HIV symptoms: వామ్మో.. ఆ రాష్ట్రంలో లెక్కలేనన్ని ఎయిడ్స్ కేసులు, 48 మంది విద్యార్థులు మృతి - ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!
ఆ రాష్ట్రంలో ఏకంగా 48 మంది విద్యార్థులు ఎయిడ్స్‌తో చనిపోయారు. మరో 800 పైగా స్టూడెంట్స్ ఈ వ్యాధితో చికిత్స పొందుతున్నారు. ఇంతకీ విద్యార్థులకు ఎయిడ్స్ ఎలా వచ్చింది?
HIV ఎయిడ్స్ ఎంత ప్రమాదకర అంటువ్యాధో తెలిసిందే. ఒకప్పుడు కరోనా తరహాలో యావత్ ప్రపంచాన్ని కలవరపెట్టిన ఈ వ్యాధికి ఇప్పటికీ మందులేదంటే ఆశ్చర్యపోవక్కర్లేదు. ఈ వ్యాధికి ప్రస్తుతం యాంటీ రిట్రోవైరల్ థెరపీ మాత్రమే అందుబాటులో ఉంది. అయితే, ఇప్పటికే పలు పరిశోధనల్లో ఎయిడ్స్‌ను అరికట్టేందుకు కొన్ని ఔషదాలను కనుగొన్నారు. వాటిలో కొన్ని క్లినికల్ ట్రైల్స్‌లోనే ఉన్నాయి. అవి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే.. ఈ మహమ్మారిని తరిమి కొట్టవచ్చు. అయితే, ప్రతి ఒక్కరూ తెలుసుకోవల్సిన విషయం ఏమిటంటే.. దానికి మందులు ఉన్నా లేకపోయినా, ఆ వ్యాధి సోకకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం. ఎయిడ్స్‌కు నివారణకు మించిన మందు మరొకటి లేదు.
ఆ రాష్ట్రంలో 48 మరణాలు
ఈశాన్య రాష్ట్రమైన త్రిపురాను ఎయిడ్స్ కేసులు కలవరపరుస్తున్నాయి. ఇప్పటికే ఎయిడ్స్ సోకి 48 మంది విద్యార్థులు మరణించారు. మరో 828 మంది విద్యార్థులు సైతం హెచ్ఐవీ పాజిటివ్‌తో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలుపుతున్నారు. ఇది కేవలం విద్యార్థుల లెక్క. వీరు కాకుండా ఆ రాష్ట్రంలో ఇంకా చాలా కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. త్రిపురాలో ఉన్న 220 స్కూళ్లు, 24 కాలేజీలు, యూనివర్శిటీలకు చెందిన విద్యార్థులు ఎయిడ్స్‌కు గురైనట్లు అధికారులు వెల్లడించారు.
విద్యార్థులకే ఎందుకు?
ఎయిడ్స్ వచ్చేందుకు అసురక్షిత కలయిక ఒక్కటే కారణం కాదు. ఇంజెక్షన్లు కూడా కారణమవుతాయి. అయితే, డ్రగ్స్‌కు అలవాటుపడిన కొంతమంది విద్యార్థుల వల్ల ఈ వ్యాధి వేగంగా ఒకరి నుంచి మరొకరికి సోకి ఉండవచ్చని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అంతమంది విద్యార్థులు ఒకేసారి ఎయిడ్స్‌కు గురవ్వడానికి అదే కారణం కావచ్చని త్రిపురా స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (TSACS) తెలిపింది. ఒకే సిరంజితో డ్రగ్స్‌ను ఇంజెక్ట్ చేసుకోవడం వల్ల ఎయిడ్స్ వేగంగా వ్యాప్తి చెందినట్లు భావిస్తున్నారు. ఇక్కడి ఇనిస్టిట్యూట్స్‌లో చదువుతున్న విద్యార్థుల్లో చాలామంది ఉన్నత చదువుల కోసం త్రిపురాకు వలస వచ్చినవారేనని అధికారులు చెబుతున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త
హెచ్ఐవీ ఎయిడ్స్‌ను ఎంత వేగంగా గుర్తిస్తే అంత మంచిది. అయితే, ఎయిడ్స్ సోకిన వెంటనే గుర్తించడం కష్టం. కొద్ది రోజుల తర్వాత నెమ్మది నెమ్మదిగా శరీరంపై ప్రభావం చూపడం మొదలుపెడుతుంది. ఒక్కో స్టేజ్‌లో ఒక్కో లక్షణం బయటపడుతుంది. కాబట్టి, ఈ కింది లక్షణాల్లో ఏ ఒక్కటి ఉన్నా నిర్లక్ష్యం చేయొద్దు. డాక్టర్‌ను సంప్రదించి, వెంటనే టెస్టులు చేయించుకోండి.
లక్షణాలు: తలనొప్పి, తీవ్రమైన జ్వరం, బరువు తగ్గిపోవడం, డయారియా, దగ్గు, రాత్రివేళల్లో చెమట, మెడ దగ్గర ఉండే శోషరస గ్రంధుల వాపు, కండరాల నొప్పులు, నోటిలో పుండ్లు, గొంతు నొప్పి ఉన్నట్లయితే డాక్టర్‌ను సంప్రదించడం ఉత్తమం. ఎందుకంటే.. ఇవి మొదటి స్టేజ్‌లో కనిపించే లక్షణాలు. అయితే, కొందరిలో ఈ లక్షణాలు కూడా కనిపించవు. కొందరికి రోగనిరోధక శక్తి కణాల్లోనే హెచ్ఐవీ తిష్ట వేస్తుంది. కొన్ని నెలలు, ఏళ్ల వరకు లక్షణాలను చూపించదు. అయితే, మూడో స్టేజ్‌లోకి వచ్చిన తర్వాత రోగ నిరోధకశక్తి పూర్తిగా నశించి పోతుంది. బాధితులు తరచుగా రోగాలకు గురవ్వుతారు. శరీరం వణికిపోతుంది. చెమటలు పట్టేస్తుంటాయి. అతిసారం (diarrhea) వల్ల నీళ్ల విరోచనలు అవుతాయి. నోరు లేదా నాలుకపై తెల్ల మచ్చలు ఏర్పడతాయి. బలహీనంగా మారిపోతారు. మూర్ఛపోతారు. ఇంకా ఇలాంటి భయానక లక్షణాలు ఎన్నో బయటపడతాయి. కాబట్టి.. ఎయిడ్స్ మీ వరకు చేరకుండా జాగ్రత్తపడాలి.
ఈ జాగ్రత్తలు పాటిస్తేనే సేఫ్
ఎయిడ్స్ ఎప్పుడు ఏ రూపంలో ఎలా సంక్రమిస్తుందనేది చెప్పలేం. కాబట్టి.. విచ్చలవిడి లైంగిక సంబంధాలు వద్దు. కండోమ్ తప్పకుండా ఉపయోగించండి. తరచుగా హెచ్ఐవీ పరీక్షలు చేయించుకోవాలి. అలాగే డ్రగ్స్ అలవాటు అస్సలు మంచిది కాదు. ముఖ్యంగా సిరంజీలు ద్వారా ఇంజెక్ట్ చేసుకొనే డ్రాగ్స్ జోలికి వెళ్లొద్దు. అది చట్టరీత్యా నేరం కూడా. ప్రస్తుతం ఈ వ్యాధిని ఎదుర్కోడానికి మందులు ఉన్నాయి. కానీ, అవి పూర్తిగా హెచ్ఐవీని తొలగించలేవు. మరికొన్నాళ్లు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచి, మరణం నుంచి కాపాడుతాయి అంతే. మీరు సురక్షితంగా ఉంటేనే.. మీ కుటుంబం కూడా సేఫ్‌గా ఉంటుంది. కాబట్టి, జాగ్రత్త.
Also Read: పెట్రోల్‌ను కూల్‌డ్రింక్‌లా తాగేస్తున్న యువతి - దాని టేస్ట్ అలా ఉంటుందట!