Relationships: మా ఇంట్లో మా అత్త మామలు అలా ప్రవర్తిస్తున్నారు, నాకు వారు నచ్చడం లేదు- ఓ అల్లుడి వ్యథ
తన భార్య తల్లిదండ్రులు తమ ఇంట్లో ప్రవర్తించే తీరు నచ్చడం లేదని చెబుతున్నా ఒక అల్లుడి కథ ఇది.
ప్రశ్న: మాది మధ్యతరగతి కుటుంబం. నా భార్యది ఎగువ మధ్యతరగతి కుటుంబం. పెళ్లికాకముందే నా భార్యకు, ఆమె తల్లిదండ్రులకు మా ఇంటి పరిస్థితులు తెలుసు. నేను అన్ని వివరించాకే పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాను. నా భార్య, తన తల్లిదండ్రులు అన్నింటికీ ఒప్పుకున్నారు. పెళ్లయిన తర్వాత కూడా నా భార్య విషయంలో నాకు ఎలాంటి అసంతృప్తి లేదు. ఆమె చక్కగానే సర్దుకుంటుంది. మధ్యతరగతి జీవితానికి అలవాటు పడింది. అయితే ఆమె తల్లిదండ్రుల విషయంలోనే నాకు మనస్థాపం కలుగుతోంది. మా పెళ్లయ్యాక మా అమ్మ నాన్న, మా ఇద్దరికి స్వేచ్ఛని ఇవ్వాలన్న కారణంగా మాతోపాటు కలిసి ఉండట్లేదు. చాలా దూరంగా నివసిస్తున్నారు. కానీ మా అత్తమామలు మాత్రం మా ఇంటికి దగ్గరలోనే నివసిస్తున్నారు. వారు ప్రతి విషయంలో మా ఇంట్లో జోక్యం చేసుకోవడం ప్రారంభించారు. మా నెలవారీ ఇంటి ఖర్చులు నుంచి, మేము తినే, తాగే ప్రతి దాన్ని నియంత్రిస్తున్నారు. ఇదే విషయాన్ని నా భార్యతో మాట్లాడితే... వారు ప్రేమను అలా చూపిస్తున్నారని అంటోంది. ఒక్కొక్కసారి ఆమె తల్లిదండ్రులు ప్రవర్తించే తీరు నాకు అవమానకరంగా ఉంటోంది. వారిని చూడాలని కూడా అనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నేనేం చేయాలి?
జవాబు: మీ తల్లిదండ్రులు మీకు వ్యక్తిగత స్వేచ్ఛను ఇవ్వాలని ఆలోచించారు. అలా వారు మీకు దూరంగా ఉంటున్నారు. కానీ భార్య తల్లిదండ్రులు మాత్రం అలా ఆలోచించడం లేదు, మిమ్మల్ని కాపాడుతున్నాం, సహాయం చేస్తున్నాం అనే ఉద్దేశంతో వాళ్లు మీకు దగ్గరగా ఉంటున్నారు. కానీ మీకు వారి ప్రవర్తన వల్ల ఇబ్బంది కలుగుతుందన్న విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. కొత్తగా పెళ్లయిన జంటకు స్వేచ్ఛ, ప్రైవసీ చాలా అవసరం. ఆ విషయాన్ని వారు గుర్తించకపోవడం బాధాకరం. కొన్నిసార్లు కొత్త జీవిత ప్రయాణాన్ని మొదలుపెట్టినప్పుడు యువ జంటకు మార్గదర్శకత్వం అవసరం పడుతుంది. ఆర్థిక విషయాలు, జీవిత విషయాలను గాడిలో పెట్టేందుకు పెద్ద వాళ్ళ సాయం అవసరం. అయితే ఆ సహాయాన్ని మీరు అడిగే వరకు ఓపిక పట్టే సహనం పెద్దలకు ఉండాలి. కానీ మీ అత్తమామలో ముందుగానే మీ విషయాల్లో జోక్యం చేసుకొని, మీరు ఎక్కడ ఇబ్బంది పడతారో అని అన్ని వాళ్లే నియంత్రించడం మొదలుపెట్టారు. అది ప్రేమే కావచ్చు కానీ అది మీకు ఇబ్బందిగా మారింది. ఈ విషయాన్ని వారితో మీరు చర్చించడం ముఖ్యం. ముందుగా మీ భార్యకు అర్థం అయ్యేలా చెప్పండి. కేవలం ఒక్క మాటతో చెప్పడం కాదు, కూర్చోబెట్టి ఈ విషయంపై మీరు ఏమనుకుంటున్నారో, మీరు ఎంతగా బాధపడుతున్నారో, మీపై ఎలాంటి ప్రభావం పడుతుందో వివరించండి. అలాగే మీకు స్వేచ్ఛ కావాలి అన్న విషయాన్ని కూడా చెప్పండి. ముఖ్యంగా మీ భార్యకు ఈ విషయాన్ని వివరించండి. మీరు నేరుగా చెబితే ఇబ్బంది అయ్యే అవకాశం ఉందనుకుంటే, కాబట్టి మీ భార్య చేత కూడా చెప్పించండి.
వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకోవడం వల్ల మీ ఇద్దరి మధ్య గొడవలు, మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉందని వారికి వివరించండి. మీరు ఎలాంటి పరిస్థితులు వచ్చినా తట్టుకునే సామర్థ్యం ఉన్నవారేనని వారికి వివరించండి. మీకు, మీ అత్త మామలకు ఇద్దరికీ ఇబ్బంది కలగకుండా ఈ పరిస్థితిని దాటుకుంటూ రావాలి. ఎందుకంటే వారు ఈ విషయంలో హర్ట్ అయితే భవిష్యత్తులో మీకు అందే సాయం పరిమితం కావచ్చు. అందుకే ఈ విషయాన్ని చాలా సున్నితంగా హ్యాండిల్ చేయాలి. స్వతంత్రంగా అన్ని విషయాలు నేర్చకుంటామని, ఇబ్బంది అయినప్పుడు కచ్చితంగా సలహాలు అడుగుతామని వారికి వివరించండి. అంతవరకు మీ వ్యక్తిగత స్వేచ్ఛకు, ప్రైవసీకి అడ్డు రావద్దని నీ భార్యతో చెప్పించండి. వారికి గౌరవం ఇచ్చే విషయంలో మాత్రం మీరు ఏమాత్రం వెనక్కి తగ్గద్దు. మీ తల్లిదండ్రులతో సమానంగా వారికి మీరు గౌరవం ఇవ్వాలి.
Also read: ఈ పుట్టగొడుగులు వెరీ కాస్ట్లీ, కిలో కొనాలంటే నెల జీతం ఖర్చు పెట్టాల్సిందే