khasi Tribe: ఆ తెగలో పుట్టిన ఆడపిల్లలు అదృష్టవంతులు... పెళ్లయ్యాక కూడా పుట్టిల్లే, అల్లుడే ఇల్లరికం వస్తాడు
పెళ్లయ్యాక అమ్మాయి ఇంటి పేరు మారదు, ఇల్లూ మారదు, వరుడే ఇల్లరికం వస్తాడు.
ఒకప్పుడు మాతృస్వామ్య వ్యవస్థలు ఉండేవని చెబుతారు. ఇప్పుడు ఎక్కడ చూసినా మగవారి ఆధిపత్యమే కనిపిస్తోంది. కానీ ఒక్క ఖాసీ తెగలో మాత్రం ఇప్పటికీ మాతృస్వామ్య వ్యవస్థే అమలులో ఉంది. అలాగని తండ్రి మాటకు విలువుండదు అనుకోవద్దు. ప్రపంచంలో ఇంకా మాతృస్వామ్య వ్యవస్థ నడిపిస్తున్న ఏకైక తెగ వీరిదే అని చెబుతారు. ఒకప్పుడు అసోం రాష్ట్రంలో వీరు నివసించేవారు. 1972లో వీరు నివసిస్తున్న ఖాసీ, జైంతియా జిల్లాలను మేఘాలయలో కలిపేశారు. ‘ఖాసీ’ అన్న పదమే వారిది స్త్రీ ఆధిపత్య తెగ అని చెప్పకనే చెబుతోంది. ఖా అంటే వారి భాషలో పుట్టుక అని, సీ అంటే పెద్ద తల్లి అని అర్థం. వీరికి ఏ మతం లేదు. అందుకే ఆధునిక కాలంలో కొంతమంది క్రైస్తవాన్ని, కొందరు ఇస్లాంను, మరికొందరు హిందూ మతాలను స్వీకరించారు. ఏ మతం స్వీకరించని వారు తమ ఆచారాలను పాటిస్తున్నారు.
అమ్మాయిగా పుట్టాల్సిందే...
ఖాషీ తెగలో అమ్మాయిగా పుడితే ఎంతో అదృష్టమో. ఎందుకంటే అక్కడ మాతృస్వామ్య వ్యవస్థ ఉండడం వల్ల ఆడపిల్లలు పెళ్లి చేసుకున్నాక అత్తారింటికి వెళ్లాల్సిన అవసరం లేదు. అబ్బాయే వచ్చి అమ్మాయి వాళ్లింట్లో నివసించాల్సి ఉంటుంది. అలాగే ఇంట్లోని కొడుకులు పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లిపోతారు. కుటుంబంలో అమ్మమ్మే కుటుంబ పెద్దగా వ్యవహరిస్తుంది. అమ్మమ్మతో పాటూ కూతుళ్లు, వారి భర్తలు పిల్లలు అందరూ ఒక కుటుంబంగా జీవిస్తారు. వీరే ఇంట్లో శాశ్వతంగా ఉండేది. ఇక ఇంట్లో పుట్టిన చిన్నకూతురుకు అమ్మమ్మ ఇంటిపై హక్కుల లభిస్తాయి. ఆ ఇల్లు ఆమెకే చెందుతుంది. తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఆమెదే. మిగతా కూతుళ్లు ఇరుగుపొరుగున ఇల్లు కట్టుకుంటారు. అంతేకాదు కూతుళ్లు సంపాదించి తల్లిదండ్రులకు డబ్బులు కూడా ఇస్తారు. ఖాసీ తెగలో అమ్మాయిలకు స్వేచ్ఛ కూడా ఎక్కువ. వారు తమకు నచ్చిన రంగాన్ని ఎంచుకోవచ్చు. నచ్చిన పని చేసుకోవచ్చు. వారిపై ఆంక్షలు ఉండవు. ఇక్కడ ఎవరికైనా ఆడపిల్లలు పుట్టకపోతే ఓ ఆడపిల్లను దత్తత తీసుకుని మరీ పెంచుకుంటారు. ఇక్కడి పిల్లలకు తల్లి ఇంటిపేరే వస్తుంది. పెళ్లయ్యాక భర్త ఇంటి పేరు రాదు.
అక్కడ అన్నీ ప్రేమ వివాహాలే...
పెద్దలు కుదిర్చిన వివాహాలు ఖాసీలలో జరుగవు. యువకుడు తనకు నచ్చిన అమ్మాయిని వెతికి ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి కూడా ఇష్టపడితే పెద్దలకు చెబుతారు. పెళ్లి పెద్దలు చేస్తారు. ఖాసీల్లోని మగవారు రాముడిలా ఏకపత్నీవ్రతులు.
Also read: మీ ఇంటి ఆడపిల్ల ఏదైనా సాధించగలదు... అవకాశం ఇచ్చి చూడండి, పెళ్లి చేసి పంపేయకండి
Also read: గుండె సమస్యలు రాకుండా ఉండాలంటే... ఈ చిట్కాలు పాటించాల్సిందే