Health and Immunity: వానాకాలం…కరోనాకాలం…ఈ జ్యూస్ లు మీ ఇమ్యూనిటీకి శ్రీరామ రక్ష
ట్రెండ్ మారింది. పిజ్జాలు, బర్గర్లు, కూల్ డ్రింక్స్‌కి కాలం చెల్లుతోంది. మొన్నటి వరకూ అదే ఫ్యాషన్ అన్న వాళ్ళంతా ఇప్పుడు ఇమ్యూనిటీ అంటున్నారు. కరోనా దెబ్బకి రోగనిరోధక శక్తి ఎంత అవసరమో తెలుసుకున్నారు.
కరోనాకి ముందో లెక్క…ఆ తర్వాత మరో లెక్క అన్నట్టు మారిపోయాయ్ ఆహారపు అలవాట్లు, అప్పటి వరకూ ఫాస్ట్ ఫుడ్స్‌పై ఆసక్తి చూపినవారంతా రూటు మార్చక తప్పలేదు. బతికుంటే బలుసాకు తిని బతకొచ్చన్న సామెతను గుర్తు చేసుకుని ఏడాదిన్నరగా ఇమ్యూనిటీ పెంచుకునే పనిలో పడ్డారు. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం ద్వారా ఎన్నో వ్యాధులను ఎదుర్కోవచ్చని వైద్యులు చెబుతున్నారు. మరి రోగ నిరోధక శక్తి పెంచే పండ్ల రసాలు, రసాయనాలేంటో చూద్దాం…
యాపిల్ జ్యూస్
రోగ నిరోధక శక్తిని పెంపొదించుకోవడంలో యాపిల్ జ్యూస్ ఎంతగానో ఉపయోగపడుతుంది. యాపిల్‌లో విటమిన్ ఏ, బీ1 బీ2, బీ6, సీ విటమిన్లతోపాటు ఫోలిక్ యాసిడ్, నియాసిన్, జింక్, పొటాషియం వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇవి ఇమ్యూనిటీని పెంచడంతో పాటు నరాల వ్యవస్థను బలోపేతం చేస్తాయి.
సిట్రస్ పండ్ల జ్యూస్
నిమ్మ, నారింజ, ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో విటమిన్ సీ సమర్థవంతంగా పనిచేస్తుంది. సిట్రస్ పండ్ల జ్యూస్‌లు తాగడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. గ్యాస్, ఎసిడిటీ నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది.
కర్బుజా జ్యూస్
నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయ రోగ నిరధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా ఏవైనా ఇన్‌ఫెక్షన్ల బారిన పడినప్పుడు కలిగే కండరాల నొప్పిని తగ్గిస్తుంది. పుచ్చకాయలోని గింజలు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కాబట్టి వాటిని తీసేయకుండానే జ్యూస్ చేసుకుని తాగడం మంచిది.
టమాటా జ్యూస్
ఏ సీజన్లలో అయినా దొరికే టమాటాల్లో విటమిన్ సీ, ఈ, బీటా కెరోటిన్ పుష్కలంగా లభిస్తుంది. ఈ పోషకాలు రోగ నిరోధక శక్తిని తగ్గించే ఫ్రీ రాడికల్స్‌ను అడ్డుకుంటాయి. రోజూ టమాటా జ్యూస్ తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.
బీట్‌రూట్ జ్యూస్
బీట్‌రూట్‌లో విటమిన్ సీ, ఈ ఎక్కువగా ఉంటుంది. అలాగే కాల్షియం, ఐరన్ కూడా పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి రక్తహీనతతో బాధపడేవారు బీట్‌రూట్ జ్యూస్ తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. బీట్‌రూట్‌లో లభించే లైకోపిన్, ఆంథోసైయనిన్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే అధిక రక్తపోటును తగ్గించడంతోపాటు పెద్దవాళ్లలో మెదడుకు రక్తప్రవాహం పెంచడంతో సహాయపడుతుంది. బీట్‌రూట్‌లో వాపు తగ్గించే గుణం ఉండటం వల్ల ఇది కాలేయం ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది.
క్యారెట్ జ్యూస్
క్యారెట్లలో విటమిన్ ఏ, బీ1, బీ2, బీ3, నియాసిన్, ఫోలెట్, కాల్షియం, పొటాషియం, మెగ్నిషియం వంటి పోషకాలతోపాటు పీచు పుష్కలంగా ఉంటుంది. క్యారెట్ జ్యూస్‌లోని బీటా కెరోటిన్ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది.