Oral Health : ఈ సింపుల్ హోమ్ రెమిడీస్ మీ చిగుళ్ల సమస్యలను దూరం చేసేస్తాయి
Home Remedies For Gum Bleeding : చలికాలంలో బాధించే సమస్యల్లో చిగుళ్ల సమస్య ఒకటి. మీ చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సహాయం చేసే ఇంటి చిట్కాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Controlling tips for gum bleeding : పళ్లు తోముకుంటున్న సమయంలో పేస్ట్ ఉమ్మివేస్తున్నప్పుడు బ్లడ్ కనిపిస్తుందా? లేదంటే ఏదైనా తింటున్నప్పుడు చిగుళ్లలో నొప్పిగా ఉంటుందా? అయితే మీకు చిగుళ్ల సమస్య ఉన్నట్టే. చిగుళ్లు వ్యాధి చలికాలంలో బాధించే ఓ సమస్యగా చెప్పవచ్చు. చిగుళ్లలో ఇబ్బందులు ఏర్పడి.. పళ్లకి డ్యామేజ్ పెరుగుతుంది. అపరిశుభ్రంగా నోటిని ఉంచుకోవడం, వివిధ బ్యాక్టీరియాలకు నిలయంగా దానిని మార్చడం వల్ల చిగుళ్లలో రక్తస్రావం ఏర్పడవచ్చు. ఆ సమయంలో మీ చిగుళ్లపై పాచి ఏర్పడి చిగురువాపునకు దారితీస్తుంది. దీనివల్ల చిగుళ్లలో మంట, రక్తస్రావం కలుగుతుంది. శరీరంలో విటమిన్ సి, విటిమిన్ కె లోపాలు వల్ల ఈ సమస్య సంభవిస్తుంది. గర్భధారణ సమయంలో హార్మోన్లలో మార్పుల వల్ల, పొగాకును అతిగా వినియోగించడం వల్ల కూడా ఏర్పడుతుంది. అందుకే చిగుళ్లను జాగ్రత్తగా చూసుకోవాలి. వాటిని ఆరోగ్యంగా కాపాడుకునేందుకు కొన్ని ఇంటి చిట్కాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆయిల్ పుల్లింగ్
ఇది నోటి సంరక్షణలో పురాతనకాలం నుంచి వస్తున్న ఓ అద్భుతమైన టెక్నిక్. ఆయిల్ పుల్లింగ్తో మీ చిగుళ్లలో రక్తస్రావం కలిగించే ఇన్ఫెక్షన్లతో పోరాడేందుకు మీ నోటిలో కొంత నూనెను తీసుకోవాలి. దానితో మీ నీటిని పొక్కిలిస్తూ ఉండాలి. ఈ ప్రక్రియ కోసం మీరు కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె ఉపయోగించవచ్చు. ఈ ప్రక్రియ వల్ల మీ చిగుళ్ల సమస్య తీరడమే కాదు.. దంతాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.
పసుపు
పసుపులోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఎన్నో అంటువ్యాధులను నయం చేయడంలో సహాయం చేస్తాయి. కాబట్టి దీనిని చిగుళ్ల సమస్యను తగ్గించుకోవడంలో కూడా ఉపయోగించుకోవచ్చు. దీనిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు చిగుళ్ల సమస్యను తగ్గిస్తాయి. దీనికోసం మీరు పసుపు, ఆవాల నూనెను కలిపి మీ చిగుళ్లపై సున్నితంగా మసాజ్ చేయండి. తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి. దీనివల్ల సమస్య త్వరగా తగ్గుతుంది.
ఉప్పునీటితో..
మీ చిగుళ్లలో సమస్యలుంటే.. మీరు ఉప్పునీటితో దానిని తగ్గించుకోవచ్చు. ఉప్పులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, క్రిమినాశక గుణాలు ఉంటాయి. ఇవి వాపును తగ్గించడంలో సహాయం చేస్తాయి. చిగుళ్లలో రక్తస్రావం కలిగించే ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవడానికి హెల్ప్ చేస్తాయి. కాబట్టి గోరువెచ్చని నీటిని తీసుకుని దానిలో కొంచెం ఉప్పు వేసి రెండింటిని బాగా కలపండి. దానితో మీ నోటిని పూర్తిగా శుభ్రం చేసుకోండి. రోజుకు రెండు మూడు సార్లు ఈ సాల్ట్ వాటర్‌తో నోటిని పుక్కిలించండి. దీనివల్ల సమస్య నుంచి ఉపశమనం దొరుకుతుంది.
తేనెతో..
మీకు చిగుళ్ల సమస్య ఉన్నప్పుడు మీరు కాస్త తేనెను తీసుకుని మీ చిగుళ్లపై సున్నితంగా మసాజ్చేయండి. అంతేకదా అని గట్టిగా రుద్దితే సమస్య ఎక్కువయ్యే ప్రమాదముంది. తేనెలోని యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమస్యను తగ్గిస్తాయి. ఇవి చిగుళ్లలోని రక్తస్రావం కలిగించే బ్యాక్టీరియాను చంపడంలో సహాయం చేస్తాయి. దీని నివారణ కోసం మీరు రెగ్యూలర్‌గా చిగుళ్లపై తేనెను అప్లై చేస్తూ ఉండాలి.
ఈ ఇంటి నివారణలే కాకుండా.. మీరు రోజూ క్రమం తప్పకుండా ఉదయం, రాత్రి పళ్లు తోముకోవాలి. ముఖ్యంగా చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారాలు తినకపోవడమే మంచిది. ఒకవేళ తింటే మాత్రం వెంటనే నోటిని శుభ్రం చేసుకోవాలి. బ్రష్ చేసేప్పుడు రుద్దేయకుండా సున్నితంగా వాటిని క్లీన్ చేయాలి. లేదంటే చిగుళ్లపై ఉండే మృదు కణజాలాలు డ్యామేజ్ అవుతాయి. పెరుగు, గ్రీన్ టీ, సోయా, వెల్లుల్లి వంటి మొదలైన ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
Also Read : చలికాలంలో సన్‌షైన్ విటమిన్ చాలా అవసరమట.. ఎందుకంటే..
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.