NeoCov: నియోకోవ్.. 2012లోనే వందలాది ప్రాణాలు తీసిన వైరస్ ఇది.. ఇప్పుడు మరింత ప్రమాదకారి!
ఒమిక్రాన్ వెళ్లిపోగానే.. మరో కొత్త వేరియెంట్ దాడి చేయడానికి పొంచి ఉంది. 2012లోనే దీన్ని కనుగొన్నా.. ఇప్పుడు అది మరింత బలపడి కోవిడ్-19 తరహాలో వ్యాప్తికి సిద్ధమవుతోంది.
ప్రపంచం ఇప్పటికే కరోనా వైరస్ వేరియెంట్లతో ముప్పుతిప్పలు పడుతోంది. మూలిగే నక్కపై తాటి పండు పడినట్లుగా.. ఇప్పుడు మరో కొత్త వైరస్ దాడికి సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. ప్రపంచానికి కరోనా అంటించిన ఉహాన్ శాస్త్రవేత్తలే ఈవిషయాన్ని వెల్లడించారు. అయితే, ఈ కొత్త వైరస్ దక్షిణాఫ్రికాలో కనుగొన్నట్లు వెల్లడించారు. నియోకోవ్ (NeoCov) అనే కొత్త వేరియెంట్ కరోనా కంటే ప్రమాదకరమైనదని తెలిపారు. ప్రస్తుతం ఇండియాలో వేగంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ వేరియెంట్‌ను కూడా దక్షిణాఫ్రికాలోనే కనుగొన్నారు. అది అక్కడి నుంచి ఇండియాకు రావడానికి ఎంతో సమయం తీసుకోలేదు. చాలా తక్కువ సమయంలోనే దేశమంతా వ్యాపించింది. మరి, ఇప్పుడు నియోకోవ్ పరిస్థితి ఏమిటీ? దాని లక్షణాలేమిటీ? దీన్ని ఎందుకు ప్రమాదకరంగా భావిస్తున్నారు?
2012లోనే కనుగొన్నారు: నియోకోవ్‌ను వైరస్ చాలా ప్రమాదకరమైనది. ఇది అధిక ఇన్ఫెక్షన్లను కలిగిస్తుంది. ఇది వ్యాపిస్తే మరణాల రేటు కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ వైరస్ గురించి ఇప్పటివరకు తెలిసిన వివరాలు అంతంత మాత్రమే. అయితే.. NeoCov అనేది కొత్త వైరస్ కాదు. ఇది MERS-CoV వైరస్‌తో సంబంధం కలిగి ఉంది. NeoCov వైరస్‌ను 2012లో మొదటిసారి కనుగొన్నారు. 2012 నుంచి 2015 మధ్య కాలంలో మధ్యప్రాచ్య దేశాల్లో (Middle Eastern countries) NeoCov వైరస్ వ్యాప్తి చెందింది. మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, దక్షిణాసియాలోని 27 దేశాల్లో ఈ వైరస్ వల్ల 858 మంది చనిపోయారు. అయితే ఇది SARS-CoV-2 కాదు. కానీ, దీనికి MERS Coronavirusతో సంబంధం ఉంది. MERS-CoV అంటే మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనావైరస్ (MERS-CoV) అని అర్థంది. ఇది డ్రోమెడరీ ఒంటెల నుంచి మనుషులకు వ్యాపించే వైరస్. ఇది ఇది జూనోటిక్ వైరస్ రకానికి చెందినది. అంటే ఇది జంతువుల నుంచి మనుషులకు సంక్రమిస్తుంది. WHO ప్రకారం.. ఈ వైరస్ సోకిన జంతువులను ప్రత్యక్ష లేదా పరోక్షంగా కలిస్తే వైరస్ సోకే ప్రమాదం ఉంది.
కొత్త లక్షణాలతో బలం పుంజుకున్న వైరస్: మళ్లీ ఈ వైరస్‌ను దక్షిణాఫ్రికాలో గబ్బిలాల్లో కనుగొన్నారు. వాస్తవానికి ఇది జంతువుల మధ్యే వ్యాప్తి చెందుతుంది. కానీ, శాస్త్రవేత్తలు ఈ వైరస్‌లో కొత్తగా NeoCov SARS-CoV-2 లక్షణాలను కనుగొన్నారు. ఈ నేపథ్యంలో నియోకోవ్.. మనుషులకు కూడా సోకుతుందని తెలుసుకున్నారు. వైరస్ మానవ కణాలలోకి చొరబడటానికి ఒకే ఒక మ్యుటేషన్ అవసరమని ఉహాన్ యూనివర్శిటీ, చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోఫిజిక్స్ పరిశోధకులు చెప్పారు. కరోనావైరస్ లేదా COVID-19 టీకా కారణంగా ఉత్పన్నమయ్యే యాంటీబాడీలు మానవ శరీరాన్ని NeoCov నుండి రక్షించలేవని హెచ్చరించారు.
నియోకోవ్ సోకిన ముగ్గురిలో ఒకరు మరణిస్తారు: ప్రస్తుతం కనుగొన్న నియోకోవ్.. COVID-19 తరహాలో వేగంగా వ్యాప్తి చెందే గుణాన్ని కలిగి ఉంది. నియోకోవ్‌లోని MERS-CoV వల్ల మరణాలు ఎక్కువగా ఉండవచ్చు. NeoCov మరణాల రేటు సుమారు 33% ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంటే ఈ వైరస్ సోకిన ముగ్గురిలో ఒకరు మరణిస్తారు. నియోకోవ్ వల్ల కలిగే ప్రమాదాన్ని ఇప్పట్లో అంచనా వేయడం కష్టమని గమలేయా సెంటర్‌లోని బయోటెక్నాలజీ లేబొరేటరీ అధిపతి సెర్గీ అల్ఖోవ్స్కీ అన్నారు. దీనిపై మరింత అధ్యయనం చేయాల్సి ఉందని తెలిపారు.