రసాయన సబ్బులు వాడకుండా ఇంట్లో గిన్నెలను శుభ్రం చేసే చిట్కాలు ఇవిగో
గిన్నెలు తోమడానికి రసాయనాలు వేసే సబ్బులు వాడడం మీకు ఇష్టం లేదా? అయితే ఈ చిట్కాలు మీకోసమే
గిన్నెలు శుభ్రపరిచేందుకు మార్కెట్లో డిష్ వాషింగ్ సబ్బులు, లిక్విడ్లు అందుబాటులో ఉన్నాయి. కాకపోతే వాటిలో హానికరమైన రసాయనాలు ఉంటాయని చాలా మంది భయం. అందుకే వాటిని వాడేందుకు భయపడతారు. రసాయనాలు వేసిన సబ్బులు వాడడం ఇష్టం లేని వారి కోసం ఇంట్లోనే సులభమైన పద్ధతిలో గిన్నెలు శుభ్రం చేసుకునే చిట్కాలు కొన్ని ఉన్నాయి. ఈ చిట్కాలలో వాడే పదార్థాలన్నీ ఇంట్లో సులభంగా అందుబాటులో ఉండేవే. ఇది గిన్నెలకు అంటుకున్న జిడ్డును, వాసనను కూడా సమర్థంగా పోగొడతాయి.
బేకింగ్ సోడా
బేకింగ్ సోడా ప్రతి ఇంట్లో ఉంటుంది. బేకింగ్ సోడా కలిపిన గోరువెచ్చని నీళ్లను గిన్నెలపై చల్లి ఒక ఐదారు నిమిషాలు వదిలేయాలి. ఆ తర్వాత తోమితే గిన్నెలు శుభ్రపడతాయి. చెడు వాసన కూడా పోతుంది.
బూడిద
బూడిదతో గిన్నెలు తోమడం అనేది పాతకాలపు పద్ధతి. గ్రామాల్లో చాలామంది ఇప్పటికీ గిన్నెలను బూడిదతోనే తోముతున్నారు. డిష్ వాషింగ్ సోపులు కనిపెట్టకముందు ఈ బూడిదే అందుబాటులో ఉండేది. ఇది పాత్రలను చాలా సులభంగా శుభ్రపరుస్తుంది, వాసనను కూడా తొలగిస్తుంది. క్రిమిసంహారకంగా కూడా పనిచేస్తుంది. గిన్నెలను గోరువెచ్చని నీళ్లలో తడిపి బూడిదతో తోమితే ఎంతటి మురికి అయినా పోతుంది. చెక్కని కాల్చడం ద్వారా వచ్చి బూడిదను వాడడం మంచిదే.
బియ్యం నీరు
బియ్యం కడిగిన నీళ్లను సహజ క్లీనర్‌గా ఉపయోగించవచ్చు. బియ్యం నీటిలో స్టార్చ్, సిట్రిక్ యాసిడ్ ఉంటాయి. ఇవి జిడ్డును సులభంగా పొగొడతాయి. మీరు చేయాల్సిందల్లా జిడ్డు పట్టిన గిన్నెలో బియ్యం నీళ్లు వేసి అరగంట వదిలేయాలి. స్క్రబ్ తో తోమితే గిన్నెలు తళతళ మెరుస్తాయి. వేడి నీటిలో ఈ గిన్నెలు కడుక్కోవడం వల్ల మరింత మెరుపు వస్తుంది.
వెనిగర్
అయిదు టేబుల్ స్పూన్ల వెనిగర్‌కు, ఒక కప్పు నీరు కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఒక స్ప్రే బాటిల్‌లో వేసుకోవాలి. బాటిల్‌ను బాగా షేక్ చేసి, గిన్నెలపై ఆ వెనిగర్‌ను స్ప్రే చేయాలి. కొన్ని నిమిషాల పాటు ఆ గిన్నెలను అలా వదిలేసి, ఆ తర్వాత స్క్రబ్‌తో బాగా తోమాలి. గిన్నెలకున్న జిడ్డు, వాసన పోతాయి.
ఇలా తయారు చేసుకోండి
ఇంట్లో దొరికే పదార్థాలతో మీరే గిన్నెలు తోమే లిక్విడ్‌ను తయారు చేసుకోవచ్చు. దీనికోసం ఒక కప్పు వేడి నీటిని తీసుకోండి. అందులో నిమ్మకాయ రసం, రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు వేసి కలపాలి. ఈ మిశ్రమంలోస్క్రబ్ ముంచి గిన్నెలు తోమాలి. దీనివల్ల ఎంతటి జిడ్డు మరకలు అయినా పోతాయి. నిమ్మకాయ రసం కలిపాము కాబట్టి చెడు వాసన కూడా ఉండదు.
Also read: వందేళ్లు ఆరోగ్యంగా జీవించాలనుకుంటున్నారా? అయితే మీరు రోజూ చేయాల్సిన ముఖ్యమైన పని ఇదే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.