Husband For Sale: భర్తను ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టిన భార్య.. కొనేందుకు సిద్ధమైన మహిళలు, ధర ఎంతంటే..
ఓ భార్య ఏకంగా తన భర్తనే వేలానికి పెట్టింది. చిత్రం ఏమిటంటే.. అతడిని కొనుగోలు చేసేందుకు 12 మంది మహిళలు ముందుకొచ్చారు. ఆన్‌లైన్ వేలంలో కూడా పాల్గొన్నారు.
‘శుభలగ్నం’ సినిమాలో ఆమని.. తన భర్త జగపతి బాబును రోజాకు అమ్మేస్తేనే.. ‘‘అయ్యో.. రామా, ఇలాంటి భార్యలు కూడా ఉంటారా?’’ అని ముక్కున వేలు వేసుకున్నాం. అది సినిమా కాబట్టి.. అలాంటివి ఎక్కడా జరగవు కాబట్టి.. అంత సీరియస్‌గా కూడా తీసుకోలేదు. కానీ, అలాంటి ఘటన నిజంగానే జరిగింది. కానీ, ఆమె తన భర్తను వేరే యువతికి అమ్మేయలేదు. ఏకంగా ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టింది. అంతేకాదు.. కొన్ని షాకింగ్ కండీషన్స్ కూడా పెట్టింది.
న్యూజిలాండ్‌కు చెందిన లిండా మెక్అలిస్టర్ అనే మహిళ.. తన భర్త జాన్ మెక్‌అలిస్టర్‌ను ‘ట్రేడ్ మీ’ అనే ఆన్‌లైన్ సైట్‌లో వేలానికి పెట్టింది. వేసవి సెలవుల్లో భాగంగా జాన్ తన ఇద్దరు పిల్లలతో ఫిష్షింగ్ ట్రిప్‌కు వెళ్లాడు. ఆమెను ఒంటరిగా ఇంట్లోనే వదిలేశాడని ఆమెకు కోపం వచ్చిందో ఏమో.. ఏకంగా అతడి ఫోటోను ట్రేడ్ మీ ఆన్‌లైన్ సైట్‌లో పెట్టి.. ‘నా భర్తను అమ్మేస్తున్నా’ అని ప్రకటించింది. అతడి వయస్సు 6.1 అడుగులు. వయస్సు 37 ఏళ్లు. రైతు, వేటగాడే కాదు, జాన్ మంచి జాలరి కూడా అని పేర్కొంది.
ఆ సైట్‌లో ఆమె తన భర్తను ఓ ప్రొడక్ట్ (ఉత్పత్తి)గా అభివర్ణించింది. ఈ సందర్భంగా అతడిని వాడేసిన వస్తువు(Used) అని పేర్కొంది. అంతేగాక, ఇంతకు ముందు అతడికి చాలామంది యజమానులు ఉన్నారని, ఆహారం పెడితే విధేయుడిగా ఉంటాడని తెలిపింది. ‘‘అతడికి ఇంకా ఇంట్లో ఎలా మెలగాలో శిక్షణ ఇవ్వాలి. కానీ, నాకు అంత సమయం, ఓపిక లేదు. ఈ సేల్ ఫైనల్. ఆ తర్వాత ఎక్స్‌ఛేంజ్, రిటర్న్‌లు ఉండవు’’ అని స్పష్టం చేసింది. ‘‘ఒక్కోసారి నేను నిద్రపోతున్నప్పుడు, పాఠశాలలకు సెలవులు ఉన్నప్పున్నప్పుడు పిల్లలతో చల్లగా బయటకు జారుకుంటాడు’’ అంటూ అతడి అవలక్షణాలను కూడా బయటపెట్టింది. దీన్ని బట్టి.. ఆమె ఎందుకు తన భర్తను అమ్మకానికి పెట్టిందో అర్థం చేసుకోవచ్చు.
ఈ పోస్ట్ చూసిన జాన్ స్నేహితులు.. అతడికి స్క్రీన్ షాట్స్ పంపించారు. వాటిని చూడగానే జాన్ తొలుత ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత పగలబడి నవ్వాడు. చిత్రం ఏమిటంటే.. జాన్‌ను కొనుగోలు చేయడానికి సుమారు 12 మంది బిడ్డింగ్(వేలం)లో పాల్గొన్నారు. లిండా తన భర్త జాన్ కనీస విలువను 25 న్యూజిలాండ్ డాలర్లు(రూ.1243)గా పేర్కొంది. బిడ్డింగ్‌లో ఆ ధర 100 న్యూజిలాండ్ డాలర్లు.. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.5వేలు వరకు చేరింది. అంతేగాక జాన్‌ను కొనుగోలు చేయడానికి బిడ్డింగ్‌లో పాల్గొన్న అమ్మాయిలు అతడి గురించి మరింత తెలుసుకొనేందుకు లిండాను సంప్రదించడం గమనార్హం.
‘‘అతడికి ఏమైనా బ్యాడ్ హాబిట్స్ ఉన్నాయా?’’ అని ఓ మహిళ ప్రశ్నించగా.. ‘‘అతడు సాక్స్‌లను ఫ్లోర్ మీద పడేసే రోగంతో బాధపడుతున్నాడు’’ ఫన్నీగా సమాధానం ఇచ్చింది. అయితే, ఈ బిడ్‌ను ‘Trade Me’ సంస్థ తొలగించింది. నిబంధనలుకు అనుగుణంగా ఈ బిడ్ లేదనే కారణంతో ఈ చర్యలు తీసుకున్నామని ‘ట్రేడ్ మీ’ పాలసీ కంప్లైయెన్స్ మేనేజర్, జేమ్స్ ర్యాన్ తెలిపారు. మరి, లిండా.. తన భర్తను అమ్మేసిందా? లేదా మరేదైనా ఆన్‌లైన్ సైట్లో అమ్మకానికి పెట్టిందా అనేది ఇంకా తెలియరాలేదు.