(Source: ECI/ABP News/ABP Majha)
Subhash ChandraBose: మీలో ఎంతమందికి తెలుసు నేతాజీ ఒక ఐఏఎస్ ఉద్యోగి అని? ఉద్యమం కోసం ఉద్యోగాన్ని వదిలేసిన మహానేత
స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి నేడు.
‘మీ రక్తాన్ని ధారపోయండి... మీకు స్వాతంత్య్రాన్ని తెచ్చిస్తాను’జులై 4, 1944లో బర్మాలోని భారత జాతీయ సైన్యం పాల్గొన్న ర్యాలీలో సుభాష్ చంద్రబోస్ చేసిన ఉత్తేజపూరిత వ్యాఖ్యలు ఇవి. వీటిని ఇప్పటికీ ఏ భారతీయుడు మర్చిపోలేడు. అతని జీవితమే కాదు మరణమూ వివాదాస్పదమే... ఇప్పటికీ అంతుపట్టని రహస్యమే.
అహింసా మార్గాన్నే ఎంచుకున్న గాంధీతో విబేధాలు రావడానికి ఇలాంటి వ్యాఖ్యలే కారణమన్నవాళ్లు ఉన్నారు. స్వాతంత్య్రం కేవలం ఆయుధంతోనే సాధ్యమవుతుందని నమ్మిన వ్యక్తి బోస్. కానీ గాంధీ రక్తపాతానికి వ్యతిరేకం. ఎదుటివాడు తుపాకులతో కాలుస్తుంటే చేతిలో ఆయుధం లేకుండా వారిని ఎదుర్కోవడం సాధ్యం కాదని, మనం కూడా సాయుధులం అవ్వాల్సిందేనని భావించాడు బోస్. అందుకే గాంధీని వీడి సొంత కుంపటి పెట్టారు. జర్మనీ, జపాన్ దేశాలతో స్నేహం కోపం తపించారు. జపాన్ అందించిన సాయంతో భారత యుద్ధ ఖైదీలు, ఉద్యమకారులు, తన అనుచరులు, రబ్బరు తోటల్లో పనిచేసే భారతీయ కూలీలతో సైన్యాన్ని ఏర్పాటుచేశారు. రెండో ప్రపంచయుద్ధ సమయంలోనే తన సైన్యాన్ని సిద్ధం చేశాడు బోస్. సింగపూర్లో ఉండి ఆజాద్ హింద్ ఫౌజ్ ఏర్పాటు చేశాడు. ఈ పరిణామాలన్నీ భారత్ దేశానికి చెందిన కొంతమంది ఉద్యమనాయకుల్లో ఆగ్రహాన్ని తెప్పించింది. అయినా వెనక్కి తగ్గలేదు.
ధనవంతుల బిడ్డ...
బోసు ఒడిశాలోని కటక్ పట్టణంలో 1897లో జన్మించారు. ఆయన చాలా ధనిక కుటుంబంలో పుట్టారు. తండ్రి జానకీనాథ్ బోస్ లాయరు. తల్లి ప్రభావతి. బిడ్డను అల్లారుముద్దుగా పెంచారు. దేనికీ లోటు లేదు. తండ్రి తరపు ఆస్తులు ఎక్కువే. అయినా బోస్ సోమరిగా ఇంట్లో కూర్చోలేదు. చదువులో చాలా చురుకుగా ఉండేవాడు బోస్. విద్యాభ్యాసం కటక్, కోల్‌కతాలలో సాగింది.
సివిల్ సర్వెంట్ ఉద్యోగాన్ని వదిలి...
‘ఇండియన్ సివిల్ సర్వీసెస్’ పేరుతో ఇంగ్లాండులో పరీక్షలను నిర్వహించేంది బ్రిటిస్ ప్రభుత్వం. బోస్ అక్కడికి వెళ్లి పరీక్ష రాసి నాలుగో స్థానంలో నిలిచారు. ఏడాది పాటూ ఉద్యోగం చేశాక 1921 ఏప్రిల్ లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. దానికి కారణం స్వాతంత్య్ర కాంక్ష. ఉద్యోగాన్ని వదిలేశాక తన అన్నకు లేఖ రాశారు బోస్... అందులో ‘త్యాగం, బాధ నిండిన నేలపై మాత్రమే మనం జాతీయ ప్రేమను పెంచుకోగలం’ అని రాశాడు. దీన్ని బట్టి ఆయనకు ఇంగ్లాండుపై ప్రేమలేదని, తన స్వదేశంపైనే ప్రేమ ఉందని చెప్పకనే చెప్పాడు.
మరణం ఇప్పటికీ వివాదాస్పదం...
తాను కాంక్షించిన స్వాతంత్య్రాన్ని కళ్లారా చూడకుండానే 1945 ఆగస్టు 18న విమానప్రమాదంలో మరణించినట్టు వార్తలు వచ్చాయి. ఈ ప్రమాదం తైవాన్లో జరిగింది. అయితే అతను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడని, కొన్నాళ్లు అజ్ఞాతంలో ఉన్నాడని అంటారు. విమాన ప్రమాదంలో ఆయన పార్థివదేహం తాలూకు ఆనవాళ్లు కూడా దొరకలేదు. మరో కథనం ప్రకారం బోస్ సోవియట్ యూనియన్ వారికి బందీగా చిక్కారని సైబీరియా జైల్లోనే మరణించారని అంటారు. దీనిపై కూడా భారత ప్రభుత్వం చాలా కమిటీలు వేసింది. అదెంత వరకు నిజమో ఇంతవరకు ఎవరూ తేల్చలేకపోయారు. కానీ ఎక్కువ మంది నమ్మకం మాత్రం ఆ ప్రమాదంలో బోసు మరణించారనే.
అయోధ్యలో సన్యాసిగా...
అయోధ్యలోని ఫైజాబాద్ లో 1985లో ఓ సన్యాసి తన పేరు బోసుగా చెప్పుకున్నాడని అతడే నేతాజీ అని నమ్మిన వాళ్లు ఉన్నారు. దాన్ని తేల్చేందుకు కమిషన్ వేసింది ప్రభుత్వం. అది కూడా తప్పని తేలింది.
Also read: ప్లేటులో బాతు మెడ వంటకం... ఎలా తినాలంటూ తిట్టిపోస్తున్న నెటిజన్లు, లండన్ రెస్టారెంట్ చెత్త ప్రయోగం
Also read: ఎత్తుతోనే ఆత్మవిశ్వాసం... మంచి ఎత్తు పెరగాలంటే పిల్లలకు పెట్టాల్సిన ఆహారాలు ఇవే
Also read: రోజుకు రెండు స్పూన్ల పంచదార తింటే చాలు... భవిష్యత్తులో వచ్చే అనారోగ్యాల చిట్టా ఇదిగో
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.