Heart Disease: గుండె పోటు బారిన పడకుండా ఉండాలా? వైద్యులు చెబుతున్న అయిదు మార్గాలు ఇవిగో
గుండె సంబంధం వ్యాధులు ప్రాణాంతకమైనవి. వాటిని అడ్డుకునే మార్గాలు కొన్ని ఉన్నాయి.
గుండెపోటు, కార్డియాక్ అరెస్టు, అధిక కొలెస్ట్రాల్, హైపర్ టెన్షన్, కరోనరీ ఆర్డరీ డిసీజ్, పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్... ఇవన్నీ గుండె సంబంధ వ్యాధుల జాబితా. ఇవి ఎప్పుడైనా ఎవరికైనా రావచ్చు. మాకు రావులే అనే ధీమా పనికిరాదు. వీటిని అడ్డుకునే మార్గాలు కూడా మన చేతుల్లోనే ఉన్నాయి. ప్రముఖ వైద్యులు గుండె సంబంధ వ్యాధులు అయిదు మార్గాలను సూచిస్తున్నారు. ఈ అయిదింటిని పాటిస్తే చక్కటి గుండె ఆరోగ్యం మీదే. గుండె జబ్బులు వస్తాయేమో అన్న భయం లేకుండా హ్యాపీగా బతికేయచ్చు.
ధూమపానం మానేయాలి
బాలికా వధు నటుడు సిద్ధార్ద్ శుక్లా. కేవలం 40 ఏళ్లకే గుండెపోటుతో మరణించారు. ఆయన ఫిట్నెస్ ఫ్రీక్. రోజూ వ్యాయామం క్రమం తప్పకుండా చేస్తారు. ఆరోగ్యకరమైన డైట్ నూ ఫాలో అవుతారు. అయినా గుండెపోటు బారిన పడ్డారు. అది ధూమపానం వల్ల కూడా కావచ్చు. ఆయనకు అధికంగా సిగరెట్లు కాల్చే అలవాటు ఉంది. పొగాకు ధమనులను సంకోచించేలా చేస్తుంది. దీని వల్ల రక్తప్రసరణ సరిగా అందదు. ఇలా ఎక్కువకాలం కొనసాగితే గుండె పోటు వంటి ప్రమాదం పెరుగుతుంది.
తగినంత వ్యాయామం
మీరెంతగా శారీరక శ్రమకు దూరంగా ఉంటే గుండె జబ్బులకు అంతగా దగ్గరవుతున్నట్టు లెక్క. జిమ్ లో గంటల కొద్దీ చెమటలు చిందించక్కర్లేదు. రోజూ ఓ అరగంట నడక, ఓ అరగంట సింపుల్ వర్కవుట్లు చేసినా చాలు. గంటలకొద్దీ ఒకే దగ్గర కూర్చోకుండా మధ్యలో అటూ ఇటూ నడుస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల హృదయ స్పందన రేటు పెరుగుతుంది. హృదయనాళ వ్యవస్థను చురుగ్గా ఉండేలా చూస్తుంది. ఊబకాయం, పొట్ట దగ్గర కొవ్వుచేరడం వంటివి జరగవు. తద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
సమతులాహారం
తృణధాన్యాలు, సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, కాల్షియం, ఖనిజాలు, విటమిన్లు మొదలైనవి అన్నీ కలిగిన ఆహారాలను మెనూలో ఉండేలా చూసుకోవాలి. గుండె ఆరోగ్యానికి సమతులాహారం చాలా ముఖ్యం. నట్స్, దేశీ నెయ్యి, తాజా పండ్లు, కూరగాయలు రోజూ తినాలి. వాటి ద్వారా ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరాన్ని చేరుతాయి. ఇవి గుండెను కాపాడతాయి.
డైటింగ్‌లు మానండి
ఈ మధ్య డైట్ ఫ్యాడ్స్ ప్రజాదరణ పొందుతున్నాయి. కీటో డైట్, లిక్విడ్ డైట్, డ్రై ఫాస్టింగ్, ఫాస్టింగ్ ఇలా రకరకరాల డైట్లు ఫాలో అవుతున్నారు జనాుల. ఆస్ట్రేలియన్ స్పిన్నర్ షేన్ వార్న్ 14 రోజులుగా లిక్విడ్ డైట్ పాటిస్తున్నాడని కూడా టాక్ ఉంది. ఆ డైట్ లో ఉండగానే ఆయన గుండె పోటుతో 52 ఏళ్లకే మరణించారు. ఆ డైట్ వల్లే మరణించారని చెప్పడం లేదు, కానీ తక్కువ కేలరీలు, సమతులాహారం అందకపోవడం కూడా గుండె ను వీక్ చేసి ఉండొచ్చు. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. డైట్ ఫ్యాడ్‌లు ఫాలో అవడం మానండి.
రక్తపోటు అదుపులో
రక్తం అధిక శక్తితో ధమని గోడలను గుద్దుతూ ప్రవహించినప్పుడు దాన్ని అధిక రక్తపోటు అంటారు. ఇది చాలా నిశ్శబ్ధంగా దాడి చేస్తుంది. దీర్ఘకాలంలో గుండెజబ్బులకు కారణమవుతుంది. అందుకే రక్తపోటును అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం సోడియాన్ని తక్కువ తీసుకోవాలి. ధూమపానం, ఆల్కాహాల్ వంటివి మానేయాలి. వ్యాయామాలు చేయాలి. రక్తపోటు నియంత్రణకు ఇవి చాలా అవసరం.
Also read: బ్రేక్‌ఫాస్ట్ తినకపోతే బరువు పెరగడమే కాదు, డయాబెటిస్ కూడా రావచ్చు
Also read: మీ జీవితంలో ప్రేమ నిండాలంటే మీ ఇంట్లో ఈ మొక్కలు ఉండాల్సిందే