Milk Coffee: మిల్క్ కాఫీ మంచిదే, కానీ ఈ సమస్యలున్న వాళ్ళు మాత్రం తాగకూడదండోయ్
మిల్క్ కాఫీ కూడా ఆరోగ్యానికి మంచిదే అంటుంది కొత్త అధ్యయనం. పరిశోధన ఏం చెప్పిందో తెలుసా?
పాల నురుగు వేసి మరీ తీసుకొచ్చే క్యాపుచినో, మోచా అంటే చాలా మందికి ఇష్టం. అయినా కాఫీని ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. పొద్దునే వేడి వేడి కాఫీ తాగితే వచ్చే మజానే వేరు. అయితే ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని చాలా మంది పాలతో చేసిన కాఫీ కంటే బ్లాక్ కాఫీనే ఎక్కువగా తీసుకుంటారు. బరువు తగ్గడంలో సహాయపడుతుందని నమ్ముతారు. మిల్క్ తో చేసిన కాఫీ తాగడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని అనుకుంటారు. అందుకే ఎక్కువమంది బ్లాక్ కాఫీ ఎంచుకుంటారు. అయితే పాలతో చేసిన కాఫీ వల్ల అనేక ప్రయోజనాలు అందిస్తుందని ఇటీవల ఒక అధ్యయనంలో వెల్లడైంది.
పరిశోధన ఏం చెబుతోంది
జర్నల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ కెమిస్ట్రీలో ప్రచురితమైన పరిశోధనలో పాలు కలిపిన కాఫీ తీసుకోవడం వల్ల శరీరంలో వాపులు తగ్గుతాయని వెల్లడించింది. పాలలో అమైనో ఆమ్లాలు, కాఫీలో ఉండే పాలీఫెనాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి రెండింటి కలయిక వల్ల కీళ్లలో వాపు, నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆర్థరైటిస్ లేదా ఇతర గాయాల కారణంగా శరీరంలో వాపు, నొప్పి సమస్యలు వస్తాయి. వాటిని మిల్క్ కాఫీ సమర్థవంతంగా ఎదుర్కొంటుంది.
పోషకాహార నిపుణుల అభిప్రాయం
పాలు ఆధారిత కాఫీని తీసుకోవడం వల్ల కాఫీలోని ఆమ్ల pHని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. ఇది ఎసిడిటి దాని వల్ల కలిగే ఏదైనా సమస్యని తగ్గిస్తుంది. బ్లాక్ కాఫీలో కెఫీన్ అధికంగా ఉంటుంది. ఇది ఆహారం నుండి ఐరన్, కాల్షియం, జింక్ వంటి ఖనిజాలను గ్రహించడం కష్టతరం చేస్తుంది. ఇది సిర్కాడియన్ రిథమ్ ని ప్రభావితం చేస్తుంది. లాక్టోస్ అసమతుల్యంగా ఉంటే పాలతో చేసిన కాఫీ మాత్రం తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. పాలు ప్రోటీన్లు, పిండి పదార్థాలు, కొవ్వులు కలిగి ఉంటాయి. ఎముకలకు చాలా ఆరోగ్యకరమైనవి.
మిల్క్ కాఫీ వల్ల ప్రయోజనాలు
పాల కాఫీ వల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. జీవక్రియని పెంచుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుందని పరిశోధన వెల్లడించింది. అంతే కాదు మధుమేహాన్ని కూడా నీయంత్రించగలదని పేర్కొంది. అయితే కాఫీ తీసుకునేటప్పుడు తగినంత మొత్తంలో నీరు కూడా తీసుకోవాలి. అది శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా కోలుకోవడంలో సహాయపడుతుంది.
మిల్క్ కాఫీ ఎవరు తాగకూడదు
ఒక కప్పు బ్లాక్ కాఫీలో దాదాపు 5 కేలరీలు ఉంటాయి. అదే పాలతో చేసిన కాఫీలో 60 కేలరీలు ఉంటాయి. అందుకే బరువు తగ్గాలని ప్రయత్నించే వాళ్ళు పాలతో చేసిన కాఫీ నివారించాలి. అందులో టీ స్పూన్ చక్కెర వేస్తే మరొక 15 కేలరీలు పెరుగుతాయి. అందుకే డైట్ ఫాలో అయ్యే వాళ్ళకు బ్లాక్ కాఫీ ఉత్తమ ఎంపిక. వాళ్ళే కాదు ఇప్పటికే ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు కూడా తప్పనిసరిగా ఈ కాఫీకి దూరంగా ఉండాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువైతే మీ గోళ్ళు చెప్పేస్తాయ్