Garlic: వెల్లుల్లిని మీ వంటగది గార్డెన్లో సులువుగా ఇలా పెంచేయండి
వెల్లుల్లి లేనిదే ఏ కూర పూర్తి కాదు, వీటిని ఇంట్లోనే పెంచుకోవచ్చు.
వెల్లుల్లి ప్రతి తెలుగు ఇంట్లో కనిపించేదే. కూరలు, బిర్యానీలు వంటి వాటిలో వెల్లుల్లి పడనిదే సరైన రుచి రాదు. ఎలాంటి వంటకాలకైనా అధిక రుచిని అందించే సామర్థ్యం వెల్లుల్లికి ఉంది. అయితే చాలామంది కొత్తిమీర, పుదీనా వంటివి ఇంట్లో పెంచుకోవడానికి ఆసక్తి చూపిస్తారు కానీ, వెల్లుల్లిని పెంచాలని అనుకోరు. నిజానికి వెల్లుల్లి ఇంట్లో పెంచడం చాలా సులువు. మీ కిచెన్ గార్డెన్లో కూడా సులువుగా ఇది పెరిగేస్తుంది. కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే చాలు, మీ వెల్లుల్లి గడ్డలను మీరే పెంచుకోవచ్చు. అంతేకాదు వెల్లుల్లి కాడలను కూడా వంటల్లో ఉల్లికాడల్లాగే ఉపయోగించవచ్చు. ఇవి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది.
వెల్లుల్లిని పెంచాలనుకునేవారు, ముందుగా నాణ్యమైన వెల్లుల్లి గడ్డలను ఎంచుకోవాలి. ఎంత నాణ్యంగా ఉంటే అవి అంత దిగుబడిని ఇస్తాయి. మట్టి, కంపోస్ట్ రెడీ చేసుకోవాలి. మట్టిలో కంపోస్టును కలిపి ఒక కుండీలో వేసుకోవాలి. కంపోస్టుకు బదులు పేడను కలుపుకున్నా మంచిదే. వెల్లుల్లి పంట సాధారణంగా ఆరు నుంచి ఏడు మధ్య ఉన్న పీహెచ్ విలువ ఉన్న నేలలో పెరుగుతుంది. అధిక నత్రజని ఉన్న ఎరువులను వీటికి వాడకూడదు. ఎందుకంటే అవి పెరుగుదలను నిరోధిస్తాయి. వెల్లుల్లి పెంచడానికి మట్టిని సిద్ధం చేసేటప్పుడు 50%, మట్టిని 50% కంపోస్టును కలుపుకోవాలి.
ఇప్పుడు వెల్లుల్లిని ఒక్కొక్క రెబ్బను వేరు చేయాలి. కానీ పై పొరలు మాత్రం చెక్కుచెదరకూడదు. ఏ కుండీలో అయితే వెల్లుల్లి పెంచాలనుకుంటున్నారో, ఆ కుండీ అడుగున రంధ్రాలు చేయండి. డ్రైనేజీ సరిగా ఉంటేనే మొక్కలు బాగా పెరుగుతాయి. నీళ్లు నిలిచిపోతే మొలకలు రాకుండా మట్టిలోనే కుళ్లిపోతాయి. ఇప్పుడు మట్టిని, కుండీలో నింపి రెండు అంగుళాల లోపలకి రంధ్రాలు పెట్టండి. ఆ రంధ్రాల్లో వెల్లుల్లి రెబ్బలను ఉంచండి. అవి కూడా వెల్లుల్లి ఏ వైపు అయితే నేల వైపు నుంచి పెరుగుతుందో అదే కోణంలో వెల్లుల్లి రెబ్బలను ఉంచాలి. తోకను పైవైపుకు ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు మొత్తాన్ని మట్టితో కప్పేయండి. వెల్లుల్లి పెరగడానికి చాలా సమయం పడుతుంది. అంత త్వరగా మొలకలు రావు. ముందుగా పచ్చని కాడలు వస్తాయి. ఆ తరువాత దాదాపు 8 నెలల పాటు వెల్లుల్లి భూమిలో పెరుగుతుంది. లోపల వెల్లుల్లి కోతకు సిద్ధమైంది అని చెప్పే సంకేతం బయట వైపు ఉన్న పచ్చ మొక్కలు, పసుపు రంగులోకి మారతాయి. అలాంటప్పుడు వెల్లుల్లిని భూమి నుంచే తీసుకోవచ్చు. మీరు ఇంట్లోనే పెంచుకునే ఈ వెల్లుల్లి ఎలాంటి పురుగులు మందులు చల్లకుండా పండిన సేంద్రియ పంట. మీరు ఒక్కసారి ఇలా పండించుకోవడం మొదలుపెడితే ఇక మీరు బయట కొనడం కూడా ఆపేస్తారు.
Also read: ఇనుప కళాయిలో ఈ కూరగాయలు వండకూడదు, వండితే ఏమవుతుందంటే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.