Menopause: మగవారిలోనూ మెనోపాజ్- లక్షణాలు ఎలా ఉంటాయి? చికిత్స ఏంటి?
మహిళల మాదిరిగానే పురుషుల్లో కూడా మెనోపాజ్ వస్తుందట. దాన్ని సరైన సమయంలో గుర్తించి చికిత్స తీసుకోవాలి. లేకపోతే కష్టమే.
మహిళల్లో నలభై సంవత్సరాల దాటిన దగ్గర నుంచి మెనోపాజ్ మొదలవుతుంది. అలాగే పురుషుల్లో కూడా మెనోపాజ్ ఉంటుంది. దాన్ని వైద్య పరిభాషలో ఆండ్రోపాజ్ అంటారు. వయస్సు పెరిగే కొద్ది మహిళల మాదిరిగానే పురుషుల్లో కూడా హార్మోన్ల విడుదల విషయంలో మార్పులు చోటు చేసుకుంటాయి. టెస్టోస్టెరాన్ స్థాయిలు తక్కువగా ఉండటం వల్ల మగ వారిలో ఆండ్రోపాజ్ కనిపిస్తుంది. మహిళల్లో రుతుచక్రం ఆగిపోయిన తర్వాత అండోత్సర్గము పూర్తిగా ముగుస్తుంది. అలాగే పురుషుల్లో టెస్టోస్టెరాన్ స్థాయిలు హార్మోన్ ఉత్పత్తి నెమ్మదిస్తుంది. పురుషుల్లో 30 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి సంవత్సరం టెస్టోస్టెరాన్‌లో 1% నెమ్మదిగా క్షీణత ఉంటుంది.
వృద్ధాప్యం, మధుమేహం, హెచ్‌టీఎన్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా 45 నుంచి 50 ఏళ్ల వయస్సు వచ్చేసరికి వృషణాల పనితీరులో కొన్ని మార్పులు వస్తాయి. ఒక వ్యక్తి 70 ఏళ్లు దాటిన తర్వాత టెస్టోస్టెరాన్ స్థాయిల్లో 50% క్షీణతను సంభవిస్తుంది. ఇవే కాదు ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్, హార్మోన్ల లోపాలు, కాలేయం, మూత్రపిండాల వ్యాధి ఇన్ఫెక్షన్లు కూడా మగవాళ్ళల్లో ఆండ్రోపాజ్‌కు దారితీయవచ్చు.
ఆండ్రోపాజ్ కి కారణాలు
టెస్టోస్టెరాన్ అనేది పురుషుల సెక్స్ హార్మోన్. ఇది ప్రధానంగా వృషణాలలో ఉత్పత్తి అవుతుంది. తక్కువ టెస్టోస్టెరాన్ ఉత్పత్తి, వయస్సు, SHBG (సెక్స్ హార్మోన్ బైండింగ్ గ్లోబులిన్) అని పిలువబడే హార్మోన్ అధిక ఉత్పత్తి ఆండ్రోపాజ్ వచ్చేలా చేస్తుంది.
లక్షణాలు
అధిక శాతం శరీర కొవ్వు, అంగస్తంభన లోపం, సెక్స్ సామర్థ్యం తగ్గిపోవడం, నిద్ర లేమి, ఏకాగ్రత లోపించడం, అతిగా చెమట పట్టడం వంటివి కూడా కనిపిస్తాయి. మరి కొంతమంది పురుషుల్లో బోలు ఎముకల వ్యాధి, గుండె సంబంధిత సమస్యలు వంటి తీవ్రమైన సమస్యలు కూడా రావచ్చు.
వ్యాధి నిర్ధారణ
ఈ లక్షణాలు మీలో కనిపిస్తే వెంటనే యూరాలజిస్ట్ లేదా ఆండ్రోలజిస్ట్ దగ్గరకి వెళ్ళాలి. శారీరక పరీక్షలు, లక్షణాల ద్వారా రోగ నిర్ధారణ చేస్తారు. రోగ నిర్ధారణ జరిగితే తదుపరి చికిత్స చేస్తారు.
చికిత్స
ఇందుకోసం స్కిన్ ప్యాచ్ లు సహాయపడతాయి. టెస్టోస్టెరాన్ ప్యాచ్ ధరించే వ్యక్తులు చర్మం ద్వారా హార్మోన్‌ను స్వీకరించగలుగుతారు. టెస్టోస్టెరోన్ జెల్‌ను నేరుగా చర్మానికి చేతులపై పూసుకోవచ్చు. రాసుకున్న కొంతసమయం తర్వాత చేతులు తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలి. క్యాప్సూల్స్ రూపంలో కూడా వీటిని తీసుకోవచ్చు. రోజుకు రెండు సార్లు భోజనం చేసిన తర్వాత తీసుకోవాలి. కానీ గుండె జబ్బులు, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు క్యాప్సూల్స్ తీసుకోకపోవడమే ఉత్తమం. ఇవే కాదు వ్యాయామం, మంచి పోషకాలు ఉండే ఆహారం తీసుకోవడం, ఒత్తిడి తగ్గించుకోవడం, జీవన శైలిలో మార్పులు చేసుకుంటే ఆండ్రోపాజ్ లక్షణాలను అధిగమించవచ్చు. కొంతమంది పురుషులకు మందుల ద్వారానే కాకుండా టెస్టోస్టెరాన్ పునఃస్థాపన థెరపీ కూడా చేయవచ్చు. అయితే ఇటువంటి విషయాల్లో డాక్టర్ సలహా లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ సొంత వైద్యం చేసుకోకూడదు. అలా చేస్తే ఆరోగ్యానికి చాలా ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: కరోనాతో 44 సెకన్లకి ఒకరు బలి - కలవరపెడుతున్న కోవిడ్ కొత్త నివేదిక
Also Read: బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్-2 ఆరోగ్య రహస్యం ఇదే, మీరూ ప్రయత్నించండి