Walking: జస్ట్ 11 నిమిషాల నడక చాలు మీరు ఎక్కువ కాలం జీవించడానికి
నడక ఆరోగ్యానికి ఎంత మంచిదనే విషయం మరోసారి రుజువైంది. మీ జీవితకాలం ఆరోగ్యంగా ఉండేందుకు వారానికి కేవలం 75 నిమిషాలు చాలని నిపుణులు చెబుతున్నారు.
ఆరోగ్యంగా ఉండటం కోసం చెమటలు పట్టేలా జిమ్ లో కష్టపడాల్సిన అవసరం లేదు. గుండె జబ్బులు, స్ట్రోక్, అనేక రకాల క్యాన్సర్లు వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి కేవలం 11 నిమిషాల నడక చాలని కొత్త అధ్యయనం చెబుతోంది. అంటే వారానికి 75 నిమిషాలు. చురుకుగా నడవడం, డాన్స్ చేయడం, సైకిల్ తొక్కడం, టెన్నిస్ ఆడటం, మెట్లు ఎక్కడం వంటివి చేస్తే సరిపోతుంది. సాధారణంగా ఆరోగ్యంగా ఉండాలంటే వారానికి కనీసం 150 నిమిషాలు శారీరక శ్రమ అవసరం. రోజుకి 10 లేదా 11 నిమిషాల పాటు నడవటం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం బారినపడరని యూకేలోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకుల బృందం వెల్లడించింది.
మీరు వారానికి 150 నిమిషాల వ్యాయామం చేయడం ఇబ్బంది అనుకుంటూ 75 నిమిషాలు చేయవచ్చని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణం గుండె జబ్బులు, స్ట్రోక్ వంటివి. 2019 సంవత్సరంలో 17.9 మిలియన్ల మంది వీటి కారణంగానే ప్రాణాలు కోల్పోయారు. 2017లో 9.6 మిలియన్ల మంది క్యాన్సర్ బారిన పడి ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలు చెబుతున్నాయి.
నడక ఎంత మంచిదో..
బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం వారానికి 75 నిమిషాలు మితమైన శారీరక శ్రమ చేయడం వల్ల హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని 17 శాతం తగ్గుతుందని పరిశోధకులు తెలిపారు. క్యాన్సర్ 7 శాతం తగ్గించడానికి అవకాశం ఉంటుందని కనుగొన్నారు. తల, మైలోయిడ్ లుకేమియా, మైలోమా, గ్యాస్ట్రిక్ కార్డియా క్యాన్సర్లు 14-26 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. ఇక ఊపిరితిత్తులు, కాలేయం, ఎండోమెట్రియల్, పెద్ద పేగు, రొమ్ము క్యాన్సర్ వంటి ఇతర క్యాన్సర్లు 3-11 శాతం తక్కువ ప్రమాదం కలిగి ఉంటుందని తెలిపారు.
వాకింగ్ వల్ల ప్రయోజనాలు..
వాకింగ్ లేదా సైక్లింగ్ వంటి శారీరక శ్రమ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది హృదయ స్పందన రేటు పెంచుతుంది. రోజుకి కనీసం 10 నిమిషాలు వ్యాయామం గుండెని ఆరోగ్యంగా ఉంచి క్యాన్సర్ల ప్రమాదాన్ని అదుపులో ఉంచుతుంది. దీని వల్ల జీవితకాలాన్ని పొడిగించుకోవచ్చు. నిత్యం వాకింగ్ చేయడం వల్ల కీళ్ళు బాగా పని చేస్తాయి. శరీరం మొత్తం ఆక్సిజన్ సరఫరా బాగా జరుగుతుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బరువు తగ్గుతారు. నడిచేటప్పుడు చేతులు ముందుకు వెనుకకి కదిలించడం వల్ల శరీరానికి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి కాసేపు మాట్లాడుకుంటూ నడవటం మంచిది. పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే పార్కులో నడిస్తే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. నడుస్తూనే మధ్య మధ్యలో జాగింగ్, రన్నింగ్ చేయడం ఇంకా మంచిది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.