Red Ant Chutney : ఎర్రని చీమలతో టేస్టీ చట్నీ.. ఈ దేశీ వంటకానికి GI ట్యాగ్ కూడా ఇచ్చేశారుగా
Similipal Kai Chutney : చట్నీకి కాదేది అనర్హం అన్నట్లు.. ప్రస్తుతం చీమలతో చేసే చట్నీ గురించే చర్చ నడుస్తుంది. పైగా దీనికి GI ట్యాగ్ రావడంతో దీని గురించి తెలుసుకోవాలనే ఆత్రం పెరిగిపోతుంది.
Red Ant Chutney Benefits : సాధారణంగా చీమలు చూస్తే అమ్మో కుడతాయి అనుకుంటాము. ముఖ్యంగా ఎర్రని చీమలు చూస్తే ముందే భయం పట్టుకుంటుంది. అలాంటిది ఓ ప్రాంతంలో ఎర్రని చీమలతో టేస్టీ, స్పైసీ చట్నీ చేసుకుంటారు. ఇదెక్కడో చైనాలోనేమో.. వాళ్లు అలాగే తింటారు అనుకుంటే పొరపాటే. ఇది అచ్చంగా మన భారతదేశంలోని ఒడిశాలో జరుగుతుంది. ఇప్పుడు ఇది ఎందుకు హాట్ టాపిక్ అయ్యిందంటే.. వాళ్లు చట్నీ చేసుకోవడం ఏమో కానీ.. దానికి GI ట్యాగ్ కూడా వచ్చింది. ఆ రెడ్ యాంట్ చట్నీలో అంతగా ఏముంది GI ట్యాగ్ రావడానికి అనేది మెయిన్ టాపిక్ అయిపోయింది. అసలు ఈ ఎర్ర చీమల చట్నీ ఏమిటి? దీనికి GI ట్యాగ్ ఎందుకు వచ్చింది? దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎర్ర చీమలతో చట్నీ..
ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లా అడవులకు ప్రసిద్ధి చెందింది. కాబట్టి ఈ జిల్లాలో గిరిజనులు ఎక్కువగా ఉంటారు. జీవనాధారం కోసం అడవిపై ఆధారపడుతుంటారు. దీనిలో భాగంగానే వారు అక్కడ విరివిగా దొరికే రెడ్ వీవర్ చీమలను సేకరించి.. వాటిని విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ చీమలు కుట్టవేమో అనుకుంటే పొరపాటే.. కుడితే పెద్ద పెద్ద బొబ్బలు రావడం ఖాయం. కానీ అక్కడి గిరిజనులకు ఈ పనులు ఎప్పటినుంచో అలవాటు అయిపోయాయి. ఈ చీమలను, వాటి గుడ్లను గిరిజనులు సేకరించి.. శుభ్రం చేసి.. చట్నీ తయారు చేస్తారు. ఉప్పు, పచ్చిమిర్చి, అల్లం-వెల్లుల్లి వంటి మసాలా దినుసులతో చట్నీ చేస్తారు. దీనినే 'సిమిలిపాల్ కై చట్నీ' అంటారు. ఇది హాట్, పుల్లని రుచిని కలిగి ఉంటుంది. అలాంటి ఈ చట్నీకి 2024, జనవరి 2వ తేదీన GI ట్యాగ్ లభించింది.
GI ట్యాగ్ ఎలా వచ్చిందంటే..
రెడ్ వీవర్ యాంట్ చట్నీ(సిమిలిపాల్ కై చట్నీ) అంటే కాస్త వింతగా, విడ్డూరంగా ఉన్నా.. దీనిలో పోషక, ఔషద గుణాలు ఎన్నో ఉన్నాయి. దీని రుచి, పోషక విలువల వల్లనే ఈ చట్నీ ప్రసిద్ధి చెందింది. దీనిని దృష్టిలో పెట్టుకున్న మయూర్భంజ్ కై సొసైటీ లిమిటెడ్ 2020లో జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ యాక్ట్, 1999 కింద సిమిలిపాల్ కై చట్నీని GI రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసింది. చట్నీ ప్రత్యేకతను హైలైట్ చేస్తూ.. దీనిని అప్లై చేశారు. దరఖాస్తు మూల్యాంకన తర్వాత.. దానిని ఆమోదించి.. ఆహార ఉత్పత్తుల వర్గీకరణలో ఈ చట్నీని అధికారికంగా పేరు సంపాదించుకుంది.
చట్నీలోని పోషకవిలువలు..
సిమిలిపాల్ కై చట్నీకి వినియోగించే చీమల్లో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, కాల్షియం, జింక్, ఐరన్, అమైనో యాసిడ్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మెదడు, నాడీ వ్యవస్థ అభివృద్ధిలో ముఖ్యపాత్ర పోషిస్తుందని పలు అధ్యయనాలు తెలిపాయి. డిప్రెషన్, అలసట, జ్ఞాపకశక్తిని కోల్పోవడం వంటి వాటి నిర్వహణలో సమర్థవంతంగా పని చేస్తాయి. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గిరిజనులు పోషకాహార అవసరాలను తీర్చుకుంటున్నారు. ఇది వ్యాధులకు విరుద్ధంగా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రుమాటిజం, చర్మ సమస్యలు, కడుపు సమస్యలకు దీనినుంచి ఉపశమనం కలుగుతుంది.
Also Read : పిల్లలు ఇష్టంగా తినే బీట్రూట్ బ్రౌనీలు.. రెసిపీ ఇదే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.