Mushrooms: ఈ పుట్టగొడుగులు వెరీ కాస్ట్లీ, కిలో కొనాలంటే నెల జీతం ఖర్చు పెట్టాల్సిందే
ఖరీదైన ఆహార పదార్థాల్లో ఈ పుట్టగొడుగులు కూడా ఒకటి. వీటి పేరు గుచీ.
శాఖాహారులు పుట్టగొడుగులను పెద్దగా ఇష్టపడరు. కానీ మాంసాహారులు మాత్రం పుట్టగొడుగులను ఎంతగానో ఇష్టపడతారు. వీటిని వండితే నాన్ వెజ్ కర్రీలాగే అనిపిస్తుంది. అందుకే వీటి రుచికి దాసోహం అయినవారు ఎంతోమంది. మరి కొంతమంది ఆరోగ్య కోసం పుట్టగొడుగులను తినడానికి ఇష్టపడతారు. ప్రపంచంలో ఎన్నో రకాల పుట్టగొడుగులు ఉన్నాయి. వాటిలో కొన్ని మాత్రమే తినదగినవి. కొన్ని రకాల పుట్టగొడుగులు తినడం వల్ల మరణం సంభవించవచ్చు. అందుకే వీటి ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా తక్కువ రకాల పుట్టగొడుగులే తినేందుకు వీలుగా ఉన్నవి. అలాంటి పుట్టగొడుగుల్లో అతి ఖరీదైనవి ‘గుచీ పుట్టగొడుగులు’. వీటిని శాస్త్రీయంగా ‘మార్కులా ఎస్కులెంటా’ అని పిలుస్తారు. ముద్దుగా ‘స్పాంజ్ మష్రూమ్’ అంటారు. ఎందుకంటే ఇవి చూడడానికి స్పాంజి లాగే అనిపిస్తాయి. వండితే మెత్తగా అవుతాయి. ఇవి హిమాచల్ ప్రదేశ్ లోని వివిధ అడవుల్లో దొరుకుతాయి. చంబా, కులు, సిమ్లా, మనాలి వంటి ప్రదేశాల్లోని అడవుల్లో ఈ గుచీ పుట్టగొడుగులు కనిపిస్తాయి.
కిలో ఎంతంటే...
అక్కడ వీటిని ప్రత్యేకంగా సాగు చేయరు. అడవుల్లో ఇవే స్వచ్ఛందంగా పెరుగుతూ ఉంటాయి. ప్రజలు వెళ్లి ఏరుకొని తెచ్చి అమ్ముకుంటారు. మార్కెట్లో వీటి ధర కిలో 30 వేల రూపాయల వరకు ఉంటుంది. ఎందుకంటే ఇవి ఎత్తైన పర్వత ప్రాంతాల్లో మాత్రమే ఉంటాయి. ఖరీదైన హోటల్ లో మాత్రమే ఈ గుచీ పుట్టగొడుగుల వంటకాలు కనిపిస్తాయి. ఇవి పర్వతాలపై ఉన్న మంచు కరిగినప్పుడు మాత్రమే పెరుగుతాయి. ఈ పుట్టగొడుగుల కోసం ఎంతోమంది గ్రామస్తులు ఎత్తయిన కొండ ప్రాంతాల్లో వెతుకుతూ ఉంటారు. వీటిని కనిపెట్టడం అంత తేలికైన పని కాదు. వీటి సీజన్ వచ్చిందంటే చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలంతా కొండల మీదకే ప్రయాణమవుతారు.
ఇవి ఫిబ్రవరి నుంచి మార్చి నెలలో అధికంగా లభిస్తాయి. అందుకే ఆ సమయంలోనే హిమాచల్ ప్రదేశ్లోనే రెస్టారెంట్లలో ఈ గుచీ పుట్టగొడుగుల వంటకాలు సిద్ధంగా ఉంటాయి.
వీటిలో ఉండే అద్భుతమైన పోషకాలే వీటి ధర పెరిగేలా చేశాయి. ఈ గుచ్చి పుట్టగొడుగుల్లో విటమిన్ బి, విటమిన్ ఎ, డి, ఈ లతో పాటూ ముఖ్యమైన అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశం తగ్గుతుంది. ప్రోటీన్ కూడా ఇందులో అధికంగా ఉంటుంది. వీటిని తింటే ఎంతో ఆరోగ్యం. ఈ లక్షణాల వల్లే యూరోప్, అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ, స్విట్జర్లాండ్ దేశాల్లో ఈ పుట్టగొడుగులకు చాలా డిమాండ్ ఉంది.
Also read: స్లీప్ వాకింగ్ చేసేవారు ఇలాంటి పనులు కూడా చేస్తారు, జాగ్రత్త
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.