ఇక్కడ కిలో జీడిపప్పు 30 రూపాయలకే దొరుకుతుంది, ఎక్కడో కాదు మన దేశంలోనే
కూరగాయలు దొరికే ధరకే జీడిపప్పును అమ్ముతున్న ఊరు ఒకటి ఉంది.
జీడిపప్పును మీరు ఎంత పెట్టి కొంటున్నారు? కిలో 600 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు పెట్టాల్సిందే. అందులోనూ దీని ధర ఆ జీడిపప్పు క్వాలిటీ పై ఆధారపడి ఉంటుంది. తక్కువ క్వాలిటీది 600 రూపాయల విలువ చేస్తే, ఎక్కువ క్వాలిటీది 1000 పైనే ఉంటుంది. అయితే మన దేశంలోనే ఒక ప్రాంతంలో మాత్రం కేవలం కూరగాయల ధరకే జీడిపప్పును అందిస్తున్నారు. నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇది నిజమే. ఎప్పుడైనా అక్కడికి వెళ్తే ఓ రెండు మూడు కిలోల జీడిపప్పును తెచ్చి పెట్టుకుంటే మీకు ఏడాదంతా సరిపోతుంది. ఇందుకు మీకయ్యే ఖర్చు వందరూపాయలు ఉంటుంది అంతే.
ఇంతకీ ఎక్కడ?
జీడిపప్పును అత్యంత తక్కువ ధరకే అమ్ముతున్న ఏకైక ప్రదేశం జార్ఖండ్లోని జంతార అనే జిల్లాలో ఉన్న నాలా అనే గ్రామంలో. దీన్ని ‘జార్ఖండ్ జీడిపప్పు నగరం’గా పిలుస్తారు. ఈ గ్రామానికి వెళ్తే మీకు కిలో జీడిపప్పు కేవలం 20 నుంచి 30 రూపాయలు కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే మనం సాధారణంగా వాడే కూరగాయలు ప్రస్తుతం కిలో 80 రూపాయలు దాకా ఉంటున్నాయి. అంతకన్నా తక్కువ ధరకే నాలా గ్రామంలో జీడిపప్పు వచ్చేస్తుంది. చుట్టుపక్కల ప్రాంతాల వారు, నగరాల వారు ఎంతోమంది వచ్చి నాలా గ్రామంలోనే జీడిపప్పును కొని తీసుకు వెళ్తూ ఉంటారు. ఇక్కడ నుంచే దళారులు అధికంగా కొన్ని, బయట ప్రాంతాల్లో వంద రెట్లు అధిక ధరకు అమ్ముకుంటూ ఉంటారు.
ఎందుకు ఇక్కడ చౌక?
జీడిపప్పును ఇంత తక్కువ ధరకు నాలా గ్రామంలో ఎలా విక్రయిస్తున్నారు? ఈ గ్రామంలో 50 ఎకరాల విస్తీర్ణంలో జీడి తోటలనే వేశారు. 2010లో నాలా గ్రామంలోని వాతావరణం, నేలలు జీడిపప్పు సాగుకు అనుకూలంగా ఉంటాయని అటవీ శాఖ గుర్తించింది. అంతేకాదు గ్రామస్తులు అందరికీ ఈ విషయాన్ని చెప్పి జీడి తోటను పెంచే విధంగా ప్రోత్సహించింది. అలా ఒకేసారి గ్రామం అంతా పెద్ద ఎత్తున జీడి సాగు మొదలుపెట్టారు. ఇందుకోసం అప్పట్లో ఐఏఎస్ కృపానంద ఝా ఎంతో కష్టపడ్డారు. ఆయన జంతారా జిల్లా డిప్యూటీ కమిషనర్ గా ఉన్నప్పుడు ఈ నాలా గ్రామం విశిష్టతను వాతావరణ పరిస్థితులను అర్థం చేసుకున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలతో మాట్లాడి అక్కడ నేలలు, నీటిని పరీక్షించేలా చేశారు. అనంతరం అటవీశాఖ చొరవ తీసుకొని ఆ గ్రామంలో జీడి తోటలో పెంచేలా చేశారు. అయితే ఇంతగా జీడిపప్పు పండడం వల్ల అక్కడ రైతులకు మాత్రం ఎలాంటి ప్రయోజనం లేదు. అంతా వచ్చి తక్కువ ధరకే జీడిపప్పును కొని పట్టుకెళ్తున్నారు. అది కూడా రోడ్డు పక్కన పెట్టి అమ్ముతుండడం వల్ల కిలో 30 నుంచి 50 రూపాయలకే అమ్మాల్సి వస్తోంది. ఇంతగా జీడిపప్పు పండుతున్నప్పటికీ అక్కడ ఎలాంటి ప్రాసెసింగ్ ప్లాంటు లేదు. అక్కడ ప్రాసెసింగ్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తే ప్రజలకు మరింత ఉపాధి అవకాశాలు దొరకడంతో పాటు, జీడిపప్పు ధర కూడా పెరిగే అవకాశం ఉంది.
Also read: కాళ్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే మీకు అధిక కొలెస్ట్రాల్ ఉన్నట్టే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.