Pregnant: శీతాకాలంలో గర్భిణీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహార పదార్థాలు ఇవే
కడుపుతో ఉన్న మహిళలు తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పోషకాలు నిండిన ఆహారం తీసుకుంటే బిడ్డకి, తల్లికి మంచిది.
ప్రతి మహిళకి మొదటి సారి తల్లి అవుతున్నామనే భావన చాలా ఆనందం కలిగిస్తుంది. ప్రెగ్నెన్సీ కన్ఫమ్ అయిన దగ్గర నుంచి అలవాట్లు అన్నీ మార్చుకోవాలి. ఆహారం విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అది తల్లి, కడుపులోని బిడ్డకి మంచిది. అందుకే గర్భిణీ స్త్రీలు పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అలా చేయడం వల్ల తల్లి బలంగా ఉంటుంది. అందుకే తినేటప్పుడు ఒక్కరి కోసం కాదు ఇద్దరి కోసం తినమని చెప్తుంటారు. కడుపుతో ఉన్నారు అనగానే సున్నుండలు, డ్రై ఫ్రూట్స్, నెయ్యి బాగా పెడతారు.
ఒక నివేదిక ప్రకారం మహిళలు గర్భం ధరించిన మొదటి త్రైమాసికం తర్వాత అదనంగా 300 కేలరీలు తీసుకోవాలి. ఇవి కడుపులోని బిడ్డకి చేరతాయి. సమతుల్య ఆహారం తీసుకుంటూ క్రమం తప్పకుండా తేలికపాటి వ్యాయామాలు చేయడం కూడా ముఖ్యమే. ఇది తల్లిని, బిడ్డని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే నార్మల్ డెలివరీ అయ్యేందుకు దోహదపడుతుంది. ఈ శీతాకాలంలో ఇన్ఫెక్షన్స్ దరిచేరకుండా కాబోయే తల్లులు చక్కని ఆహారం తీసుకోవాలి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇన్ఫెక్షన్లని దూరం చేస్తాయి.
శీతాకాలంలో గర్భిణులు తీసుకోవాల్సిన పదార్థాలు
పెరుగు: శీతాకాలంలో పెరుగు తినడం వల్ల తల్లి, బిడ్డకి మంచిది కాదని అంటారు. కానీ అదంతా అపోహ మాత్రమేనని వైద్యులు కొట్టిపారేస్తున్నారు. గర్భిణీ స్త్రీలకి కాల్షియం చాలా అవసరం. ఎందుకంటే కడుపులోని పిండం శరీర నిర్మాణం అభివృద్ధికి కాల్షియం ఉపయోగపడుతుంది. పెరుగులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఎముకల్ని బలంగా మారుస్తుంది. పాల ఉత్పత్తుల్లో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. కడుపు నొప్పి, ఇన్ఫెక్షన్లని నివారిస్తుంది. గర్భిణీ స్త్రీలకి పొట్టలోని సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
గుడ్లు: రోజుకొక గుడ్డు ఉడకబెట్టుకుని తినడం చాలా అవసరం. ప్రోటీన్ కి అద్భుతమైన మూలం. కొలిన్, లుటీన్, విటమిన్లు బి 12, డి, రిబోఫ్లేవిన్, ఫోలేట్ ఉంటాయి. అవి ఎముకలని బలోపేతం చేసి శిశువు ఎముకలు, కండరాల అభివృద్ధికి దోహదం చేస్తాయి.
చేపలు: సాల్మన్, ట్యూనా, మాకేరెల్, హెర్రింగ్ వంటి చేపల్లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కొవ్వు చేపలు జింక్, సెలీనియం, విటమిన్ డి లభించే సహజ వనరులు.
నట్స్: వాల్ నట్స్, బాదం, జీడిపప్పు, ఖర్జూరాల్లో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. సహజ చక్కెర, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ లో ఫోలేట్, పొటాషియం, ఐరన్ పోషకాలు శరీరానికి చాలా మేలు చేస్తాయి. ప్రాసెస్ చేసిన చక్కెర పదార్థాలు, ఉప్పు అధికంగా ఉండే పదార్థాలకి తప్పనిసరిగా నివారించాలి. వాల్ నట్స్, బాదం, ఎండు ఖర్జూరం రాత్రిపూట నానబెట్టుకుని ఉదయాన్నే తినడం గర్భిణీ స్త్రీలకి చాలా మంచిది.
చిలగడదుంప: బీటా కెరోటిన్ అధిక స్థాయిని కలిగి ఉంటుంది. కాబోయే తల్లులకి విటమిన్ ఏ చాలా అవసరం. పిండం కణజాలం అభివృద్ధికి దోహదపడుతుంది. దీని తీసుకోవడం 10 శాతం నుంచి 40 శాతానికి పెంచాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. విటమిన్ ఏ ఉత్పత్తి పెంచడానికి చిలగడదుంపలు ఉత్తమైన మార్గం.
గ్రీన్ వెజిటబుల్స్: బ్రకోలి వంటి ఆకుపచ్చ కూరగాయలు తీసుకోవాలి. మెంతి, బచ్చలికూరలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆకుపచ్చ కూరగాయాల్లో ఫైబర్, విటమిన్ సి, కె, ఏ, కాల్షియం, ఐరన్, ఫోలేట్, పొటాషియం ఉన్నాయి. తల్లికి అవసరమైన ఫోలిక్ ఆమ్లానని అందిస్తాయి. నట్స్, బీన్స్, సిట్రస్ పండ్లు, ఆకుకూరలు, తృణధాన్యాలు తీసుకోవాలి. మెదడు, వెన్నెముకకి సంబంధించి పుట్టుకతో వచ్చే లోపాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గర్భం దాల్చిన మొదటి 28 రోజుల తర్వాత న్యూరల్ ట్యూబ్ డీఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ కాలంలో ఫోలిక్ యాసిడ్ కీలకం.
చిక్కుళ్ళు, బీన్స్: ప్రోటీన్, ఫైబర్, ఖనిజాలు, ఐరన్, ఫైటో కెమికల్స్ వీటిలో లభిస్తాయి. కాబోయే తల్లులో పాలు ఉత్పత్తి చేయడానికి బీన్స్, కాయధాన్యాలు, బఠానీలు, వేరుశెనగ తప్పనిసరిగా తీసుకోవాలి.
బెర్రీస్: విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. రోగనిరోధక వ్యవస్థని బలోపేతం చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. చలికాలంలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి. బెర్రీలు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ వైరల్ ప్రభావాలని కలిగి ఉందని పలు పరిశోధనలు నిరూపించాయి. అందుకే శీతాకాలంలో గర్భిణీలు వీటిని తప్పకుండా తినాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: ఓ మై గాడ్, మహిళలకూ బట్టతల వస్తుందా? ఎందుకొస్తుంది? చికిత్స ఉందా?