Diarrhoea: ప్రయాణాల్లో కడుపు గడబిడ? జర్నీకి ముందు ఈ జాగ్రత్తలు పాటిస్తే సరి!
ప్రయాణాల సమయంలో మీకు ఎప్పుడైనా కడుపు గడ బిడ చేసిందా? బయట ఫుడ్ ఎందుకులే తినడం అని చాలా మంది ఇంట్లోనే పీకల దాకా తినేసి బయల్దేరతారు.
ప్రయాణాల సమయంలో మీకు ఎప్పుడైనా కడుపు గడ బిడ చేసిందా? బయట ఫుడ్ ఎందుకులే తినడం అని చాలా మంది ఇంట్లోనే పీకల దాకా తినేసి బయల్దేరతారు. మరి కొంతమంది ఇంటి నుంచి ఏం తీసుకెళ్తాములే అని బయట దొరికిందేదో తీసుకుని తినేస్తారు. ఇలా ప్రయాణంలో మీ కడుపును నింపేశారే అనుకోండి.. ఇక అంతే సంగతులు. పొట్ట గడ బిడ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తుంది. ప్రయాణ సమయంలో అవసరమైన వస్తువులు ఎలా ప్యాక్ చేసుకుంటామో అలాగే మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే డయేరియా, అజీర్ణం, మల బద్ధకం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రయాణాల్లో చాలా మంది డయేరియా సమస్యని ఎదుర్కొంటూ ఉంటారు. బయట ఉండే వేడి వాతావరణం, అపరిశుభ్ర వాతావరణంలోని ఫుడ్ తీసుకోవడం, కలుషితమైన నీటిని తాగడం వంటి కారణాల వల్ల విరోచనాలు అయ్యే ప్రమాదం ఉంది.
ప్రయాణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
కోవిడ్ 19 కారణంగా ఒక మంచి అలవాటు అందరికీ వచ్చింది. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రపరుచుకోవడం అలవాటు అయ్యింది. మీరు ప్రయాణిస్తున్న సమయంలో ఆహారం, నీరు కలుషితంగా అనిపించినప్పుడు వాటికి దూరంగా ఉండటమే మంచిది. వీలైనంత వరకు బయట ఫుడ్ తినకూడదు.
శరీరం హైడ్రేట్ గా ఉండాలి
ప్రయాణంలో శరీరం డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు నీరు తాగుతూ ఉండాలి. చెమటలు పట్టి నీరసంగా అనిపించినప్పుడు అడపాదడపా ఓఆర్ఎస్ ప్యాకెట్లు తాగడం కూడా మంచిదే. శరీరానికి తగినంత నీరు అందకపోతే డీ హైడ్రేట్ అయిపోతుంది. తాగడానికి మంచి నీళ్ళ బాటిల్ ఎప్పుడు ఉంచుకోవాలి. బయట ఉన్న సమయంలో ఏ నీళ్ళు పడితే వాటిని తాగకుండా మీరు ఎప్పుడు ఎంచుకునే సీల్డ్ బ్రాండెడ్ వాటర్ బాటిల్ మాత్రమే ఎంపిక చేసుకోవడం ఉత్తమం.
ఆహారం విషయంలో జాగ్రత్త
అప్పుడే వండిన, వేడి వేడి ఆహారపదార్థాలని మాత్రమే ఎంచుకోవాలి. ముందే వండి బాక్స్ లో పెట్టిన పదార్థాలను అసలు తినకూడదు. అలాగే గంటల తరబడి టెబుల్స్ మీద బఫెలో ఉన్న వాటిని తీసుకోకూడదు. ఆహార పదార్థాల మీద మూతలు లేకుండా ఉన్న వాటి జోలికి అసలు పోవద్దు. పండ్లు తినేముందు ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కుని తినాలి.
చేతులు ఎప్పటికప్పుడు కడుక్కోవాలి
ప్రయాణ సమయంలో వాష్ రూమ్ కి వెళ్లొచ్చిన ప్రతిసారి చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. హ్యాండ్ శానిటైజర్ మీ బ్యాగ్ లో ఉంచుకోవడం చాలా ఉత్తమం. అలాగే రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే టవల్స్, నాప్ కిన్స్ ఉపయోగించకపోవడమే బెటర్. వాటికి ఎంతో మంది చేతులు తుడుస్తూ ఉంటారు.
సాధారణంగా డయేరియా నాలుగైదు రోజుల్లో తగ్గిపోతుంది. మజ్జిగ, మంచినీళ్ళు, ఓఆర్ఎస్, తేలికపాటి భోజనం తీసుకోవాలి. మీరు కనుక రక్తపు వాంతులు, విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతుంటే మాత్రం తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: బరువు తగ్గాలా? జంక్ ఫుడ్‌కు బదులు వీటిని ట్రైచేయండి - రుచిగా ఉంటాయ్, ఆరోగ్యకరం కూడా!
Also Read: బొజ్జ తగ్గాలా? పరగడుపున ఇది తాగితే బెల్లి ఫ్యాట్ ఇట్టే కరిగిపోతుంది, ఇలా తయారు చేయండి