గుబియ్యంతో చేసిన వంటకాలు తింటే సమస్య నుంచి బయటపడవచ్చు.
6. సగ్గుబియ్యం జావ తాగడం వల్ల శరీరంలోని వేడి తగ్గుతుంది.
సామలతో ఆరోగ్య ప్రయోజనాలు
1. సిరిధాన్యాలలో సామలు కూడా ఒకటి. ఇవి రుచికి తియ్యగా ఉంటాయి. వీటిని తింటే ఎంతో ఆరోగ్యం.
2. మహిళలు తరచూ సామలతో వండిన ఆహారాన్ని తినడం వల్ల రుతుక్రమ సమయంలో వచ్చే సమస్యలు తగ్గిపోతాయి.
3. మైగ్రేన్ ఉన్న వారికి కూడా సామలు ఎంతో మేలు చేస్తాయి.
4. పీసీఓడీ సమస్యలున్న మహిళలు కూడా వీటిని తినడం చాలా అవసరం.
5. మగవారు ఈ ఆహారాన్ని తింటే వీర్యకణాల సంఖ్య పెరుగుతుంది.
6. మలబద్ధకాన్ని పొగొట్టడంలో కూడా ఇది ముందుంటుంది.
7. ఊబకాయం, గుండె సమస్యలు, కీళ్ల నొప్పులకు చెక్ పెడుతుంది.
Also read: జిడ్డు చర్మం ఉన్న వారు కూడా మాయిశ్చరైజర్ వాడడం అవసరమా?
Also read: ఆ ఊరిలో పేద కుటుంబాలు మూడే, మిగతా వాళ్లంతా మిలియనీర్లే