Sri RamaNavami 2023: శ్రీరామనవమికి చేసే పానకం, వడపప్పు -ఈ రెండూ కూడా వేసవి తాపాన్ని తీర్చేవే
రాముడికి ఇష్టమైన ప్రసాదం పానకం, వడపప్పు. వీటిని శ్రీరామనవమికి కచ్చితంగా నివేదిస్తారు.
హిందూ సాంప్రదాయాలు, ఆహార పద్ధతులు ఆరోగ్యంతో అనుసంధానమై ఉంటాయి. శ్రీరామనవమి రోజు రాముడికి నివేదించే ప్రసాదం పానకం, వడపప్పు. పూజ పూర్తయ్యాక భక్తులు ఈ పండుగ రోజు కచ్చితంగా వాటిని సేవిస్తారు. ఆ రెండింటి వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. వేసవి ఆరంభంలో వచ్చే పండుగ ఇది కాబట్టి, సీజనల్ వ్యాధులు శరీరంపై దాడి చేసే అవకాశం ఎక్కువ. అలాగే వేసవి తాపాన్ని శరీరం తట్టుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది. కొంతమంది వడదెబ్బ బారిన కూడా పడతారు. అందుకే వేసవికాలం ఆరంభంలో వచ్చే ఈ పండుగ రోజున వేసవి తాపాన్ని తీర్చే ప్రసాదాలను నైవేద్యంగా ఇస్తారు. అవే పానకం, వడపప్పు. ఈ రెండూ తినడం వల్ల వేసవి తాపం తగ్గుతుంది.
చలువ చేసే పానకం
ఆ శ్రీరాముడికి నివేదించే మొదటి నైవేద్యం పానకం. పానకంలో బెల్లం, నీళ్లు, యాలకుల పొడి, మిరియాల పొడి వేస్తారు. ఇవన్నీ కూడా శరీరానికి చలువ చేసేదే. అంతేకాదు వేసవిలో వచ్చే వ్యాధుల నుంచి కాపాడడానికి శరీరానికి రోగనిరోధక శక్తిని అందిస్తాయి. ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. ఇక ఇందులో వాడే బెల్లం వల్ల శరీరానికి తగినంత ఇనుము అందుతుంది. ఇనుము అందడం వల్ల ఎర్ర రక్త కణాలు పెరుగుతాయి. తద్వారా రక్తం శుద్ధి అవుతుంది. బెల్లం తినేవారిలో రక్తహీనత కూడా తగ్గుతుంది. మహిళలు పానకం తాగితే ఎంతో మంచిది. వారికి నెలసరి సమయంలో వచ్చే ఎన్నో సమస్యలకు ఇది పరిష్కారం. ఈ పానకం తాగడం వల్ల శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి. కాబట్టి శ్రీరామనవమి రోజు గ్లాసు పానకాన్ని గడగడా తాగేయండి.
వడపప్పుతో ఆరోగ్యం
వడపప్పు చేయడానికి పెద్ద కష్టపడక్కర్లేదు. పెసరపప్పును నానబెట్టి బెల్లంతో కలిపితే సరిపోతుంది. పెసరపప్పు చలువ చేసే ఆహార పదార్థం. ఇది శరీరాన్ని వడదెబ్బ నుంచి, వేసవి తాపం నుంచి కాపాడుతుంది. అంతే కాదు బరువు తగ్గేందుకు కూడా సహాయపడుతుంది. దీనిలో విటమిన్ ఏ, బి, సి వంటి పోషకాలు నిండుగా ఉన్నాయి. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే శక్తి దీనికి ఉంది. ఆరోగ్యానికి ఇవి ఎంతో అవసరం. డయాబెటిస్ బారిన పడినవారు పెసరపప్పును తింటే మంచి జరుగుతుంది.
తీయటి చలివిడి
చలివిడిని బెల్లం, వరిపిండి కలిపి చేస్తారు. ఈ రెండు కూడా మన శరీరానికి అత్యవసరమైన పోషకాలను కలిగి ఉంటాయి. చలివిడిని పంచదారతో కాకుండా బెల్లంతోనే చేసుకోవాలి. కానీ ఎక్కువమంది సులువుగా అయిపోతుందని చలిమిడిని పంచదారతో చేయడానికి ఇష్టపడతారు. పంచదార ప్రాసెస్ చేసి తయారు చేస్తారు. కాబట్టి పంచదారని వదిలి బెల్లంతో చేయడం అలవాటు చేసుకోవాలి. బెల్లంతో చేసిన చలిమిడి కాస్త రంగు బ్రౌన్ రంగులో ఉంటుంది. అదే పంచదారతో చేసినదైతే తెల్లగా ఉంటుంది. దాన్నిబట్టి చలిమిడి దేనితో తయారు చేశారో తెలుసుకోవచ్చు.
Also read: కొత్తిమీరను రుచి, వాసన కోసమే వాడుతారనుకుంటే పొరపాటే - ఇది చేసే మేలు ఎంతో
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.