Queen Elizabeth II: బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్-2 ఆరోగ్య రహస్యం ఇదే, మీరూ ప్రయత్నించండి
నవ్వడం ఒక యోగం, నవ్వకపోవడం రోగం అని అన్నారు మన పెద్దలు. అందుకే కాబోలు బ్రిటన్ రాణి తన మోముపై చిరునవ్వు చెదరకుండా జాగ్రత్తపడేవారు.
క్వీన్ ఎలిజబెత్-2 దాదాపు 70 సంవత్సరాల పాటు బ్రిటన్ రాణిగా ఉన్నారు. ఆ స్థానంలో అన్నేళ్లు ఉన్నారంటే సాధారణమైన విషయం కాదు. ఎప్పుడూ చిరు నవ్వుతో కనిపిస్తూ అందరినీ ఆకట్టుకోవడం ఎలిజబెత్-2 రాణి ప్రత్యేకత. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కాలం రాణిగా ఉన్న వ్యక్తిగా ఆమె.. తిరిగి రాయలేని చరిత్రను సృష్టించారు. ప్రపంచాన్ని వణికించిన కరోనా సైతం సోకినా.. ఆమె ఏ మాత్రం ఆందోళన చెందలేదు. వైరస్‌తో పోరాడి తిరిగి ఆరోగ్యాన్ని పొందారు.
96 ఏళ్ల వయస్సులో సైతం ఆమె చురుగ్గా ఆలోచించేవారు. ఆమె అన్నేళ్లు ఆరోగ్యంగా జీవించడానికి కారణం.. ఆమె నవ్వే. ఔనండి, క్వీన్ ఎలిజబెత్ దిగులుగా కనిపించిన రోజులను వేళ్లతో లెక్క పెట్టవచ్చట. రాణి గారు కదా.. ఆమెకు ఏం సమస్యలు ఉంటాయిలే అని అనుకోవచ్చు. కానీ, ఆమె నవ్వుతూ ఉండటమే కాదు.. ఇతరులను కూడా నవ్విస్తూ జాలీగా ఉండేవారట. ఒక్కోసారి ఆమెపై ఆమే జోకులు వేసుకుని గలగలా నవ్వేసేవారట. ఈ విషయాన్ని ఆమె సన్నిహితులే తెలిపారు. రాణిగారు పంచ్ వేస్తే.. ఎంతటి బాధలో ఉన్నవారైనా నవ్వేస్తారని పేర్కొన్నారు. ఆమె వీలైనంత ఎక్కవు సమయం ప్రశాంతంగా ఉండేందుకే మొగ్గు చూపేవారట.
తనలో తానే నవ్వుకుంటూ..
క్వీన్ ఎలిజబెత్-2 ఎప్పుడు బయట ప్రపంచం ముందు కనిపించినా చిరు నవ్వుతోనే కనిపిస్తారు. ఆమె కోప్పడిన దాఖలాలు కూడా లేవు. నవ్వు అన్ని విధాలుగా మంచే చేస్తుందనేది అక్షర సత్యం. అందుకు క్వీన్ ఎలిజబెత్ సాక్ష్యం. తన మీదే తానే జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ ఉండటం ఎలిజబెత్-2 రాణికి అలవాటు. బ్రిటన్ రాణి ఆరోగ్యంగా ఉండటానికి కారణం ఆమె ఎప్పుడు నవ్వుతూ ఉండటమే అని రాణి వ్యవహారాలు చూసే రాబర్ట్ లేసి గతంలో ఒక మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా మొహం మీద చెరగని చిరునవ్వుతో కనిపిస్తుంటారని, అది అందరికీ సాధ్యమయ్యేది కాదని ఆయన తెలిపారు. అంతే కాదు ఆమె చాలా ముక్కు సూటిగా మాట్లాడతారట. తన బాధ్యతలను సీరియస్ గా నిర్వహిస్తూనే.. తోటి వారితో నవ్వుతూ మాట్లాడటం రాణిగారి నైజం.
మిమిక్రీ కూడా చేస్తారట
ఎంత పెద్ద హోదాలో ఉన్నప్పటికీ క్వీన్ ఎలిజబెత్-2 గర్వాన్ని పక్కన బెట్టి చాలా సరదాగా ఉంటారు. మిమిక్రీ కూడా చేస్తుండేవారట. రాజకీయ నాయకులు, టీవీలో కనిపించే స్టార్స్‌ను అనుకరిస్తూ ఆమె హాస్యాన్ని పండించేవారని రాబర్ట్ లేసి చెప్పుకొచ్చారు. ఆమె ఎప్పుడూ తనని తాను ఎగతాళి చేసుకుంటూ నవ్వుతూ ఉంటారట. ఒకసారి ఆమెతో రాజకీయ నాయకుడు ఫోన్లో మాట్లాడుతుంటే ఆయన ఫోన్ సడెన్ గా స్విచ్ ఆఫ్ అయిపోయింది. దీంతో ఆమె.. ‘‘బాహుశా, ఆయన ఫోన్‌కు నాతో మాట్లాడటం ఇష్టం లేదు కాబోలు’’ అని సరదాగా వ్యాఖ్యానించారట.
ఎవరైనా తనని కలిసినప్పుడు భయంగా, ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటే వాళ్ళని నవ్వించేందుకు జోకులు వేస్తారు. ఎన్నో ఒత్తిళ్లను ఆమె నవ్వుతోనే ఆమె అధిగమించారు. నవ్వడం ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని సైకాలజిస్టులు కూడా చెప్తూ ఉంటారు. ఆమె కూడా అదే మంత్రాన్ని పాటించేవారు. కాబట్టి, మీరు కూడా మీ జీవితంలో ‘నవ్వు’ను మిస్ కావద్దు. ఎందుకంటే నవ్వుకు కష్టాలను కరిగించే శక్తి కూడా ఉంటుంది.
ఎలిజబెత్-2.. ఏప్రిల్ 21వ తేదీ, 1926లో లండన్‌లోని 17 బ్రూటన్ స్ట్రీట్‌లో జన్మించారు. గ్రీస్ యువరాజు, నేవీ లెఫ్టినెంట్ ఫిలిప్ మౌంట్‌బాటెన్‌ను 1947లో ఆమె వివాహం చేసుకున్నారు. వీళ్లకు.. ప్రిన్స్ ఛార్లెస్, ప్రిన్సెస్ అన్నె, ప్రిన్స్ ఆండ్రూ, ప్రిన్స్ ఎడ్వర్డ్ సంతానం. 1952, ఫిబ్రవరి 6వ తేదీన తండ్రి మరణించడంతో వారసురాలిగా ఎలిజబెత్‌ను ప్రకటించారు. అయితే ఆ టైంకి ఆమె రాయల్ టూర్‌లో కెన్యాలో ఉన్నారు. ఏడాది తర్వాత జూన్ 2వ తేదీన ఆమె వెస్ట్‌మిన్‌స్టర్ అబ్బేలో బ్రిటన్‌కు రాణిగా అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. 25వ ఏట నుంచి బ్రిటన్ రాణిగా ఉన్నారు.
Also Read: క్వీన్ ఎలిజబెత్ 2 గురించి ఈ 10 షాకింగ్ విషయాలు తెలుసా?
Also Read: Covid Cases: దేశంలో కొత్తగా 6,093 కరోనా కేసులు నమోదు