CoronaVirus: ఒమిక్రాన్ BA.5 మిగతా వేరియంట్లతో పోలిస్తే చాలా పవర్ ఫుల్, వ్యాక్సిన్ వేసుకున్నా వదలడం లేదు
కరోనా కాలం ముగిసిపోలేదు. కొత్త రూపాలతో విరుచుకుపడుతూనే ఉంది మహమ్మారి.
దేశంలో ఒక్కసారిగా కేసులు పెరగడం మొదలయ్యాయి. కరోనా అంతరించి పోతుందని ఆశపడుతున్న జనాలకు కేసులు పెరగడం కలవరానికి గురిచేస్తుంది. అయితే ఇప్పుడు మరో కలవరపెట్టే వార్త ఏంటంటే... కరోనా అన్ని వేరియంట్లలో ప్రమాదకరమైనదిగా మారింది BA.5 వేరియంట్. కారణం మూడు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారిని కూడా వదలడం లేదు. సులువుగా సోకేస్తుంది. కాకపోతే ప్రమాదకర పరిస్థితుల వరకు రోగి చేరుకోకపోవడం కాస్త ఊరటనిస్తుంది. మిగతా వేరియంట్లతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ వ్యాక్సిన్ నిరోధకతను కలిగిఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కరోనా మార్పులు చెందుతోందని, ఇంకా ముగిసిపోలేదని ప్రకటించింది. టీకాలు వేయించుకున్నవాళ్లకి కూడా ఇది సోకుతోంది.
ఫైజర్, మోడెర్నా వంటి టీకాలు వేయించుకున్న వారికి ఒమిక్రాన్ వేరియంట్ BA.5 సోకుతున్నట్టు గుర్తించారు. ఈ వేరియంట్ ను అడ్డుకోవడానికి ఆ టీకాల సామర్థ్యం ఏమాత్రం సరిపోవడం లేదని ఒక తాజా అధ్యయనం చెప్పింది. అమెరికాలో అధికంగా ఫైజర్, మోడెర్నా వంటి టీకాలు వేయించుకున్నవారే అధికం. అందుకే మళ్లీ అమెరికాలోనూ కేసులు పెరుగుతున్నట్టు అభిప్రాయపడ్డారు.
అక్కడ నుంచే...
దక్షిణాఫ్రికాలో BA.4, BA.5 సబ్ వేరియంట్లు వేరే ప్రాంతాలకు వ్యాప్తి చెందినట్టు మొదట్నించి భావిస్తున్నా ఆరోగ్య శాస్త్రవేత్తలు. ఆ దేశం నుంచి చాలా దేశాలు ప్రయాణించిన ఆ సబ్ వేరియంట్లు భారత్ రావడానికి మాత్రం చాలా సమయం పట్టింది. ఇప్పుడు మనదేశంలో కూడా కేసులు బయటపడుతున్నాయి. తమిళనాడుకు చెందిన 19 ఏళ్ల యువతిలో BA.4 వేరియంట్ ను గుర్తించారు. అలాగే తెలంగాణాకు చెందిన ఓ వ్యక్తిలో BA.5 బయటపడినట్టు ఇన్సాకాగ్ రిపోర్టు చెప్పింది.
ఇది చాలా తేడా...
సాధారణంగా కరోనా వైరస్ సోకి తగ్గిన వారిలో రోగనిరోధక శక్తి అధికంగానే ఉంటుంది. కొన్ని నెలల పాటూ అది మళ్లీ వైరస్ సోకకుండా కాపాడుతుంది. అయితే BA.5 మాత్రం రోగనిరోధక శక్తిని హరిస్తూ ప్రమాదకర సంకేతాలను పంపించింది. దీంతో టీకాల సామర్థ్యంపై మళ్లీ చర్చలు మొదలయ్యాయి. ఆఖరికి మూడు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న వారికి కూడా BA.5 సులువుగా సోకుతున్నట్టు గుర్తించారు. అన్ని వేరియంట్ల కన్నా ఈ వేరియంట్ తో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు ఆరోగ్యనిపుణులు.
Also read: చిన్న చేపలు ఇలా ఫ్రై చేస్తే టేస్టు మామూలుగా ఉండదు