గుడ్లు తింటున్నారా? అవి తాజావేనా? ఇదిగో ఇలా తెలుసుకోండి
బ్యాచిలర్స్ ఫెవరేట్ కర్రీ అంటే ఎగ్ కర్రీ. అందరికీ హార్ట్ ఫెవరేట్. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్ ఏటైములో అయినా సరే తినేందుకు అనుకూలమైన ఆహారం గుడ్డే.
గుడ్డెప్పుడు వెరీ గుడ్డే. గుడ్డులో కొంత మంది తెల్లసొన తింటారు. కొందరు గుడ్డంతా తినడానికి ఇష్టపడతారు. అయితే, మీరు బరువు తగ్గాలనుకుంటే తెల్లసొన మాత్రమే తినండి. గుడ్డు రిబోఫ్లెవిన్, విటమిన్ బి12 కలిగిన బలమైన ఆహారం. ముఖ్యంగా తాజా గుడ్లు ఆరోగ్యానికి చాలామంచివి. అంతా.. ఓకే, మరి తాజా గుడ్లను ఎలా గుర్తించడం?
గుడ్లు నిజానికి ఎంతకాలం నిల్వ ఉండగలుగుతాయి? ఒకే సారి తెచ్చి పెట్టకుంటే ఎన్ని రోజుల వరకు వాడుకోవచ్చు? వంటి అనుమానాలు అందరికీ ఉంటాయి. మరి ఆ అనుమానాలు తీర్చుకునే ప్రయత్నం చేద్దాం.
గుడ్డు మంచి పుష్టికరమైన ఆహారం. అన్ని కాలాల్లోనూ దొరుకుతుంది. వండడం కూడా చాలా తేలిక. చాలా రకాలుగా వండుకోవచ్చు. అయితే కూరగాయలు, పండ్లు.. ఇలా ఏ తినే పదార్థాలైనా కొంత కాలానికి చెడిపోతాయి. వాటి కాల పరిమితి ఎంత అనేది సులభంగా అర్థమవుతుంది. చెడిపోతే తెలిసిపోతుంది. వాటి రంగు, రుచి మారిపోతుంది. కానీ గుడ్లు తాజాగా ఉన్నాయో లేదో తెలుసుకోవడం మాత్రం కష్టమే. గుడ్లు ఎంత కాలం నిల్వ ఉంటాయి? ఎన్ని రోజుల లోపు తినవచ్చు? అనే విషయాల గురించి తెలిసిన వారు చాలా తక్కువ మంది.
మాములుగా చికెన్ సెంటర్లు, కిరాణా షాపుల నుంచి కోడిగుడ్లు కొని తెచ్చుకుంటాం. అయితే అవి అక్కడ ఎన్నిరోజులుగా ఉన్నాయో మనకు తెలిసే అవకాశం లేదు. సూపర్ మార్కెట్లలో దొరికే వాటితో సమస్య ఉండదు. దానిమీద బెస్ట్ బిఫోర్ తేదీలు ఉంటాయి. మరి తేది దాటితే వాటిని వాడకూడదా?
కొన్ని చిన్న చిన్న చిట్కాలతో గుడ్ల తాజాదనాన్ని తెలుసుకోవచ్చు. గుడ్డు మీద షెల్ ఉండడం వల్ల లోపలి పదార్థం చెడిపోయిందా? బాగుందా అనేది త్వరగా తెలుసుకోలేం. ఈ షెల్.. వాటి షెల్ఫ్ లైప్ ను కూడా పెంచుతుంది. అంత త్వరగా చెడిపోవు. కొద్దిగా ప్రాసెస్ చేస్తే ఇంకొంచెం ఎక్కువ కాలం నిల్వ ఉండే అవకాశం ఉంటుంది. గుడ్లు ఉత్పత్తయిన రోజు నుంచి నాలుగు వారాల వరకు నిల్వ ఉంటాయి. గుడ్డు నిల్వ ఉండేందుకు అనువైన వాతావరణం, అనుకూల పరిస్థితులు ఉండాలి కూడా. ఫ్రిజ్ లో పెట్టి నిల్వ చేస్తే దాదాపు 45 రోజుల వరకు బావుంటాయి. అలా కాకుండా బయట పెట్టినపుడు ఏడు నుంచి పది రోజుల వరకు నిల్వ పెట్టుకోవచ్చు.
గుడ్డు పాడైపోయిందని ఎలా తెలుస్తుంది?
పాతకాలం నుంచి కూడా గుడ్డు ఎంత తాజాగా ఉందో తెలుసుకునేందుకు నీటి పరీక్ష ఒకటి ప్రాచూర్యంలో ఉంది. గిన్నెలో నీళ్లు తీసుకుని అందులో గుడ్లు వేసినపడు గుడ్డు అడుగుకు చేరిపోతే అవి తాజా గుడ్లని అర్థం. అయితే ఒక్కోసారి కొన్ని గుడ్లు అడుగుకు చేరుతాయి. కానీ ఒక మొనమీద నిలబడినట్టు ఉంటాయి. వాటి ఎక్స్పైరీ దగ్గరపడిందని అర్థం. పర్వాలేదు తినవచ్చు. కానీ కొన్ని పైకి తేలుతాయి అవి పాడైపోయినట్లు అర్థం చేసుకోవాలి. వాటిని తినకూడదు. ఇలాంటి గుడ్డును ఉడికిస్తే లోపలి పదార్థం బయటకు వచ్చేస్తుంది. ఇలాంటి గుడ్లు తినకపోవడం మంచిది. రంగుమారినా లేదా పగుళ్లు ఏర్పడినా అవి కుళ్లిపోయాయని అర్థం. అటువంటి గుడ్డు అసలు తినకూడదు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also read: మనం తాగే టీ, తినే పసుపే కరోనా మరణాలను తగ్గించింది - ICMR అధ్యయనంలో వెల్లడి