Indigestion Warning Signs : అజీర్ణ ప్రమాద హెచ్చరికలు.. గుండె నొప్పి నుంచి క్యాన్సర్ వరకు, నిపుణుల సలహాలివే
Indigestion Side Effects : దీర్ఘకాలిక అజీర్ణం GERD, పుండ్లు, గుండె సమస్యలు లేదా క్యాన్సర్కు సంకేతం కావచ్చు. ప్రమాద హెచ్చరికలు గుర్తించి.. వైద్య సహాయం ఎప్పుడు తీసుకోవాలో చూసేద్దాం.

Hidden Dangers Behind Indigestion : అజీర్ణం అనేది ఈ మధ్యకాలంలో చాలామంది ఎదుర్కొనే అసౌకర్యాలలో ఒకటి. ఎక్కువ భోజనం తర్వాత, ఆలస్యంగా తినడం లేదా ఒత్తిడి వంటి సమయాల్లో ఈ సమస్య ఎక్కువగా వస్తుంది అనుకుంటారు. అయితే ఈ అజీర్ణం కొన్నిసార్లు ఛాతీలో లేదా పొత్తికడుపు పైభాగంలో తేలికపాటి మంటగా అనిపిస్తుందా? అయితే మీరు కచ్చితంగా వైద్యసహాయం తీసుకోవాలంటున్నారు. ఎందుకంటే అజీర్ణం కేవలం చిన్నపాటి సమస్యగా కాకుండా ఆరోగ్య హెచ్చరికగా మారుతుందని చెప్తున్నారు డాక్టర్ హర్షద్ ఖైర్నార్. ఇది పెద్ద సమస్యలకు ఎలా దారితీస్తుంది.. దాని గురించి తెలుసుకోవాల్సిన విషయాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కొన్ని సూచనలు చేశారు. అవేంటో చూసేద్దాం.
అజీర్ణం పెద్ద సమస్యలకు ఎలా దారి తీస్తుందంటే
అజీర్ణం లేదా డిస్పెప్సియా అనేది ఒకే పరిస్థితిని కాకుండా అనేక లక్షణాలను చూపిస్తుంది. ఛాతీ ఎముక వెనుక మంట, ఉబ్బరం, వికారం, కొన్నిసార్లు కడుపు త్వరగా నిండిపోయినట్లు అనిపించడం, నోటిలో చేదు రుచి వంటి ప్రధాన లక్షణాలు చూపిస్తుంది. చాలా సందర్భాల్లో ఈ లక్షణాలు యాసిడ్ రిఫ్లక్స్‌తో వస్తాయి. కడుపులోని ఆమ్లం అన్నవాహిక (ఆహార నాళం)కు వ్యతిరేకంగా ప్రవహించే పరిస్థితినే యాసిడ్ రిఫ్లక్స్ అంటారు. ఇది అప్పుడప్పుడు రావడం పెద్ద సమస్య కాదు కానీ.. నిరంతరం లేదా తీవ్రమైన అసౌకర్యం ఉంటే జాగ్రత్తగా ఉండాలంటున్నారు హర్షద్.
నిరంతర జీర్ణ సమస్యలకు గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ డిసీజ్ (GERD) ఒక ప్రధాన కారణంగా ఉంది. ఈ యాసిడ్ రిఫ్లక్స్ అలవాటుగా మారినప్పుడు అభివృద్ధి చెందుతుంది. తద్వారా ఆహార నాళం లోపలి పొర వాపునకు గురవుతుంది. కాలక్రమేణా వాపులు ఏర్పడవచ్చు. లేదా మార్గం కుంచించుకుపోవచ్చు. దీనివల్ల మింగడం కష్టమవుతుంది. ఈ పరిస్థితికి చికిత్స చేయకపోతే GERD బారెట్ అన్నవాహిక రుగ్మతగా మారుతుంది. ఇది దిగువ అన్నవాహిక కణజాలంలో మార్పులకు కారణమవుతుంది. ఇది క్యాన్సర్‌కు దారితీస్తుంది.
కడుపు క్యాన్సర్
అజీర్ణం కడుపులోని సమస్యలకు సంకేతం కావచ్చు. పెప్టిక్ పుండ్లు కడుపు లేదా చిన్న పేగులలో ఏర్పడే పుండ్లు. ఇవి పదునైన లేదా మంట కలిగించే నొప్పిని కలిగిస్తాయి. ముఖ్యంగా కడుపు ఖాళీగా ఉన్నప్పుడు సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ పుండ్లు హెలికోబాక్టర్ పైలోరీ (H. పైలోరీ) అనే బ్యాక్టీరియా, కొన్ని నొప్పి నివారణ మందులు ఎక్కువ వాడటం వల్ల వస్తాయి. అజీర్ణంతో పాటు, బరువు తగ్గడం, రక్తం వాంతులు అవ్వడం, నల్లటి మలం వంటివి కడుపు క్యాన్సర్ లక్షణాలు కావచ్చు.
గుండె సమస్యల సంకేతాలు
కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా వృద్ధులు లేదా మధుమేహ వ్యాధిగ్రస్తులలో.. గుండె సమస్యలు ఛాతీ నొప్పికి బదులుగా అజీర్ణంగా వ్యక్తమవుతాయి. గుండెపోటుకు ముందు తరచుగా గుండెల్లో మంట, ఎగువ పొత్తికడుపులో నొప్పి లేదా వికారం వంటివి వస్తాయి. ఇలాంటి లక్షణాలు అకస్మాత్తుగా వస్తే.. త్వరగా తీవ్రమైతే లేదా చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా దవడ లేదా చేయికి నొప్పి వంటివి వస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి.
అప్పుడప్పుడు వచ్చే అజీర్ణాన్ని సాధారణంగా తీసుకున్నప్పటికీ.. రెండు వారాల కంటే ఎక్కువ కాలం లక్షణాలు, ఆకలి తగ్గడం, చాలా అలసిపోయినట్లు అనిపించడం లేదా ప్రయత్నించకుండానే బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య పరీక్ష చేయించుకోవడం మంచిది. వీలైనంత త్వరగా జోక్యం చేసుకోవడం వల్ల ఉపశమనం లభించడమే కాకుండా.. తీవ్రమైన ఆరోగ్య సమస్యలుగా మారకుండా హెల్ప్ చేస్తుంది.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.






















