పదే పదే మూత్రం వస్తోందా? అయితే, మీకు వ్యాధులు ఉండొచ్చు, డాక్టర్‌ను కలవండి
సాధారణంగా రోజుకు ఆరు నుంచి ఏడు సార్లు మూత్ర విసర్జన చేస్తుంటారు.యచఅయితే అంతకు సాధారణంగా వెళ్లే దానికంటే ఎక్కువ సార్లు టాయిలెట్ కు వెళ్లాల్సి వస్తే మాత్రం ఒక సారి డాక్టర్ సలహా తీసుకోవాల్సిందే
జీవ క్రియల్లో అతి ముఖ్యమైన వాటిల్లో ఒకటి విసర్జన క్రియ. ఇది శరీరం నుంచి వ్యర్థాలను తొలగించే ప్రక్రియ. ఇందులో తేడా వచ్చిందంటే అది రకరకాల అనారోగ్యాలకు సూచన కావచ్చు, లేదా ఏదైనా పెద్ద ప్రమాదం పొంచి ఉందని కూడా అర్థం కావచ్చు. అందుకే తప్పని సరిగా తరచి చూసుకోవాల్సిన శరీర ధర్మాలలో విసర్జన కూడా ముఖ్యమైనది. రోజుకు పది సార్లు మూత్ర విజర్జన చెయ్యాల్సిన అవసరం ఏర్పడిందంటే ఒక సారి నిపుణుల సలహా తీసుకోవాల్సిన అవసరం ఉందని గ్రహించాలి. ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేయ్యాల్సి వస్తుందంటే కచ్చితంగా ఆరోగ్యంలో ఏదో తేడా చేసినట్టే.
డయాబెటిస్
రక్తంలో గ్లూకోజ్ పరిమితికి మించి చేరినపుడు కిడ్నీలు మరింత కష్టపడి రక్తం నుంచి ఎక్కువైన గ్లూకోజ్ ను గ్రహించాల్సి వస్తుంది. ఆహారంలో చక్కెరలు ఎక్కువగా తీసుకునే వారిలో ఇలా ఎక్కువ సార్లు మూత్ర విసర్జన అవసరం పడుతోంది అంటే వీరు టైప్ 2 డయాబెటిస్ బారిన పడ్డారేమో ఒకసారి చూసుకోవాలి. అంతేకాదు యూరిన్ కూడా వాసన మారుతుంది. కుళ్ళిన పండు వంటి తియ్యటి వాసన ఉంటుంది.
పక్షవాతం
మెదడుకు ఆక్సిజన్ రక్తం ద్వారా తీసుకువెళ్లే రక్త నాళం చిట్లిపోవడం లేదా దానిలో అడ్డంకులు ఏర్పడడం వల్ల పక్షవాతం వస్తుంది. ఇలా జరిగినపుడు కేంద్ర నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. బ్లాడర్ ను నియంత్రించే నాడులు ఇలాంటి ప్రభావానికి గురైనపుడు కూడా ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చెయ్యాల్సి రావచ్చు.
ప్రొస్టేట్ పరిమాణం పెరగడం
పురుషుల్లో కనిపించే సమస్య ఇది. ప్రొస్టేట్ పురుషుల్లో బ్లాడర్ కు దగ్గరగా ఉండే గ్రంథి. 50 వయసు దాటిన తర్వాత చాలా మంది పురుషుల్లో ఈ గ్రంథి పరిమాణంలో పెరుగుతుంది. అందువల్ల బ్లాడర్ మీద ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా తరచుగా మూత్రవిసర్జన చెయ్యాల్సి వస్తుంది. అంతేకాదు మూత్ర విసర్జనలో సమస్యలు కూడా వస్తాయి.
బ్లాడర్ క్యాన్సర్
బ్లాడర్ అనేది మూత్ర విసర్జన వ్యవస్థలో అత్యంత ముఖ్యమైన అవయవం. దీనిలో ఏర్పడే కంతుల వల్ల మూత్ర విసర్జన మీద ప్రభావం పడుతుంది. సాధారణం కంటే ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చెయ్యాల్సిన అవసరం ఏర్పడుతుంది. అంతేకాదు విసర్జనలో నొప్పి కూడా ఉంటుంది. బ్లాడర్ లో మూత్రం నిండి లేకపోయినా సూది గుచ్చుతున్నటువంటి నొప్పి ఉంటుంది.
సెక్సువల్లీ ట్రాన్స్మీటెడ్ ఇన్ఫెక్షన్
క్లామిడియా, గనేరియా అనేవి చాలా తరచుగా కనిపించే సెక్సువల్లీ ట్రాన్సిమిటెడ్ ఇన్ఫెక్షన్స్. ఇలా లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్స్ వల్ల మూత్ర విసర్జన సమయంలో మంట ఉంటుంది. మూత్రం కూడా చిక్కబడినట్టు గా ఉంటుంది.
యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లు
యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లో బాక్టీరియా మూత్ర నాళంలో ప్రవేశించి అక్కడ ఇన్ఫ్లమేషన్ కలిగిస్తుంది. ఫలితంగా ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చెయ్యాల్సి వస్తుంది. అంతేకాదు, మూత్ర విసర్జనలో మంటగా ఉండడం, మూత్రంలో రక్తం అవశేషాలు కూడా కనిపిస్తాయి.
ప్రెగ్నెన్సీ
గర్భాశయంలో పిండం ఎదిగే కొద్దీ బ్లాడర్ మీద ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా ఎక్కువ సార్లు మూత్ర విసర్జన అవసరం అవుతుంది. ప్రెగ్నెన్సీ మొదటి రోజుల్లో కూడా కొంచెం మూత్రవిసర్జన పెరుగుతుంది. ఇందుకు కారణం ప్రొజెస్టిరాన్ అనే హర్మోన్.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.