Heart Attack: గుండె జబ్బులు రాకూడదంటే ఈ టీ తాగండి
ఉదయం లేవగానే వేడి వేడి టీ తాగితే చాలా రిఫ్రెష్ గా ఉంటుంది. అయితే మామూలు టీకి బదులుగా బ్లాక్ టీ తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.
టీ ప్రియులు చాలా మంది ఉంటారు. మిల్క్ టీ, గ్రీన్ టీ, బ్లాక్ టీ.. ఇలా అనేక రకాలుగా ఉంటాయి. ఆందోళనగా ఉన్నప్పుడు, పని ఒత్తిడి ఎక్కువగా అనిపించినా, తలనొప్పి వచ్చినా ఎక్కువగా ఎంచుకునేది టీ. వేడి వేడి టీ తాగితే ఎంతో హాయిగా అనిపిస్తుంది. మనకి ఉన్న అలసట నుంచి కొంతవరకు ఉపశమనం లభిస్తుంది. అయితే అన్నింటిలోకెల్లా బ్లాక్ టీ చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. క్రమం తప్పకుండా బ్లాక్ టీ తాగడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
బ్లాక్ టీ కామెల్లియా సినేసిస్ అనే మొక్క నుంచి వచ్చిన ఆకులతో తయారు చేస్తారు. ఇందులో ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఈ ఫ్లేవనాయిడ్లు బ్లాక్, గ్రీన్ టీ, యాపిల్స్, నట్స్, సిట్రస్ ఫ్రూట్స్, బెర్రీలు వంటి సాధారణ ఆహారాలు, పానియాల్లో సహజంగా లభిస్తాయి. దీని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే బ్లాక్ టీ తాగడం వల్ల అనుకున్న దాని కంటే ఎక్కువ మేలు పొందుతారని తాజా అధ్యయనం వెల్లడించింది.
ఏమిటి ఈ అధ్యయనం?
ఎడిత్ కోవన్ విశ్వవిద్యాలయం గతంలో ఇచ్చిన అధ్యయనం కంటే బ్లాక్ టీ వల్ల మరింత మెరుగైన ఫలితాలు పొందుతారని పరిశోధకులు తేల్చారు. 881 మంది వృద్ధ మహిళలు ఇందులో పాల్గొన్నారు. వారి సగటు వయస్సు 80 సంవత్సరాలు. వాళ్ళు తమ ఆహారంలో అధిక స్థాయిలో ఫ్లేవనాయిడ్లని తీసుకోవడం వల్ల Abdominal Aortic Calcification (AAC) వ్యాకోచం చాలా తక్కువగా ఉందని కనుగొన్నారు. AAC అనేది పొత్తికడుపు బృహద్ధమని కాల్సిఫికేషన్. శరీరంలోని అతి పెద్ద ధమని ఇది. గుండె నుంచి ఉదర అవయవాలకి, దిగువ అవయవాలకి ఆక్సిజన్ తో కూడిన రక్తాన్ని సరఫరా చేస్తుంది. గుండెపోటు, స్ట్రోక్ వంటి హృదయ సంబంధ ప్రమాదాలని ముందుగానే అంచనా వేస్తుంది.
ఫ్లేవనాయిడ్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు వెల్లడించారు. బ్లాక్ లేదా గ్రీన్ టీ, బ్లూ బెర్రీస్, స్ట్రా బెర్రీలు, నారింజలు, రెడ్ వైన్, యాపిల్స్, ఎండు ద్రాక్ష, డార్క్ చాక్లెట్ లో ఇది ప్రధానంగా ఉంటుంది. ఫ్లేవనాయిడ్స్ లో రకాలు ఉన్నాయి. ఫ్లేవాన్-3 ఓల్స్, ఫ్లేవానాల్స్ అని రెండు రకాలుగా ఉంటాయి. ఇవి AACతో సంబంధం కలిగి ఉన్నట్లు అధ్యయనం సూచించింది. క్రమం తప్పకుండా బ్లాక్ టీ తాగే వారిలో హృదయ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం 16-42 శాతం తక్కువగా ఉంది.
బ్లాక్ టీ వల్ల ప్రయోజనాలు
యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. శరీరానికి అవసరమైన రోగనిరోధక శక్తిని ఇస్తుంది. ఇందులోని ఫ్లేవనాయిడ్లు రక్తంలో గడ్డలు ఏర్పడకుండా చేస్తుంది. రక్తనాళాల వ్యాకోచం తగ్గించడంలో సమర్థవంతంగా పని చేస్తుంది. క్యాన్సర్ కణాలని అడ్డుకుంటాయి. జీర్ణశక్తి మెరుగుపరుస్తుంది. నోటి క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది. రోజుకి రెండు కప్పుల బ్లాక్ టీ తీసుకోవచ్చు.
Also read: చలికాలంలో కీరదోస తినొచ్చా? ఆయుర్వేదం నిపుణులు ఏం చెప్తున్నారు