International Beer Day 2022: బ్రో, ఈ రోజే Beer Day - బీర్ ఆరోగ్యానికి మంచిదే, ఈ వ్యాధులు దరిచేరవు!
మీరు బీరు ప్రియులా? అయితే.. ఈ రోజు మీకు పండగే. ఎందుకంటే.. ఈరోజు బీరు డే బ్రో!
బీరు అనగానే మధుప్రియుల చెవులు నిక్కబొడుచుకుంటాయి కదూ. అలాంటిది బీరుకు ప్రత్యేకంగా ఒక రోజు ఉందని తెలిస్తే ఆగుతారా? ‘‘రా బ్రదర్, తాగి పడిపోదాం’’ అని అనుకుంటారు కదా. అయితే, ఆ పని చేసే ముందు మీరు బీర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలి. ముఖ్యంగా బీరు వల్ల కలిగే ప్రయోజనాలు, ఎంత మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదనే విషయంపై మీకు అవగాహన ఉండాలి.
ఏటా ప్రతి ఆగస్టు మొదటి శుక్రవారాన్ని ‘అంతర్జాతీయ బీర్ దినోత్సవం’గా నిర్వహిస్తున్నారు. కాబట్టి.. ఈ రోజు (ఆగస్టు 5) మనం మధుప్రియులకు బీర్ డే శుభాకాంక్షలు చెప్పాల్సిందే. 2007లో కాలిఫోర్నియాలోని శాంటా క్రజ్‌లో జెస్సీ అవ్షలోమోవ్ ‘బీర్ డే’కు శ్రీకారం చుట్టారు.
‘బీర్ డే’ ఎందుకు?: ఇప్పటికే మీరు ఊహించి ఉంటారు. మద్యం తాగడానికి మందుబాబుల దగ్గర అనేక రీజన్స్ ఉంటాయి. చిన్న కారణాన్ని కూడా మందుతో సెలబ్రేట్ చేసుకోడానికి ప్రయత్నిస్తారు. ఈ బీర్ డే కూడా అలాంటిదే. స్నేహితులంతా కలిసి బీరు రుచిని ఆస్వాదించడం కోసమే ఈ Beer Day. అంతేకాదు, ఈ బీరును సర్వ్ చేసే వ్యక్తులతో కూడా ఈ రోజు తమ ఆనందాన్ని పంచుకుంటారు. ‘బీర్’ బ్యానర్ కింద ప్రపంచ బీరు ప్రియులందరినీ ఒక్కటి చేయడం ఈ రోజు ప్రత్యేకత. 2007లో మొదటిసారి ఈ Beer Day జరిగింది. 2012లో ప్రపంచవ్యాప్తంగా పోల్ నిర్వహించి ప్రతి ఆగస్టు మొదటి శుక్రవారం బీర్ డేను సెలబ్రేట్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
బీర్ ఆరోగ్యానికి మంచిదే, కానీ వ్యవసనంగా మారితేనే ముప్పు:మద్యం ఆరోగ్యానికి హానికరం అనే విషయం వాస్తవమే. ముఖ్యంగా అది వ్యసనంగా మారితే కేవలం ఆరోగ్యం మాత్రమే కాదు. జీవితం కూడా నాశనమవుతుంది. విచక్షణ కోల్పోయి రోడ్డునపడతారు. ఆ వ్యసనం సమాజంలో మిమ్మల్ని తలెత్తుకోకుండా చేస్తుంది. అయితే, బీరు తాగేవారికి కొన్ని ఆరోగ్యకర ప్రయోజనాలు లభిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయ. పోర్చుగీస్ యూనివర్సిటీ నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం.. బీరు తాగితే పొట్ట ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపింది. పురుషులు రాత్రి భోజనంతో పాటూ బీర్ తాగడం వల్ల వారి పొట్టలో మంచి బ్యాక్టీరియా స్థాయిలు పెరుగుతాయట. ఆల్కహాలిక్ బీర్, నాన్ ఆల్కహాలిక్ బీర్‌లో ఏదైనా మంచిదేనట.
బీరును ఇలా తయారు చేస్తారు: బీర్‌ను బార్లీ లేదా గోధుమ గింజలు, కొన్ని రకాల మసాలాలు, ఈస్ట్, నీళ్లు కలిపి తయారుచేస్తారు. అయిదు దశల్లో బీరును సిద్ధం చేస్తారు. మొదట బార్లీ, లేదా గోధుమలను మొలకెత్తిస్తారు. తరువాత మాషింగ్ పద్ధతిలో వాటిని లిక్విడ్‌గా మారుస్తారు. ఆ ద్రవాన్ని బాగా మరగబెట్టి ప్రత్యేక మసాలాలు కలుపుతారు. నిల్వ ఉంచేందుకు ఫెర్మెంటేషన్ పద్ధతిలో ఈస్ట్ అనే బ్యాక్టిరియాను అందులో మిక్స్ చేస్తారు. అందుకే బీర్ ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఎన్నాళ్లయినా రుచి అలాగే ఉంటుంది.
బీరుతో లభించే మరికొన్ని ప్రయోజనాలు:
⦿ బీరు మధుమేహులకు మంచిదేనట. బీరులో అధిక సంఖ్యలో ఉండే పాలీఫెనల్స్ శరీరంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుందట. ఆల్కహాల్ లేని బీర్‌ను మితంగా తీసుకుంటేనే ఈ ప్రయోజనం ఉంటుందని నిపుణులు స్పష్టం చేశారు.
⦿ ఇటీవల 70,000 మందిపై జరిపిన అధ్యయనంలో ఆల్కహాల్ లేని బీర్ అప్పుడప్పుడు తాగడం వల్ల మధుమేహం వచ్చే అవకాశం తగ్గినట్టు పరిశోధకులు గుర్తించారు.
⦿ పింటు బీరు తాగే మధుప్రియులు ఎక్కువ కాలం జీవిస్తారని టెక్సాస్ అధ్యయనం వెల్లడించింది. బీరు మితంగా తాగితే మందస్తు మరణాల ప్రమాదం నుంచి బయటపడతారట.
⦿ బీరుకు క్యాన్సర్‌ను అడ్డుకోగలిగే శక్తి కూడా ఉందట. అది పెద్దపేగు, కాలేయ క్యాన్సర్ కణాలను అడ్డుకుంటుందట.
⦿ బీరు కాలేయానికి మంచిది కాదని చెబుతారు. అయితే, బీరును మితంగా తాగేవారికి మాత్రం మంచిదేనట. బీరులో ఉండే క్సాంతోహోమోల్ కాలేయానికి మేలు చేస్తుందట.
⦿ బీరు గుండెకు కూడా మేలు చేస్తుందట. వారానికి ఒక సారి ఆరు పింట్ల కంటే తక్కువగా, మీడియం స్ట్రాంగ్ బీరు తాగితే హార్ట్ సమస్యలే ఉండవట. ఎందుకైనా మంచిది డాక్టర్ సలహా తీసుకున్నాకే ఇలాంటి సాహసాలు చేయండి.
⦿ బీరును మితంగా తాగితే చాలా ప్రయోజనాలు మీకు లభిస్తాయి. బీరు శరీరంలోని టాక్సిన్లను బయటికి పంపించేస్తుంది.
⦿ చర్మాన్ని శుద్ది చేసి మెరుపును అందిస్తుంది. బీరులో యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్, విటమిన్-బి కూడా ఉంటాయి.
⦿ బీరులో లభించే సిలికాన్ ఎముకలను బలోపేతం చేస్తుందట. బీరు తాగడం వల్ల దంత క్షయం, ఇన్పెక్షన్లు రావట. కాబట్టి ఆల్కహాల్ లేని బీర్‌ను అప్పుడప్పుడు టేస్ట్ చేయడం మంచిదే.
బీరులో మంచి బ్యాక్టీరియా ఎలా పెరుగుతుంది?: బీర్‌లో పాలీఫెనాల్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి. కుళ్లిన ప్రక్రియలో ఈ సూక్ష్మజీవులు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. బీర్‌ను తయారుచేసే ప్రక్రియలో ఇలాంటి సూక్ష్మజీవులు పుడతాయి. వాటివల్ల మంచి బ్యాక్టిరియా పెరుగుతుంది. వీటి వల్ల గుండె వైఫల్యం, మధుమేహం వంటి రోగాలు దరిచేరవట.
మితంగా తాగితేనే ఫలితం: రోజుకు ఒకటి కంటే ఎక్కువ బీర్లు తాగితే అనర్థాలు తప్పవు. బీర్ మంచిదని చెప్పారు కాబట్టి రోజుకు రెండు మూడు సీసాలు తాగేద్దామని అనుకుంటున్నారేమో, అప్పుడు ఇతర ఆరోగ్య సమస్యలు పుట్టుకొస్తాయి.
ఇలా తాగితే పొట్ట పెరుగుతుందనే భయం ఉండదు: కడుపు నిండా బీరు తాగి పడుకుంటేనే పొట్ట సమస్యలు వస్తాయి. అలా జరగకూడదంటే ఈ సూచనలు పాటించండి. బీర్లలో లైట్, స్ట్రాంగ్ అని రెండు రకాలు ఉంటాయి. వాటిలో లైట్ బీర్‌నే ఎంచుకోండి. ఇందులో కేలరీలు కూడా తక్కువ ఉంటాయి. బీర్ తాగడానికి ముందే ఎక్కవ నీళ్లు తాగేయండి. దీనివల్ల మీరు ఎక్కువ బీరు తాగలేరు. బీరు తాగాక కనీసం ఒక కిలోమీటరు నడవాలి. దీనివల్ల బీరుతో పోగైన కెలోరీలన్నీ కరిగిపోతాయి. బీరు ఎక్కువ తాగినట్లయితే, ఆహారం మితంగా తీసుకోండి. అయినా, పీకలదాకా తాగి ఇబ్బంది తెచ్చుకోవడం ఎందుకు? లైటుగా తీసుకుంటే సరిపోతుంది కదా?!
వేసవిలో ఆల్కహాల్ బీరు వద్దు: ఆల్కహాల్ ఉన్న బీరు తాగడం వల్ల వేసవిలో దాహం అధికమవుతుంది. శరీరం నీటిని అధికంగా కోల్పోతుంది. అదే ఆల్కహాల్ లేని బీర్ తాగితే ఆ సమస్యలే ఉండవు. వేసవిలో బీర్ తాగాలనిపిస్తే ఆల్కహాల్ లేనిదే తాగండి. అది కూడా వారానికి ఒకటి నుంచి మూడు సార్లు మాత్రమే తాగాలి. ఇలా మితంగా తాగడం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. అతిగా బీర్ తాగితే త్వరగా బరువు పెరిగిపోతారు. కాలేయం దెబ్బతింటుంది. ఇతరత్రా ఆరోగ్య సమస్యలు సైతం వెంటాడుతాయి.
Also Read: ఈ వయస్సు వచ్చాక మగాళ్ల లైంగిక శక్తి మటాష్, ఇలా చేస్తే సేఫ్!
Also Read: ఎలోన్ మస్క్ తండ్రి వీర్యానికి అంత డిమాండా? 76 ఏళ్ల వయస్సులోనూ అదేపని!
ముఖ్య గమనిక: మద్యపానం ఆరోగ్యానికి హానికరం. డ్రింక్ అండ్ డ్రైవ్ ప్రమాదకరం, నేరం కూడా. (Drinking alcohol can harm your health).
సూచన: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.