Iron Deficiency: ఈ లక్షణాలు కనిపిస్తే ఐరన్ లోపమేమో చెక్ చేసుకోవాల్సిందే
ఐరన్ లోపం చాలా మందిలో కనిపిస్తోంది. దాని లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుంటే ముందుగానే చికిత్స పొందవచ్చు.
శరీరంలో ఐరన్‌ది చాలా ముఖ్యపాత్ర. ప్రతి కణానికి ఆక్సిజన్‌ను మోసుకెళ్లే హిమోగ్లోబిన్ ఉత్పత్తి అవ్వాలంటే ఇనుము చాలా అవసరం. కానీ ఐరన్ లోపం మనదేశంలో మహిళలు, పిల్లల్లో కనిపిస్తోంది. మహిళల్లో దాదాపు 50శాతం కంటే ఎక్కువ మంది ఐరన్ లోపంతో బాధపడుతున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. కొన్ని లక్షణాల ద్వారా ఐరన్ లోపాన్ని ముందే పసిగట్టవచ్చు. ఐరన్ లోపాన్ని ఎక్కువ కాలం పాటూ పట్టించుకోకుండా వదిలేస్తే అది తీవ్ర సమస్యలకు కారణం- అవుతుంది.
తలనొప్పి
తరచూ తలనొప్పి వేధిస్తుంటే దాన్ని తక్కువ అంచనా వేయద్దు. ఐరన్ లోపం వల్ల కూడా ఇది కావచ్చు. రక్తంలో ఇనుము తగ్గితే మెదడుకు ఆక్సిజన్ సరిగా అందదు. దీని వల్ల రక్తనాళాలు వాపుకు గురవుతాయి.దీంతో తలనొప్పి కలుగుతుంది. అలాగే తల తిరిగినట్టు అనిపించడం, లో బీపీ రావడం కూడా జరుగుతుంది.
చర్మం
చర్మం రంగు మారిపోతుంది. పాలిపోయినట్టు అవుతుంది. ఐరన్ తగ్గడం వల్ల హిమోగ్లోబిన్ కావాల్సినంత ఉత్పత్తి అవ్వదు. దీని వల్ల చర్మం రంగు పాలిపోయినట్టు అవుతుంది. కనురెప్పల లోపలి భాగాల్లో తెల్లగా మారినా కూడా ఇనుము లోపం ఉందేమో గుర్తించాలి.
నీరసం
కారణం లేకుండా నీరసంగా అనిపిస్తుంది. కొందరిలో ఉదమం లేచినప్పటి నుంచి నీరసం ఆవహిస్తుంది. ఇనుము లోపించిన వారిలో ఇది సాధారణ లక్షణం. హిమోగ్లోబినే ఆక్సిజన్ ను మోసుకుని వెళుతుంది. అలాంటి హిమోగ్లోబిన్ శాతమే తగ్గితే శరీరమంతా నిస్సత్తువగా మారుతుంది.
శ్వాస
ఐరన్ లోపించిన వారిలో ఊపిరితీసుకోవడం ఒక్కోసారి కష్టంగా అనిపిస్తుంది. ఛాతీలో అప్పుడప్పుడు నొప్పి వస్తుంది. ఇనుము లోపించడం వల్ల హిమోగ్లోబిన్ తగ్గుతుంది. హిమోగ్లోబిన్ తగ్గడం వల్ల శరీరమంతటికీ ఆక్సిజన్ సరిగా అందదు. దీంతో శరీరం తనకు కావాల్సిన ఆక్సిజన్ కోసం కష్టపడుతుంది. ఇలాంటి సమయంలో ఊపిరి తీయడం కష్టంగా అనిపిస్తుంది.
గుండె
ఇనుము లోపం అధికంగా ఉంటే గుండె కొట్టుకునే వేగంలో తేడా వస్తుంది. గుండె కొట్టుకునే తీరు మారుతుంది. కాబట్టి మీకు ఆ తేడా తెలిస్తే ఐరన్ లోపం ఉందేమో చెక్ చేయించుకోవడం ఉత్తమం.
నాలుక రంగు
వైద్యుడి దగ్గరికి వెళ్లగానే నాలుకను చాపమంటారు. నాలుక రంగు ద్వారా మన ఆరోగ్యాన్ని అంచనా వేయచ్చు. నాలుక వాచడం, రంగు మారడం వంటివి అనారోగ్యాన్ని సూచిస్తాయి. నాలుక గులాబీ రంగులో కాకుండా తెల్లగా పాలిపోయినట్టు ఉంటే ఐరన్ లోపమని అర్థం చేసుకోవాలి.
జుట్టు, చర్మం
చర్మ సమస్యలు రావడం, జుట్టు ఎండిపోయినట్టు మారడం, రాలడం వంటివి ఐరన్ లోపాలన్ని సూచిస్తాయి. శరీరంలో అన్ని అవయవాలకు ఆక్సిజన్ అందాక, చివరగా అందేది జుట్టు, చర్మానికే. ఈ రెండూ కూడా ప్రభావితం అవుతున్నాయంటే ఐరన్ లోపం అధికంగా ఉన్నట్టే.
Also read: వీటిని మైక్రోవేవ్ అవెన్లో వేడి చేయకూడదు, అయినా చేసేస్తున్నాం
Also read: బరువు తగ్గాలనుకుంటున్నారా ? ఉదయాన చేయాల్సిన పనులు ఇవే