Millionaire: పద్దతి నచ్చలేదంట... బ్యాంకు స్టాఫ్‌కు వింత శిక్ష వేసిన మిలియనీర్
ఓ ధనవంతుడికి బ్యాంకు స్టాఫ్ పై కోపం వచ్చింది. దాన్ని ఎలా తీర్చుకున్నాడో చదివి తెలుసుకోండి.
చైనా మిలియనీర్లలో ఆయన ఒకడు. పేరేంటో తెలియదు కానీ, అక్కడి స్థానిక సోషల్ మీడియాలో మాత్రం ‘సన్‌వేర్’ అన్న పేరుతో ఖాతా నడుపుతున్నాడు. బోలెడంత డబ్బు, బంగ్లాలు, వ్యాపారాలు... లోటేమీ లేదు. ఓరోజు ఆయన బ్యాంకుకు వెళ్లాడు. అక్కడ ఏమైందో తెలియదు కానీ బ్యాంకు స్టాఫ్ పై కోపంతో ఊగిపోయాడు. ఆ బ్యాంకులో ఉన్న తన డబ్బునంతా విత్ డ్రా చేసుకుంటానని ప్రకటించాడు. అలా మొదటి విడతగా అయిదు మిలియన్ యువాన్లు విత్ డ్రా చేశాడు. అంటే మన రూపాయల్లో అయిదు కోట్ల ఎనభై లక్షల రూపాయలు. వాటిని వేరే బ్యాంకుకు ఆన్ లైన్ ట్రాన్స్ ఫర్ చేసుకోకుండా నోట్ల రూపంలో ఇవ్వమని అడిగాడు. పాపం అంతడబ్బుని బ్యాంకు వాళ్లు తీసి ఇచ్చారు. అంతటితో కోపం తగ్గలేదు మిలియనీర్ బాబుకు.
తనకు ఇచ్చిన డబ్బులు సరిగ్గా ఉన్నాయో లేదో తనకు తెలియడం ఎలా అంటూ వాదనకు దిగాడు. తన కళ్ల ముందే వాటిని లెక్కించమని ఆదేశించాడు. చేసేదేం లేక ఇద్దరు బ్యాంకు ఉద్యోగులు కూర్చోని ఒక లెక్కపెట్టే మెషీన్ సాయంతో ఆయన ముందే మొత్తాన్ని లెక్కపెట్టి బ్యాగుల్లో సర్దారు. ఇందుకు ఆ ఇద్దరు ఉద్యోగులకు రెండు గంటల సమయం పట్టింది. ఆ బ్యాంకు ఖాతాలో ఉన్న మిగతా సొమ్మును కూడా విత్ డ్రా చేసుకుంటానని చెప్పాడు మిలియనీర్. ఎందుకిలా చేస్తున్నారని అడిగితే ‘బ్యాంకు వాళ్ల పద్దతి నాకు నచ్చలేదు, ఆటిట్యూడ్ చూపిస్తున్నారు’ అంటూ సమాధానం ఇచ్చాడు. దాదాపు నాలుగు బ్రీఫ్ కేసుల్లో ఆ సొమ్మును మోసుకుంటూ బ్యాంకు సిబ్బంది అతని కారులో పెట్టారు.
బ్యాంకు సిబ్బంది మాత్రం తాము అతనితో పరుషంగా మాట్లాడలేదని, ఎలాంటి ఆటిట్యూడ్ చూపించిలేదని చెప్పారు. తమ సెక్యూరిటీ ఆయన్ను మాస్క్ పెట్టుకోమని కోరాడని, అందుకు ఆయన నిరాకరించాడని తెలిపారు. మాస్కు పెట్టుకోకపోతే ఎంట్రీ లేదనడంతో మిలియనీర్ కు విపరీతంగా కోపం వచ్చి ఈ నిర్ణయం తీసుకున్నాడని చెబుతున్నారు బ్యాంకు స్టాప్. ఇందులో ఏది నిజమో తెలియదు కానీ... కోట్ల నోట్ల కట్టలు లెక్కించిన విషయం మాత్రం చైనాలో వైరల్ అయింది.
Also read: ఒకే కాన్పులో తొమ్మిది మంది పిల్లలు... రోజుకు వంద డైపర్లు, ఆరు లీటర్ల పాలు
Also read: నిద్ర సరిగా పట్టడం లేదా... అయితే మీకు ఈ విటమిన్ లోపం ఉన్నట్టే
Also read: కరోనా కారణంగా భారతీయుల ఆయుర్ధాయం తగ్గిపోయిందా? కొత్త అధ్యయనంలో కలవరపెట్టే నిజాలు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి