Okinawa Town: ఎక్కువ కాలం జీవించాలని ఉందా? ఈ ప్రాంతానికి వెళ్లండి, 100 ఏళ్లు గ్యారంటీ, ఎందుకంటే..
భారతీయులు 80 ఏళ్లు జీవించేందుకే నానా అవస్థలు పడుతున్నారు.. కానీ జపాన్ లోని ఆ ప్రాంత ప్రజలు 100 ఏళ్లకు పైగానే జీవించేస్తున్నారు. ఇంతకీ వారి సీక్రెట్ ఏమిటీ?
మన దేశంలో జనాల సగటు జీవితం కాలం గరిష్టంగా 80 ఏళ్ల అని అంచనా. అక్కడో.. ఇక్కడో.. మరికొంత మంది మరో ఐదు లేదా పదేళ్లు ఎక్కువగా బతికే అవకాశం కూడా ఉంది. కానీ వందేళ్లు నిండి.. సెంచురీ సెలబ్రేషన్స్ చేసుకొనేవారు చాలా అరుదు. కానీ ఆ ప్రాంతానికి వెళ్తే.. వీధికి కనీసం వందమందైనా వందేళ్ల తాతలు, బామ్మలు కనిపిస్తారు. ఇంతకీ ఆ ప్రాంతం ఎక్కడుంది? వాళ్లు అన్నేళ్లు బతకడానికి కారణం ఏమిటో మీకు తెలుసుకోవాలని ఉందా?
శతాధిక వృద్ధురాలకు పేరొందిన ఆ ప్రాంతం జపాన్‌లో ఉంది. క్యుషు ప్రాంతంలో ఉన్న ఒకినావా అనే ద్వీపంలో నివసిస్తున్న జనాభాలో చాలామంది వందేళ్ల వయస్సు దాటినవారే. అందుకే ఈ ద్వీపాన్ని ‘బ్లూ జోన్’గా పరిగణిస్తారు. వాస్తవానికి, ఒకినావాన్‌లు వందేళ్లు దాటి జీవించడం అక్కడ సర్వసాధారణం. కానీ, మనకు మాత్రం అది చాలా విచిత్రం.
ఇదేనా వారి ఆరోగ్య రహస్యం?: అక్కడి ప్రజలు వందేళ్లకు పైగా జీవించడం వెనుక రహస్యం ఇకిగై. ‘ఇకిగై’ అంటే జీవిత ఉద్దేశ్యానికి అనువాదించే భావన. జపనీస్ సెంటెనరియన్లు ఇకిగై చుట్టూ కేంద్రీకృతమై తమ జీవితాలను కొనసాగిస్తున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వీరి మీద ఓ సర్వే నిర్వహించింది. వారు తమ జీవితాన్ని గరిష్ట సామర్థ్యంతో ఎలా కొనసాగిస్తున్నారనే దానిపై కొంతకాలం అధ్యయనం చేసింది. అక్కడి జనాలను కలిసి వారు పాటించే విధానాల గురించి తెలుసుకుంది. ఎక్కువ కాలం జీవించేందుకు వారు తీసుకునే జాగ్రత్తలను గుర్తించింది.
ఆరోగ్యకరమైన ఆహారం
ఆహారం మన శరీరానికి ఎంతో ఉపయోగం. అయితే దేన్ని ఎంత మొత్తంలో తీసుకోవాలి అనేది కచ్చితంగా తెలిసి ఉండాలి. ‘ది ఓకినావాన్ వే’ అనే పుస్తకాన్ని రచించిన డాక్టర్ బ్రాడ్లీ విల్‌కాక్స్ ప్రకారం.. 100 ఏళ్ల వయస్సు గల వారు తమ రోజువారీ ఆహారంలో చాలా పండ్లు, కూరగాయలతో పాటు చిక్కుడు సంబంధిత పదార్థాలను తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
హర హచి బు
‘హర హచి బు’ అంటే ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించేందుకు ఒకినావాన్లు అనుసరించే ఒక రకమైన అభ్యాసం. దీని ప్రకారం.. ప్రతి వ్యక్తి కడుపులో 80 శాతం నిండేంత ఆహారం మాత్రమే తినాలి. అంటే, 20 శాతం పొట్టను ఖాళీగా ఉంచుకోవాలి. దానివల్ల శరీరం తేలిగ్గా ఉండటమే కాకుండా ఆహారం కూడా త్వరగా అరుగుతుంది.
మానసిక ప్రశాంతత
ఒకినావాన్లు పదవీ విరమణను నమ్మరు. ప్రజలు తాము ఏమి చేయాలనుకుంటున్నారో అది చెప్పేస్తారు. ఎలాంటి దాపరికాలు లేకుండా చాలా ఓపెన్‌గా ఉంటారు. ఇష్టమైన పనులపై మాత్రమే దృష్టి పెడతారు. అనవసర విషయాల్లో కలుగజేసుకోరు. అందుకే వారు ప్రతి పనిని చాలా శ్రద్ధగా చేస్తారు. మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు. అదే వారిని అన్నేళ్లు ఆరోగ్యంగా ఉంచుతుంది.
సామాజిక సమూహం
పెద్ద కుటుంబాలతో పాటు, ఇతరులతో చక్కటి సంబంధాలు ఒకినావాన్ల జీవిత కాలం పెరిగేందుకు మరో కారణం. ప్రజలు పలు సమూహాలలో చేరుతారు. వారంతా నిత్యం కలుసుకుంటారు. తేనీరు తీసుకుంటారు. చుట్టుపక్కల జరిగే వార్తలతో పాటు పలు విషయాల గురించి చర్చించుకుంటారు. మన పూర్వికులు కూడా ఒకప్పుడు ఇలాగే ఉండేవారు. అందుకే మన పెద్దలు అంత ఆరోగ్యకరంగా ఉండేవారు కాబోలు.
సమయంతో సంబంధం
ఒకినావాన్స్ ఏ పని అయినా నెమ్మదిగా, శ్రద్ధగా చేస్తారు. క్యాలెండర్, తేదీల వెంటబడి పరిగెత్తరు. నిత్యం పనిలో తలమునకలు కావడం కంటే సులభంగా పని చేయడానికి ఎక్కువ మొగ్గు చూపుతారు.
ఆధ్యాత్మికత
ఆధ్యాత్మికత అనేది శరీరం, మనస్సు, ఆత్మ మధ్య సంబంధం. దీనికి ఒకినావాన్లు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. వారు తమ శరీరం లోపల, వెలుపల ఆరోగ్యకరమైన ఆరాధన కొనసాగిస్తారు. చూశారుగా, వీరిలో ఒక పద్ధతైనా మనం పాటిస్తే.. ఆయుష్సు పెరిగినా పెరగకపోయినా, ఆరోగ్యంగా జీవించవచ్చు. కానీ, ఈ బిజీ లైఫ్ అది సాధ్యమా?
Also Read: వాట్సాప్‌లో ఆ రంగుల హార్ట్ ఎమోజీలకు అర్థం తెలుసా? ఒక్కో కలర్‌కు ఒక్కో భావం!
Also Read: ఓ మై గాడ్, కోవిడ్ సోకినవారికి మూర్చల ముప్పు - మాస్క్ పెట్టుకోపోతే కష్టమే!