Sabudana: సగ్గుబియ్యం ఎందుకంత ఆరోగ్యమో తెలుసా? వాటి తయారీలోనే ఉంది రహస్యమంతా
సగ్గుబియ్యం వేటితో తయారు చేస్తారో తెలుసు కానీ ఎలా చేస్తారో తెలుసా మీకు?
సాబుదానా, సగ్గుబియ్యం... రెండూ ఒకటే. ఒక్కోప్రాంతంలో ఒక్కోలా పిలుచుకుంటారు. తెలుగువారి ఇళ్లల్లో సగ్గుబియ్యానిది ప్రత్యేక స్థానం. వేసవి వచ్చిదంటే చాలు చల్లదనం కోసం సగ్గుబియ్యంతో చేసిన జావను తాగుతారు. అలాగే వడియాలు, పాయసం, కిచిడి ఇలా ఎన్నో రకాల వంటలు చేసుకుంటారు.సగ్గుబియ్యం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.పోషకాహారలోపం ఉన్నవారికి సగ్గుబియ్యం వంటకాలు పెడితే త్వరగా తేరుకుంటారు. ఇవి తింటే బరువు పెరిగే అవకాశం కూడా చాలా తక్కువ. ఈ గింజల్లో పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటు సమస్యలు తలెత్తకుండా కాపాడుతుంది. రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తుంది. అజీర్తి సమస్యలు తీర్చడంలో కూడా ఇది ముందుంటుంది.సులభంగా జీర్ణమయ్యే ఫైబర్ ఇందులో ఉండడం వల్లే పిల్లలకు ఇది మంచిది. సగ్గుబియ్యంలో రాగి, ఇనుము, కాల్షియం ఉంటాయి. ఎముకల సమస్యలు రాకుండా కాపాడుతుంది. నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలోనూ ఇది ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఎప్పుడైనా ఆలోచించారా సగ్గుబియ్యానికి ఇన్ని పోషక విలువలు ఎక్కడినుంచో వచ్చాయో?
ఎలా తయారుచేస్తారు?
సగ్గుబియ్యం తయారయ్యేది కర్రపెండలం అనే దుంప జాతి మొక్కతో అని చాలా మందికి తెలుసు. దుంపలోని ఏ భాగం ఇలా సగ్గుబియ్యం గింజల రూపంలోకి మారుతుందో తెలుసా? కర్రపెండలం నుంచి పాలలో ఉండే ఓ చిక్కని పదార్థంతో. కేవలం తాజా దుంపలు మాత్రమే సగ్గుబియ్యం తయారీకి పనికొస్తాయి.దుంపను భూమిలోనుంచి తవ్విన 24 గంటలలోపే తయారీకేంద్రానికి తీసుకెళ్లాలి. యంత్రాల సాయంతో పైనున్న తొక్కను తీసేసి క్రషర్ లో పెట్టి పాలను తీస్తారు. పాలల్లో ఉండే చిక్కని పదార్థాన్ని వేరు చేయడానికి ఫిల్టరింగ్ పద్ధతులను పాటిస్తారు. అలా చివరికి తెల్లని పదార్థం మిగులుతుంది. ఆ ముద్దనే జల్లెడలాంటి యంత్రంలో వేసి ఇటూ అటూ కదిలిస్తుంటే బూందీలాగే గుండ్రని గింజలు పూజల్లా రాలి పడతాయి. మొదట్లో అవి చాలా మెత్తగా ఉంటాయి. వాటిని ఎర్రటి ఎండలో ఎండబెట్టి గట్టిపడేలా చేస్తారు. 500 కిలోల దుంపల నుంచి 100 కిలోల సగ్గుబియ్యం గింజలు తయారవుతాయి.
ఆఫ్రికాలోని చాలా దేశాల్లోని ప్రజలకు కర్రపెండలం దుంపలే ప్రధాన ఆహారం. వీటిని అక్కడ కసావా అని పిలుస్తారు. ఈ దుంపలను నీటిలో ఉడకబెట్టి పొట్టు తీసి, మెత్తని జావలాగా చేసుకుని తింటారు. ఈ కర్రపెండలం ఎంతో మంది ఆఫ్రికన్ పేదల పొట్ట నింపుతుంది. ఇదే లేకపోతే అక్కడి ఎన్నో కుటుంబాలు ఆకలితో మాడాల్సి వచ్చేది.
మనదేశంలో...
తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ లలో సగ్గుబియ్యం తయారీకేంద్రాలు ఉన్నాయి. ముఖ్యంగా మనదేశంలో తయారయ్యే సగ్గుబియ్యంలో 70 శాతం తమిళనాడు నుంచే వస్తాయి. తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోటకు దగ్గర్లో చాలా సగ్గుబియ్యం తయారీకేంద్రాలు ఉన్నాయి.