Plantar Fasciitis: పాదాల నొప్పి వేధిస్తోందా? కారణం ఇదే - ఇలా చేస్తే పూర్తిగా ఉపశమనం
పాదాల నొప్పితో ఏళ్లుగా బాధపడే వారిని తరచుగా చూస్తూనే ఉంటాం. కాస్తదూరం నడవడం ఇబ్బందే, కాస్త సమయం నిలబడడం కూడా కష్టమే. కానీ దీనిని కేవలం ఒకే ఒక వారంలో నయం చెయ్యవచ్చని నిపుణులు చెబుతున్నారు.
పాదాలు, మడమల నొప్పిని ప్లాంటర్ ఫాసిటిస్ అంటారు. పాదాల మీద, పాదాన్ని మడమతో కలిపి ఉండే ఎముకల మీద భారం పడడం వల్ల కలిగే నొప్పి ఇది. దాదాపుగా ఏడు శాతం పెద్ద వయసు వారిలో సాధారణంగా కనిపించే సమస్య. కాలం గడిచేకొద్ది తిరగడం ఇబ్బందిగా మారుతుంది. కొన్ని చిన్నచిన్న స్టెప్స్ ను ఫాలోచేసి ఈ బాధను ఇంట్లోనే పరిష్కరించుకోవచ్చట.
ప్లాంటర్ ఫాసిటిస్ అంటే?
ప్లాంటర్ ఫాసిటిస్ ఒక బాధకరమైన స్థితి అని చెప్పవచ్చు. మందంగా ఉండే ఫైబ్రోసిస్ కణజాలం మీద ప్రభావం చూపుతుంది. ఈ కణజాలాలు కాళ్ల మీద పడే ఒత్తిడికి షాక్ అబ్జోర్బర్స్ గా పనిచేస్తాయి. అసలు ఏ కారణంతో పాదాల మీద భారం పడుతుందనేది స్పష్టంగా తెలియదు. గట్టిగా ఉండే ఉపరితలం మీద నడవడం లేదా వ్యాయామం చెయ్యడం ఈ మధ్య మొదలు పెట్టింటే మాత్రం ఇది రావడం సాధారణమే.
ఇలా పాదాల్లో నొప్పి రావడానికి చాలా కారణాలు ఉండవచ్చు. 40 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్కుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. పిక్క కండరాలు బిగుతుగా బిగుసుకుని ఉన్న వారు వాకింగ్ చేస్తే పాదాల్లో నొప్పి రావచ్చు. బరువు ఎక్కువ ఉన్న వారికి కూడా పాదాల నొప్పి రావచ్చు.
లక్షణాలు
ప్లాంటర్ ఫాసిటిస్ లో అరికాలు కింది వైపు నొప్పిగా ఉంటుంది. ఈ నొప్పి మడమ నుంచి మొదలవుతుంది. లేదా పాదం మధ్య ఉండే వంపు నుంచి మొదలవుతుంది. విశ్రాంతి తర్వాత నడవడం ఇబ్బంది గా ఉంటుంది. మరొ ప్రత్యేక లక్షణం ఏమిటంటే వ్యాయామం చేస్తే రిలీఫ్ గా ఉంటుంది. విశ్రాంతిగా ఉంటే నొప్పి ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. నేల మీద నుంచి కాలుపూర్తిగా పైకి లేపడం కష్టంగా ఉన్నట్టు అనిపిస్తే అది ప్లాంటర్ ఫాసిటిస్ అని అనుమానించాలి.
వారంలో ఎలా తగ్గించవచ్చు?
నిజానికి ఎవరికి వారు ఒకటి రెండు వారాల్లోనే ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు.
వీలైనంత వరకు విశ్రాంతి సమయంలో పాదాలను స్టూల్ మీద కాస్త ఎత్తులో పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
నొప్పి ఉన్న భాగంలో ఐస్ ప్యాక్ తో కాపడం పెట్టడం వల్ల కూడా నొప్పి నుంచి ఉపశమనం దొరుకుతుంది.
కుషన్డ్ హీల్, ఆర్చ్ సపోర్ట్ ఉన్న చెప్పులు లేదా షూస్ ధరించడం లేదా ఇన్సోల్స్ లేదా హీల్ ప్యాడ్ లను ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
సున్నితమైన స్ట్రెచింగ్, స్విమ్మింగ్ వంటి వ్యాయామాలు కూడా మంచి ఫలితాలను ఇస్తాయి.
Also read : ఏ తీపైనా చేదే - ఆర్టిఫిషియల్ స్వీటెనర్లు అంత ప్రమాదకరమా? భయపెడుతోన్న WHO రిపోర్ట్
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial