చలికాలంలో పాలతో జిలేబిని తింటే ఇన్ని లాభాలా? అందుకే వారంతా తింటారు
జిలేబి, పాలు ఈ రెండింటి కాంబినేషన్ శీతాకాలంలో అదిరిపోతుంది.
పాలల్లో జిలేబిని ముంచుకుపని తినే అలవాటు తెలుగు వారికి లేదు. పాలు విడిగా తాగి, జిలేబిని వేరేగా తింటారు. ఆ రెండింటి కాంబినేషన్ గురించి మనకు తెలియదు. కానీ మనదేశంలోని చాలా ప్రాంతాల్లో ‘దూద్ జిలేబి’కి చాలా ప్రాచుర్యం ఉంది. వేడి పాలల్లో జిలేబిని ముంచుకుని తింటే ఎంతో ఆరోగ్యమని, అది కూడా కచ్చితంగా చలికాలంలో తినాలని చెబుతారు. తింటారు కూడా. ఒకసారి ఈ రెండింటి కాంబినేషన్ అలవాటు పడితే ఆ రుచికి దాసోహం అయిపోతారట. అంతెందుకు ఉత్తరాదిలో చలికాలంలో జరిగే పెళ్లిళ్లు, వేడుకల్లో కచ్చితంగా కనిపించే ఆహారం దూద్ జిలేబి. దీని తినడం వల్ల శరీరానికి వేడి అందుతుందని ఎంతో మంది నమ్మకం. కేవలం మనదేశంలోనే కాదు, పాకిస్తాన్ లో కూడా ఈ ఆహార కాంబినేషన్ మంచి ఫేమస్.
పూర్వీకులు ఏం చెప్పారు?
జిలేబిని బెల్లం లేదా పంచదార కలిపి చేస్తారు. చక్కెరతో చేసిన పదార్థాలు మంచివి కావు. కనుక బెల్లం జిలేబీని తినడం మంచిది. ఈ జిలేబీలను పాలతో పాటూ తినడం వల్ల అలసట, జలుబు, జ్వరం, కీళ్లనొప్పుడు, వెన్నునొప్పి వంటివి తగ్గుతాయని పూర్వీకులు నమ్మేవారు. చలికాలంలో వచ్చే ఎన్నో సమస్యలకు ఇది చెక్ పెడుతుందని వీరి నమ్మకం. వారి నమ్మకమే తరాలు మారుతూ వచ్చి ఇప్పటికీ ఆచరణలో ఉంది. శీతాకాలంలో వచ్చే ఎన్నో రోగాలకు ఈ రెండింటి కాంబినేషన్ ఔషధంలా పనిచేస్తుందని వారి విశ్వాసం. కొంతమంది ఈ ఆహారాన్ని స్వర్గం నుంచి వచ్చిన ఔషధంగా చెప్పుకుంటారు.
ఆరోగ్య ప్రయోజనాలు
ఇక పాతకాలం నాటి నమ్మకాలు ఎలా ఉన్నా, ఇప్పుడు వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోవాలి. వారి అభిప్రాయం ప్రకారం శీతాకాలంలో జిలేబి, పాల కలయిక మన శరీరంలోని ఒత్తిడిని కలిగించే హార్మోన్లపై ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీంతో ఒత్తిడి తగ్గిపోతుంది. వేడి పాలతో జిలేబీని తినడం వల్ల మైగ్రేన్ వంటి తలనొప్పులు కూడా తగ్గిపోతాయి. బక్కపలచగా ఉన్న వారు ఈ ఆహారాన్ని తినడం వల్ల బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉబ్బసం నుంచి ఉపశమనం పొందవచ్చు. అయితే ఈ దూద్ జిలేబినీ బ్రేక్ ఫాస్ట్ సమయంలో తింటే బాగా శరీరంపై ప్రభావం చూపిస్తుంది.
Also read: రోజుకో గుడ్డు తినడం వల్ల పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరుగుతుందా? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.