Child Health: ఉన్నోళ్లకి ఒబేసిటీ, లేనోళ్లకి అనీమియా - అత్యంత దారుణంగా దేశంలో పిల్లల పరిస్థితి
Lifestyle News: పిల్లల భవిష్యత్ భారంగానో లేదా నిస్సత్తువగానో మారుతోంది. జనాభాలో పాతిక కోట్లుగా ఉన్న ఆ చిన్నారుల ఆరోగ్యంపై హెల్త్ ఎక్స్‌పర్ట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Telugu News: ఇవాళ్టి పిల్లలే రేపటి భవిష్యత్ అంటారు. కానీ ఆ భవిష్యత్ భారంగానో లేదా నిస్సత్తువగానో మారుతోంది. భారత దేశంలో ఉన్న ప్రతి ఐదుగురులో ఒకరు చిన్నారే. దేశ జనాభాలో పాతిక కోట్లుగా ఉన్న ఆ చిన్నారుల ఆరోగ్యంపై హెల్త్ ఎక్స్‌పర్ట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత లైఫ్‌స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ కారణంగా చిన్నారుల్లో ఎక్కువ మంది డయాబెటిస్, ఒబేసిటీ లేదా అనీమియా బారిన పడుతున్నట్లు స్టాటిస్టిక్స్ చెబుతున్నాయి. భారత్‌లో ఉన్న ప్రతి పది మంది చిన్నరుల్లో ఒకరు టైప్ 1 డయాబెటిక్ ప్రమాదం అంచున ఉన్నారు. ఇక ఆహారపు అలవాట్లు ఇలానే కొనసాగితే 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న చైల్డ్ ఒబేసిటీ పేషెంట్లలో ప్రతి 10 మందిలో ఒకరు భారత్‌నుంచే ఉండే ప్రమాదం పొంచి ఉంది. ఇక రక్త హీనతతో లక్షలాది మంది చిన్నారులు నిస్సత్తువగా మారుతున్నారు. పరిస్థితి ఇలాగే మారితే రేపటి భారతం అగమ్యగోచరంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
భారత్ ప్రపంచ శక్తిగా ఎదిగి ఇన్నోవేటివ్ విభాగంలో వరల్డ్‌ని శాసించాలనంటే చిన్నారుల ఆరోగ్యాన్ని పరిరక్షించడం అత్యవసరమని అంటున్నారు. వీలైనంత త్వరగా పేరెంట్స్‌తో పాటు వ్యవస్థలు కూడా చిన్నారుల ఆహారపు అలవాట్లను మార్చడంలో శ్రద్ధపెట్టక పోతే బాలభారతం కాస్త రోగభారతంగా మారే ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. స్కూల్‌కి వెళ్లే పిల్లల హెల్త్‌కు సంబంధించి తల్లిదండ్రులకు, కమ్యూనిటీలకు ఇప్పటికే నేషనల్ ఎన్‌సీడీ మానటరింగ్ ఫ్రేమ్‌వర్క్ ఈ విధమైన సూచనలు చేసినప్పటికీ అవి అమల్లోకి రాలేదు.
పేరెంట్స్ మరియు కమ్యూనిటీలు తక్షణం ఏం చేయాలి?:
11 నుంచి 13 ఏళ్ల మధ్య వయస్సు చిన్నారుల భవిష్యత్‌కు సంబంధించి చాలా ముఖ్యమని నిపుణులు అంటున్నారు. ఈ వయస్సులోనే పిల్లల్లో ఇన్నోవేటివ్ థింకింగ్ అలవడుతుందని.. ఎక్కువ విషయాలను గ్రాస్ప్ చేసుకోగల శక్తి కూడా పెరుగుతుందని.. ఆ దశలో వారికి ఆరోగ్యం పట్ల సరైన మార్గనిర్దేశనం అవసరమని ఆరోగ్య వరల్డ్ ఫౌండర్ అండ్ సీఈఓ నళిని సాలిగ్రామ చెబుతున్నారు. చిన్నారులకు ఆరోగ్యకరమైన జీవనం గురించి ఎప్పటికప్పుడు వయస్సుల వారీగా చెబుతూ ఉండాలన్నారు. ఆటలు ఇతర యాక్టివిటీస్‌లో మస్ట్‌గా పాల్గొనేలా పేరెంట్స్, కమ్యూనిటీలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. న్యూట్రిషన్ గురించి, బేలన్స్‌డ్ డైట్ గురించి చెప్పాలని వీటితో పాటు సెక్సువల్ అండ్ రీప్రొడక్టివ్ హెల్త్ గురించి వారికి అవగాహన కల్పించాలని నళిని సూచిస్తున్నారు. వాళ్లకు హెల్త్ రైట్స్ గురించి వివరిస్తూ బెటర్ ఛాయిస్‌లు ఎంచుకునేలా చూడాలని చెబుతున్నారు.
పాఠశాలలకు బాధ్యత లేదా?
టెక్ట్స్ బుక్స్‌లో ఉన్న సైన్స్‌ని లైఫ్‌కు అనువదిస్తూ డిజైన్డ్ గేమ్స్ ఆడించడం ద్వారా పిల్లల్లో శారీరక దృఢత్వం పెరుగుతుందని సాలిగ్రామ అంటారు. ప్రస్తుతం స్కూల్స్‌లో మార్కుల గురించి ధ్యాస తప్ప చిన్నారుల శారీరక దృఢత్వం గురించి పట్టించుకున్న పాపాన పోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్న నిపుణులు పాఠశాలల్లో తప్పనిసరిగా గేమ్స్ భాగంగా ఉండాల్సిందే అంటున్నారు. వీలైనంత వరకు పేరెంట్స్ కూడా పిల్లలను జంక్ ఫుడ్స్‌కు దూరంగా ఉంచాలని.. ఇంట్లోనే వారికి ఆరోగ్యకరమైన ఫుడ్స్ వండి పెట్టాలని చెబుతున్నారు. ఈ విషయంలో కుటుంబంలోని ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాల్సి ఉంటుందని నళిని సూచిస్తున్నారు. ఒబేసిటీ, రక్తహీనత ఈ రెండు మన దేశాన్ని పట్టి పీడిస్తున్న భూతాలుగా పేర్కొన్న నళిని.. వాటిని పారదోలక పోతే భవిష్యత్ ఉండదని హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు .. ఆ భాగ్యాన్ని చిన్నారులకు దూరం కాకుండా సమాజం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఆరోగ్య నిపుణులు గుర్తుచేస్తున్నారు.