Relationships: ఆ గర్భం నా వల్ల వచ్చింది కాదనిపిస్తోంది, ఇప్పుడు ఏం చేయాలి?
గర్భవతి అయిన భార్య కడుపులో ఉన్నది తన బిడ్డ కాదని అనుకుంటున్నా ఓ భర్త అనుమానపు కథ ఇది.
ప్రశ్న: మాది పెద్దలు కుదిర్చిన వివాహం. కానీ ఎందుకో ఆమెపై నాకు ప్రేమ పుట్టలేదు. ఆమె, నాకు సరిపడదని అనిపిస్తుంది. నేను అనుకున్న విధంగా ఆమె లేదు. అందంలోనే కాదు పనుల్లో కూడా ఆమెకు, నాకూ చాలా వ్యత్యాసం ఉంది. అయినా సరే పెద్దవారి బలవంతం ప్రకారం నేను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఇష్టం లేకుండానే ఇద్దరం ఒకే ఇంట్లోనే గడుపుతున్నాం. ఆమెను నన్ను ప్రేమగానే చూసుకుంటుంది. కానీ నాకు మాత్రం ఆమెపై ప్రేమ కలగడం లేదు. మా పెళ్లయి ఇప్పుడు ఏడాది అవుతోంది. హఠాత్తుగా ఆమె తాను గర్భవతి అని చెప్పింది. అప్పటినుంచి నాకు నిద్ర పట్టడం లేదు. నా తలలో ఒకటే సందేహం... ఎందుకంటే మేము నెలల తరబడి దూరంగా ఉంటున్నాము. కాబట్టి ఆమె గర్భవతి అయ్యే అవకాశం లేదు. ఆమె ఎలా గర్భవతి అయిందో నాకు అర్థం కావడం లేదు. ఆమె చాలా ధైర్యంగా నా ముందుకే వచ్చి తాను రెండు నెలల ప్రెగ్నెంట్ అని చెబుతోంది. ఆరు నెలల నుంచి ఇద్దరి మధ్య ఎలాంటి సాన్నిహిత్యము లేకపోయినా... ఆమె ఎలా గర్భవతి అయింది? దీన్ని బట్టి నాకు ఒక సందేహం వచ్చింది. ఆ బిడ్డకు నేను తండ్రిని కాదని నాకు అర్థమైంది. కానీ ఏం చేయాలో అర్థం కావడం లేదు.
జవాబు: మీది చాలా క్లిష్టమైన పరిస్థితి. ఆరు నెలల నుంచి మీరు నిజంగా ఆమెకు దూరంగా ఉండి ఉంటే ఆ బిడ్డ మీది కాదని అర్థమవుతుంది. ఎందుకంటే ఆమె కేవలం రెండు నెలల గర్భవతి అని చెప్పారు. ఆరు నెలల పాటూ దూరంగా ఉంటే రెండు నెలల గర్భం రావడం అసాధ్యం. అయితే మీరు మరొకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు అతిగా తాగి రాత్రి ఎప్పుడైనా ఇంటికి వచ్చారేమో గుర్తుకు తెచ్చుకోండి. ఎందుకంటే అతి తాగుడు మతిమరుపు వచ్చేలా చేస్తుంది. రాత్రి జరిగిన విషయాలు మర్చిపోయేలా చేస్తుంది. కాబట్టి మీరు సానిహిత్యంగా ఆమెతో ఉన్న విషయం మీరు మర్చిపోయి ఉండవచ్చు. ఇలాంటివి ఏమైనా జరిగాయేమో ఒకసారి గుర్తు చేసుకోండి. ఈ విషయంపై ఆమెతో నేరుగా మాట్లాడడమే మంచిది. అయితే ముందుగా మీ ఇద్దరూ అరుచుకోవడం వంటివి మానేసి పూర్తిగా ప్రశాంతమైన వాతావరణంలో మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆమె గర్భవతి అని మీరు గుర్తించుకోవాలి. మీకున్న సందేహాన్ని తీర్చగలిగే మనిషి ఆమె మాత్రమే. ఇంకెవరూ కూడా ఆ సందేహాన్ని తీర్చలేరు. ఆమె మీ సందేహాన్ని అర్థం చేసుకుంటే కచ్చితంగా మీకు సమాధానం ఇచ్చి తీరుతుంది.
ఈ విషయంలో వెంటనే పెద్దవాళ్ళను ఇన్వాల్వ్ చేయడం వల్ల సమస్య ఆదిలోనే పెద్ద గొడవగా మారుతుంది. కాబట్టి మీరు ఇద్దరే కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకోండి. మీకు తెలియకుండా మీరు తాగిన మైకంలో ఎప్పుడైనా, ఏదైనా ప్రవర్తించారేమో ఆమె చెప్పే అవకాశం ఉంది. లేదా వేరే వ్యక్తితో ఉన్న అనుబంధాన్ని అయినా ఆమె చెప్పవచ్చు. ఒకవేళ ఆమె వేరే వ్యక్తితో ఉన్నా అనుబంధాన్ని చెప్పి ఉంటే మీరు ఏం చేయాలో కూడా నిర్ణయం తీసుకోండి. ఆ విషయాన్ని కూడా ఆమెను అడగండి. మీరు వేరే వ్యక్తి బిడ్డకు తండ్రి కాలేను అని చెబుతున్నారు... ఒక ఆడపిల్లకు పెళ్లి అయిన తర్వాత తల్లి కావాలని చాలా కోరికగా ఉంటుంది. కానీ మీరు ఎంతకీ ఆమెను దగ్గరికి తీసుకోకపోవడం వల్లే ఆమె ఈ పని చేసి ఉండే అవకాశం ఉంది. అంటే మీరే దీనికి బాధ్యులు. కాబట్టి ఈ పరిస్థితిని మీరే సాల్వ్ చేయాలి. లేదా మీకు జీవిత భాగస్వామి వద్దు అనుకుంటే ఆ విషయాన్ని ఆమె పరువు తీయకుండా జాగ్రత్తగా పెద్దల్లో పెట్టి మాట్లాడాలి. మ్యూచువల్ నిర్ణయంతో విడిపోవాలి. ఏదైనా సరే ఆమెకు ఎలాంటి హాని జరగకుండా మీరు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అయితే ఆ వేరే వ్యక్తి ఎవరైనా ఉంటే అతను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడో లేదో కూడా మీరే తెలుసుకోవాలి. వేరే వ్యక్తితోనే మీ భార్య గర్భవతి అయి ఉంటే.. ఆమె చేసింది పెద్ద తప్పు అని ఒప్పుకోవాల్సిందే. భర్త ప్రేమను పొందడం కోసం మరి కొంతకాలం వేచి ఉంటే బాగుండేది. అయినా ఆమె తప్పు చేసిందో లేదో మనం ఇప్పుడు నిర్ణయించలేం. ఆమెతో మాట్లాడాక మీరే నిర్ణయించుకోండి. ఈ సమయంలో ఆమెకు మీ మద్దతు చాలా అవసరం. ఎందుకంటే గర్భం ధరించిన మహిళ మానసికంగా చాలా బలహీనంగా ఉంటుంది. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడమైనా ఆమెకు చాలా సులువు. కాబట్టి ఆమెను బాధ పెట్టకుండా మీరు ఈ సమస్యను పరిష్కరించుకోవాలి.
Also read: దగ్గు మందులో ఈ హానికర రసాయనం? ఇది లేని దగ్గు సిరప్ ఎంచుకోండి