Antibiotics: యాంటీబయోటిక్ మందులు తీసుకునేటప్పుడు చేయకూడని పనులు ఇవే
యాంటీబయోటిక్స్ ట్యాబ్లెట్స్ వాడేటప్పుడు కొన్ని రకాల ఆహారాలు తినకూడదు.
యాంటీబయోటిక్స్ అంటే ప్రజల దృష్టిలో అద్భుత కషాయం. వేసుకుంటే ఏ నొప్పయినా ఇట్టే నయమైపోతుందనుకుంటారు. అందుకే ముందు సాధారణమందులతో నయం కాకపోతే తరువాత వైద్యులు యాంటీ బయోటిక్స్ ఇస్తారు. కానీ చాలా మందికి వాటిని వేసుకునేటప్పుడు పాటించాల్సిన కొన్ని నియయాలపై అవగాహన లేదు. అవి ఇన్ఫెక్షన్ల నుంచి బయపడటానికి సహాయపడతాయి, కానీ వాటిని సరిగా తీసుకోకపోతే మాత్రం దుష్ప్రభావాలు తప్పవు. శరీరంలోని కొన్ని అవయవాలను కూడా ప్రభావితం చేస్తాయి. ఇలా దీర్ఘకాలంగా యాంటీబయోటిక్స్ దుష్ప్రభావాలు శరీరంపై పడితే చాలా నష్టం కలుగుతుంది. కాబట్టి యాంటీబయోటిక్స్ తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
చేయకూడని పనులు
1. యాంటీబయోటిక్ మందులు మింగేటప్పుడు కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా పాలు, ఆల్కహాల్, ఎసిడిటీకి కారణమయ్యే ఆహారాలను దూరంగా పెట్టాలి.
2. యాంటీబయోటిక్స్ తీసుకున్న తరువాత మీకు ఏవైనా అలెర్జీ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. నిర్లక్ష్యం చేయవద్దు. దద్దుర్లు, జ్వరం, వాపు, శ్వాస ఆడకపోవడం, నిద్రపోయినప్పుడు గురక రావడం వంటివి యాంటీ బయోటిక్ పడలేదని చెప్పే లక్షణాలు.
3. పిల్లలకు ఈ మందును సిరప్ రూపంలో రాస్తారు. అలాంటప్పుడు ఆ సీసాను బాగా షేక్ చేశాకే వారికి వేయండి. ఎక్కువ సిరప్ వేస్తే త్వరగా తగ్గిపోతుందనుకోకండి. వైద్యుడు ఎంత చెప్పారో అంతే క్వాంటిటీ వేయండి.
4. ఖాళీ పొట్టతో యాంటీ బయోటిక్స్ తీసుకుంటే కళ్లు తిరిగే ప్రమాదం ఉంది. ఆహారం తిన్న వెంటనే కూడా వేసుకోకూడదు. దీని వల్ల ఒక్కోసారి వాంతులు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆహారం తిన్నాక ఓ అరగంట అయ్యాక వేసుకుంటే మంచిది.
5. యాంటీబయోటిక్స్ ట్యాబ్లెట్‌ను నిమ్మరసం, కొబ్బరి నీళ్లతో, పాలతో వేసుకునే వాళ్లు ఉంటారు. కానీ అలా వేసుకోకూడదు. కేవలం నీళ్లతోనే వేసుకోవాలి. అలాగని ఐసు వాటర్ తో వేసుకోకూడదు. గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీటిని మాత్రమే వాడాలి.
6. కొన్ని పవర్‌ఫుల్ యాంటీ బయోటిక్స్ కి సైడ్ ఎఫెక్టులు ఎక్కువ ఉంటాయి. అంటే వేసుకోగానే కళ్లు తిరిగినట్టు అవ్వడం, తలనొప్పి రావడం లాంటివి. వాటిని ముందే వైద్యుడిని అడిగి తెలుసుకోవాలి. చాలా మంది ఇలాంటి సైడ్ ఎఫెక్టులు కలగగానే మందు పడడం లేదు అంటూ వేసుకోవడం మానేస్తారు. అలా చేయవద్దు.
7. ఒకసారి వైద్యుడు రాశాక ఆ ప్రిస్క్రిప్షన్ దాచుకుని మళ్లీ ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు మీకు మీరే కొనుక్కుని సొంతవైద్యం చేసుకోవద్దు. ఎంతో అవసరం అయితే తప్ప వాటిని తీసుకోకండి. చిన్న చిన్న వైరల్ ఇన్ఫెక్షన్ల కోసం వీటిని వాడద్దు. కేవలం బ్యాక్టిరియల్ ఇన్ఫెక్షన్ల కోసమే వీటిని వాడాలి. అది కూడా వైద్యుడు సూచిస్తే మాత్రమే.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు
Also read: ఆల్కలీన్ ఆహారాలు ఏమిటో తెలుసా? ఇవి తినడం చాలా ముఖ్యం
Also read: పాదాలకు వేసుకునే సాక్సులో ఉల్లిపాయలు పెట్టుకుంటే నిజంగానే జలుబు, జ్వరం తగ్గిపోతాయా?