Diabetes: ఓట్స్ ఇడ్లీ - డయాబెటిస్ వారి కోసం ప్రత్యేకం ఈ బ్రేక్‌ఫాస్ట్
డయాబెటిస్ ఉన్నవారు ఏం తినాలన్నా కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. వారికి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ ఓట్స్ ఇడ్లీ.
డయాబెటిస్ వ్యాధి ఉన్నవారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వారు తినే పదార్థాలు కేవలం రక్తంలో చక్కెర స్థాయిలను పెంచకుండా ఉండడమే కాదు, తగ్గించేలా కూడా ఉండేలా చూసుకోవాలి. అలాంటి ప్రత్యేకమైన బ్రేక్ ఫాస్ట్ ఓట్స్ ఇడ్లీ. దీనిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. వారికి శక్తిని అందిస్తాయి. కాబట్టి వారంలో కనీసం రెండు మూడు సార్లు ఈ ఓట్స్ ఇడ్లీని చేసుకొని తినడం వల్ల డయాబెటిస్ రోగులకు ఎంతో మంచిది. వోట్స్ వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. డయాబెటిస్ ఉన్న వారికి వోట్స్ అద్భుతమైన ఆహారంగానే చెప్పుకోవాలి. ఇవి మనదేశంలో పండవు. కానీ విదేశాల్లో మాత్రం విపరీతంగా పండుతాయి. ఇది మనదేశానికి చెందిన పంట కాకపోయినా కూడా ఇక్కడ మంచి ప్రాచుర్యం పొందాయి.
కావలసిన పదార్థాలు
ఓట్స్ - రెండున్నర కప్పులు
పెరుగు - 1 1/2 కప్పు
బేకింగ్ సోడా - అర స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
పచ్చిమిర్చి తరుగు - ఒక స్పూను
ఇంగువ - చిటికెడు
ఆవాలు - ఒక స్పూను
రవ్వ - రెండున్నర కప్పులు
బఠానీలు - గుప్పెడు
కొత్తిమీర తరుగు - ఒక కట్ట
క్యారెట్ తరుగు - ఆరు స్పూన్లు
నూనె - ఒక స్పూన్
మజ్జిగ - పావు లీటరు
తయారు చేసే విధానం
1. ముందుగా పైన ఉన్న వాటిలో కూరగాయలన్నింటినీ తీసి బాగా కడిగి పక్కన పెట్టుకోండి.
2. ఓట్స్‌ను పాన్‌లో వేసి చిన్న మంట మీద ఐదు నిమిషాలు వేయించండి. తర్వాత వాటిని మిక్సీలో వేసి పొడిలా చేసుకోండి.
3. కళాయిలో రవ్వ వేసి వేయించండి. వేయించిన ఆ రవ్వను పొడిలా చేసి పెట్టుకున్న ఓట్స్‌తో కలపండి.
4. స్టవ్ మీద కళాయి పెట్టి అందులో ఒక స్పూన్ నూనె వేయండి.
5. ఆ నూనెలో ఆవాలు చిటపటలాడే వరకు వేయించండి.
6. తరువాత తరిగిన క్యారెట్, పచ్చి బఠానీలు, పచ్చిమిర్చి రెండు నిమిషాలు వేయించండి.
7. తర్వాత ఆ మిశ్రమంలో కలిపి పెట్టుకున్న ఓట్స్ మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలపండి. అందులో ఉప్పు, ఇంగువ పొడి, కొత్తిమీర తరుగు, వంట సోడా, పెరుగు, మజ్జిగ కూడా వేసి బాగా కలపండి.
8. ఇడ్లీ పిండి మందానికి ఆ మిశ్రమం వచ్చేవరకు కలపండి.
9. తర్వాత స్టవ్ కట్టేసి మూత పెట్టి కొన్ని నిమిషాలు పక్కన పెట్టండి.
10. ఇడ్లీ ప్లేట్లకు నూనె రాసుకుని ఈ మిశ్రమాన్ని ఇడ్లీల్లా వేసుకోవాలి. ఆవిరి మీద ఉడికించాలి.
11. సాంబార్‌తో లేదా చట్నీతో ఈ ఓట్స్ ఇడ్లీ చాలా టేస్టీగా ఉంటాయి.
Also read: రోటీని నేరుగా మంట మీద కాల్చడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా?
Also read: బొప్పాయి తినడం వల్ల నిజంగా గర్భస్రావం జరుగుతుందా? ఇది ఎంతవరకు నిజం
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.