ఏ తీపైనా చేదే - ఆర్టిఫిషియల్ స్వీటెనర్లు అంత ప్రమాదకరమా? భయపెడుతోన్న WHO రిపోర్ట్
చూయింగమ్ లు, యోగర్ట్ లలో కూడా కనిపించే అస్పర్టమే మనుషులకకు కార్సినోజెనిక్ గా పరిణమించే ప్రమాదం ఉందని డబ్య్లూహెచ్ఓ అధికారులు వెల్లడి చేశారు.
ఈ మధ్య చాలా మంది లోషుగర్ స్వీటనెర్(Artificial Sweeteners)ల వినియోగం పెంచారు. బరువు, షుగర్ స్థాయిలు పెరగకుండా తీపి లాగింవచ్చనే ఆశతో ఆర్టిఫిషియల్ స్విటెనర్‌లను అతిగా వాడేస్తున్నారు. కానీ ఇవి అంత సురక్షితం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization - WHO) హెచ్చిరిస్తోంది. చూయింగమ్‌లు, యోగర్ట్ లలో కూడా కనిపించే అస్పర్టమే మనుషులకు కార్సినోజెనిక్ గా పరిణమించే ప్రమాదం ఉందని WHO అధికారులు వెల్లడి చేశారు.
అస్పర్టమే (Aspartame) అనే ఆర్టిఫిషియల్ స్విటెనర్ మనుషుల్లో క్యాన్సర్‌కు కారణం కావచ్చట. WHOకు చెందిన ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్‌కు చెందిన నిపుణులు ఈ స్వీటెనర్ వినియోగం కాలేయ క్యాన్సర్‌కు కారణం కావచ్చనే ఆధారాలు పరిమిత స్థాయిలో ఉన్నాయని అంటున్నారు. ఇక ఇదే సంస్థకు చెందిన న్యూట్రిషన్ అండ్ సేఫ్టీ విభాగం వీలైనంత వరకు తీపి వాడకాన్ని తగ్గించుకోవడం మంచిదని సూచించింది.
సాఫ్ట్ డ్రింక్స్ వాడకం కంటే నీళ్లు తాగడం అన్నింటికి మంచిదని మరోసారి నొక్కి వక్కాణిస్తున్నారు. ఫ్రీషుగర్లు, స్వీటెనర్లు లేని చాలా ఉత్పత్తులు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి, వాటిని ఎంచుకోవడం మంచిదని ఎక్స్ పర్ట్స్ సలహా ఇస్తున్నారు.
మే నెలలోనే బరువు తగ్గేందుకు షుగర్ ఫ్రీ స్వీటెనర్లను వినియోగించకూడదని డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ రసాయనాలు గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ కు కూడా కారణం కాగలవని చెప్పింది. ఇప్పుడు కొత్తగా చేపట్టిన మూడు అధ్యయనాల ఆధారంగా అస్పర్టమే కాలేయ క్యాన్సర్ ను కలిగించవచ్చని కూడా హెచ్చరిస్తోంది.
ఈ వివరాలు అందిస్తూనే ఇప్పటి వరకు మార్కెట్ లో ఉన్న అన్ని ఉత్పత్తుల్లోనూ దీని వినియోగం పరిమితులకు లోబడే ఉన్నట్టు వెల్లడి చేశారు. కనుక తీసుకున్నంత మాత్రాన్న క్యాన్సర్ బారిన పడతారని కంగారు పడాల్సిన అవసరం లేదని కూడా సూచించింది. కానీ దీని వినియోగం వల్ల క్యాన్సర్ ముప్పు పొంచి ఉంటుందని వివరాలు వెల్లడి చేసింది.
వీలైనంత వరకు చక్కెరల వినియోగం తగ్గించుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చనేది నిపుణుల సూచన. తీపి తగ్గించి తినాల్సిందిగా ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. డైట్ వెర్షన్ల వల్ల పెద్ద ఉపయోగం లేదనేది అందరూ ముక్త కంఠంతో చెబుతున్న విషయం. సాఫ్ట్ డ్రింక్‌ల వినియోగం చాలా రకాలుగా శరీరానికి నష్టం చేస్తుందనే విషయాన్ని మరోసారి డబ్ల్యూహెచ్ఓ తన కొత్త నివేదిక ద్వారా ప్రపంచానికి తెలియజేస్తోంది. షుగర్ ఫ్రీ అని ఆర్టిఫిషియల్ స్వీటెనర్ల వినియోగం వల్ల మొదటికే మోసం రావచ్చనేది ఈ నివేదిక సారాంశం. ముఖ్యంగా అస్పర్టమే క్యాన్సర్‌ను కూడా కలిగించగలదని హెచ్చరిస్తోంది.
Also read : వామ్మో, చెవిలో ఇయర్ బడ్స్‌తో తిప్పితే భావప్రాప్తి? సమ్మగా ఉన్నా సమస్యే!
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial