ఈ లక్షణాలు మీలో కనిపిస్తున్నాయా? అయితే, ‘ఐరన్’ లోపం ఉన్నట్లే!
శరీరంలో హీమోగ్లోబిన్ తయారవాలంటే ఐరన్ అవసరం. హీమోగ్లోబిన్ రక్తం ద్వారా ఆక్సిజన్ శరీర భాగాలకు అందజేస్తుంది. శరీరంలో తగినంత ఐరన్ లేనపుడు హీమోగ్లోబిన్ కూడా తగినంత తయారు కాదు.
మన దేశంలో బాలికలు, స్త్రీలలో దాదాపు 80 శాతం మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. అందులో ముఖ్యంగా ఐరన్ లోపం చాలా ఎక్కువ మందిలో కనిపిస్తుంది. కారణాలేమైనా ఈ లోపాన్ని చాలా తేలికగా తీసుకుంటారు. కానీ కౌమార దశలో ఉన్న పిల్లలు.. ఐరన్ లోపం వల్ల తరచుగా నీరసంగా ఉండడం, పనిమీద ఏకాగ్రత లోపించడం వంటి రకరకాల సమస్యలు వెంటాడుతాయి. దీని వల్ల జీవితంలో వెనుకబడి పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి, లక్షణాలను గుర్తించి.. ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి సమస్యలు ఉండవు.
శరీరంలో జీవక్రియలన్నీ సజావుగా జరగాలంటే తగినంత ఆక్సిజన్ తప్పనిసరి. శరీరంలో చేరిన ఆక్సిజన్ ను రక్తంలోని హీమోగ్లోబిన్ శరీరంలోని అన్ని అయవాలకు అందిస్తుంది. హీమోగ్లోబిన్ తయారు కావడానికి కావల్సిన ముఖ్యమైన ఖనిజలవణం ఐరన్. ఇది రకరకాల ఆహార పదార్థాల ద్వారా శరీరానికి అందుతుంది. తీసుకునే ఆహారంలో ఐరన్ లోపించినప్పుడు శరీరంలో కూడా ఐరన్ లోపిస్తుంది.
ఐరన్ లోపం కారణంగా రకరకాల సమస్యలు వస్తాయి. తరచుగా నీరసంగా ఉండడం, బరువైన పనులు చేస్తున్నపుడు ఆయసంగా ఉండడం, పిల్లల్లో ఈ సమస్య వచ్చినపుడు చదువులో వెనుకబడి పోవడం, త్వరగా అలసి పోవడం, దేనిమీదా ఏకాగ్రత కుదరకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఎందుకంటే మనం పీల్చుకొనే ఆక్సిజన్‌లో ఎక్కువ శాతం మెదడు పని చేయడానికే ఉపయోగపడుతుంది. ఆక్సిజన్ లోపించినపుడు మెదడు పనితీరు కూడా మందగిస్తుంది. ఈ లక్షణాలతో పాటు కొన్ని బయటికి స్పష్టంగా కనిపించే శారీరక లక్షణాలు కనిపిస్తాయి. అవేమిటో తెలుసుకుంటే ఐరన్ లోపాన్ని గుర్తించడం సులభం అవుతుంది.
అత్యంత సాధారణంగా కనిపించే పోషక లోపం ఐరన్ లోపం. దీనినే రక్త హీనత అంటారు. రక్తం తక్కువగా ఉందని అంటారు. శరీర భాగాలకు ఆక్సిజన్ తగినంత అందక పోవడం వల్ల వాటి పని తీరు మందగిస్తుంది. సాధారణంగా చర్మం, జుట్టు, గోళ్లలో ఐరన్ లోపానికి సంబంధించిన లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి.
జుట్టు రాలటం
ఐరన్ లోపించడం వల్ల తగినంత ఆక్సిజన్ శరీర భాగాలకు అందదు. అందువల్ల గోళ్లు, జుట్టు పెరుగుదల మందగిస్తుంది. జుట్టు త్వరగా రాలిపోతుంది కూడా. అందువల్ల జుట్టు పలుచబడుతుంది. హేయిర్ లైన్ చుట్టూ, తలమీద, మధ్యలో జుట్టు పలుచబడుతున్నట్టయితే తీవ్రమైన ఐరన్ లోపం ఉన్నట్టు భావించాలి. ఐరన్ లోపం వల్ల జుట్టు పొడిబారుతుంది. హీమోగ్లోబిన్ స్థాయి తగ్గడంతో జుట్టు కుదుళ్లకు తగినంత ఆక్సిజన్ అందక పోవడం వల్ల జుట్టు బలహీన పడుతుంది.
కళ్లు పాలిపోతాయి
కను రెప్పల లోపలి భాగం సాధారణంగా ఎర్రగా ఉంటుంది. ఐరన్ లోపం ఉన్నపుడు కంటి రెప్పల లోపలి భాగం పాలిపోతుంది. అందుకే ముందుగా డాక్టర్లు కూడా కంటి రెప్పలను పరిశీలించి చూసి ఐరన్ లోపాన్ని నిర్థారణ చేస్తారు.
గోళ్లు పెలుసు బారుతాయి
ఐరన్ లోపం ఏర్పడినపుడు గోళ్లు పెలుసు బారి పోయి త్వరగా విరిగి పోతాయి. పొరలుగా విడిపోయినట్లు కనిపిస్తాయి. పగుళ్లు ఏర్పడుతాయి. లోపం తీవ్రంగా ఉన్నపుడు గోళ్ల మధ్య భాగం గుంట పడినట్టుగా షేప్ అవుట్ అవుతాయి.
చర్మం పాలిపోతుంది
అరచేతుల్లో, చెంపల మీద చర్మం ఒక చిన్న గులాబి రంగు మెరుపుతో ఉంటుంది. రక్తంలో హీమోగ్లోబిన్ లోపం వల్ల ఈ మెరుపు మాయం అవుతుంది. చర్మం పాలిపోయినట్టు కనిపిస్తుంది.
Also Read: టూత్ పేస్ట్ లేకుండా బ్రష్ చెయ్యొచ్చా? నిపుణులు ఏం సూచిస్తున్నారు?