Shocking Study: మహిళల సంతానోత్పత్తి వయసును పెంచే పరిశోధన విజయవంతం, త్వరలో వృద్ధాప్యంలోనూ పిల్లల్ని కనొచ్చు
వయసు ముదిరినా ఇంకా పిల్లల్ని కనని మహిళలకు శుభవార్త.
చాలా మంది మహిళలు వివిధ కారణాల వల్ల ఆలస్యంగా పెళ్లి చేసుకుంటారు. కానీ వారికి పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువ. ఇలాంటివారికి ఉపశమనం కలిగించే కథనం ఇది. వయసు పెరిగిన ఆడవారిలో కూడా అండాలను తిరిగ యవ్వనంగా మార్చి, ఫలదీకరణం చెందే పరిస్థితులను కల్పించే ప్రయోగాన్ని ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు విజయవంతంగా పూర్తి చేశారు. వృద్ధ మహిళల్లో కూడా అండాలను శక్తివంతంగా మార్చి, వారు కూడా కావాలంటే పిల్లల్ని కనే అవకాశాన్ని భవిష్యత్తులో కల్పించబోతున్నారు.
అసలేంటీ పరిశోధన?
మహిళల పునరుత్పత్తి వ్యవస్థ వయసును బట్టి ప్రవర్తిస్తుంది. 30 లోపు మహిళల్లో అండాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఆ వయసు దాటితే మాత్రం కొన్ని లోపాలు ఉండే అవకాశం ఉంది. అండాల్లోని కణాలు తమలోని జన్యుపదార్ధానికి నష్టం కలిగించడం ప్రారంభిస్తాయి. అందుకే పిల్లలు ఆరోగ్యంగా పుట్టాలంటే 30 లోపే పిల్లల్ని కనమని చెబుతుంటారు. 30 దాటాక అండాలు వయసు పెరుగుతూ ఉంటుంది. 40కు చేరువలో ఉన్న మహిళల్లో అసలు గర్భం దాల్చడమే కష్టంగా మారుతుంది. ఇక 45 దాటాక మెనోపాజ్ దశ. పిల్లల్ని కనే అవకాశం పూర్తిగా మూసుకుపోతుంది ఆ దశతో. ఇజ్రాయెల్‌లోని హిబ్రూ యూనివర్సిటీ ఆఫ్ జెరూసలేం పరిశోధకులు మహిళల్లో పిల్లల్ని కనే వయసును మరింత పెంచేలా ఎన్నో ఏళ్ల నుంచి అధ్యయనం నిర్వహిస్తున్నారు. వయసు ముదిరి క్షీణిస్తున్న అండాలను తిరిగి యవ్వనంగా మార్చి ఆరోగ్యకరమైన పిల్లల్ని లేటు వయసులో కూడా కనేలా చేయడమే వారి పరిశోధనా అంశం.
ముందుగా ఎలుక అండాలపై చేసిన ఈ పరిశోధనా విజయవంతం అయింది. ఇదే ప్రక్రియ మహిళల అండాలపై కూడా నిర్వహించారు. అందులో కూడా పాజిటివ్ ఫలితాలు వచ్చాయి. అండాల్లోని కణాల్లో డీఎన్ఏ నిక్షిప్తమై ఉంటుంది. ఇందులోని కొన్ని భాగాలు చురుకుగా పనిచేయకుండా అడ్డుకోవడం ద్వారా అండాల్లో వృద్ధాప్య ప్రక్రియను అడ్డుకోవచ్చని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. కొన్నిరకాల యాంటీవైరల్ ఔషధాలను ప్రయోగించి అండాల వృద్ధాప్య ప్రక్రియను ఆగిపోయేలా చేశారు. దీంతో అవి తిరిగి యవ్వనంగా మారాయి. ఈ పరిశోధన భవిష్యత్తులో మహిళల్లో పునరుత్పత్తి వయసును పెంచేందుకు ఉపయోగించవచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. వారు ఏ యాంటీ వైరల్ మందులును వాడారో మాత్రం బయటికి చెప్పలేదు.
Also read: గుండె పోటు బారిన పడకుండా ఉండాలా? వైద్యులు చెబుతున్న అయిదు మార్గాలు ఇవిగో
Also read: బ్రేక్‌ఫాస్ట్ తినకపోతే బరువు పెరగడమే కాదు, డయాబెటిస్ కూడా రావచ్చు
Also read: మీ జీవితంలో ప్రేమ నిండాలంటే మీ ఇంట్లో ఈ మొక్కలు ఉండాల్సిందే