Halwa Recipe in Telugu : సండే స్పెషల్ టేస్టీ హల్వా.. కరాచీ స్టైల్లో రావాలంటే ఈ టిప్స్ ఫాలో అయిపోండి
Bombay Halwa Recipe : హల్వాను చాలామంది ఇష్టంగా తింటారు. కానీ దానిని ఇంట్లో చేసుకోలేము అనుకుంటారు. అయితే ఈ సింపుల్ రెసిపీతో కరాచీ స్టైల్ టేస్టీ హల్వాను ఇంట్లోనే సులభంగా చేసేసుకోవచ్చు.
Karachi Style Halwa : మీకు హల్వా అంటే ఇష్టమా? ఎంత ఇష్టమైతే ఏమి లాభం. దానిని ఇంట్లో వండుకోలేకపోతున్నారా? అయితే ఇప్పుడు ఆ చింత వదిలేసి ఈ రెసిపీని ఫాలో అయిపోండి. స్పెషల్ సమయాల్లో హల్వా చేసుకుని.. ఇంటిల్లీపాదికి వండిపెట్టేయండి. కరాచీ స్టైల్ హల్వాను ఏవిధంగా సిద్ధం చేసుకోవాలో.. దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో? ఏ టిప్స్ ఫాలో అయితే హల్వా రుచి మరింత బాగా వస్తుందో ఇప్పుడు తెసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
మొక్కజొన్న పిండి - 1 కప్పు
పంచదార - 4 కప్పులు
నెయ్యి - 1 కప్పు
నీళ్లు - మూడు కప్పులు (పంచదార పాకం కోసం)
నీళ్లు - 1.5 కప్పులు (మొక్కజొన్న పిండి కోసం)
నిమ్మ ఉప్పు - 1 టీస్పూన్
జీడిపప్పు - 1 కప్పు
తయారీ విధానం
ముందుగా మిక్సింగ్ బౌల్లో మొక్కజొన్న పిండిని తీసుకుని దానిలో నీళ్లు వేసి.. ఉండలు లేకుండా కలుపుకోవాలి. మరో చిన్న గిన్నె తీసుకుని.. దానిలో నిమ్మసోడా వేయాలి. దానిలో కాస్త నీరు వేయాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై మందపాటి కడాయి పెట్టుకోవాలి. దానిలో పంచదార పాకం కోసం నీటిని వేయాలి. దానిలో పంచదార వేయాలి. ఎప్పుడు హల్వా చేసిన గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే.. మొక్కజొన్న పిండికి నాలుగు రెట్లు పంచదార తీసుకోవాలి. నీళ్లు మూడు రెట్లు తీసుకోవాలి. నెయ్యి మొక్కజొన్న పిండిని ఒకే మోతాదులో తీసుకోవాలి. ఇది పర్ఫెక్ట్ కొలత.
ఇప్పుడు పంచదార నీటిలో మరుగుతున్నప్పుడు గరిటతో కలుపుతూ ఉండాలి. పాకంపై వచ్చే తెల్లని తేటను గరెటతో తీసేయాలి. పంచదార పూర్తిగా కరిగేలా చూసుకోవాలి. పంచదార పూర్తిగా కరిగిపోయాక.. ఓ గిన్నెలోకి సగం పాకం తీసేయండి. మిగిలిన సగం పాకాన్ని స్టౌవ్ మీద ఉంచాలి. పాకాన్ని ఎక్కువసేపు మరిగించకూడదని గుర్తించుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న పాకంలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని బాగా కలపాలి. అనంతరం ముందుగా ఉండలు లేకుండా కలిపిన కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని దీనిలో పోయాలి.
ఇప్పుడు మిశ్రమాన్ని సన్నని మంటపై ఉడికించుకోవాలి. కార్న్ ఫ్లోర్ పూర్తిగా గడ్డకట్టేందు.. పది నుంచి పదిహేను నిమిషాలు పడుతుంది. ఇప్పుడు ముద్దగా మారిన మిశ్రమాన్ని బాగా కలుపుతూ ఉండాలి. ప్రతి 5 నిమిషాలకు ఓ సారి.. ముందుగా పక్కన పెట్టుకున్న పాకం, నెయ్యిని కొంచెం కొంచెంగా వేస్తూ కలపాలి. అప్పుడే హల్వా లోపలికి వెళ్లి మంచి రుచిని అందిస్తుంది. చివర్లో లెమన్ సాల్ట్ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా పోస్తూ కలపాలి. ఇది వేశాక.. మీడియం నుంచి హై ఫ్లేమ్‌లో మంటను ఉంచి బాగా కలపాలి. మళ్లీ పాకం, నెయ్యి వేసి కలుపుతూ ఉండాలి. దీనిని కలపడం ఆపేస్తే అడుగు పట్టేస్తుంది కాబట్టి మరొకరి సాయం తీసుకుంటే మంచిది.
ఈ మిశ్రమాన్ని బాగా కలిపితే.. అరగంట తర్వాత నెయ్యి పూర్తిగా మిశ్రమం లోపలికి వెళ్లిపోతుంది. బుడుగలు బుడగలుగా మిశ్రమం మారిన తర్వాత దానిలో జీడిపప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మిశ్రమాన్ని చేతితో తీసుకుని కలపాలి. అప్పుడు చేతికి అంటుకుంటూ ఉంటే.. హల్వా ఇంకా సిద్ధం కాలేదని అర్థం. చేతితో పట్టుకున్నప్పుడు రౌండ్ బాల్‌గా రెడీ అయితే అది పూర్తైపోయినట్లు అర్థం. ఇప్పుడు దానిలో కాస్త ఫుడ్ కలర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఓ గిన్నెకు నెయ్యి రాసి.. దానిలో హల్వా మిశ్రమాన్ని వేయాలి. దానిపై జీడిపప్పు పలుకులు వేయాలి. దీనిని నాలుగైదు గంటలు పక్కనపెడితే మిశ్రమం గట్టిపడుతుంది. దానిని ముక్కలుగా కోసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ కరాచీ స్టైల్ హల్వా రెడీ.
Also Read : గారెలను ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.. హెల్తీ రెసిపీ ఇదే చాలా సింపుల్