Health Tips for Children : పిల్లల హెల్త్‌ను చలికాలంలో ఇలా కాపాడుకోండి.. నిపుణుల సలహాలు ఇవే
Kids Health in Winter : చలి రోజు రోజుకు పెరిగిపోతుంది. చల్లగాలుల వల్ల పెద్దలే కాదు.. పిల్లలు కూడా ఇబ్బందులు పడుతుంటారు. ఈ సమయంలో పిల్లల సంరక్షణలో పలు సూచనలు పాటించాలంటున్నారు నిపుణులు.
Winter Care for Kids : వింటర్ సంగతి ఏమో కానీ.. చలి మాత్రం రోజు రోజుకు విజృంభిస్తుంది. ఈ సమయంలో జలుబు, ఫ్లూ వంటి అనేక సమస్యలు దాడి చేస్తూ ఉంటాయి. వీటికి ముందుగా వృద్ధులు, పిల్లలు ఎఫెక్ట్ అవుతారు. పెద్దలు ఎలాగూ కేర్ తీసుకుంటారు కానీ పిల్లలను పెద్దలే జాగ్రత్తగా చూసుకోవాలి. వారిని చలిగాలుల బారిన పడకుండా.. ఆరోగ్య సమస్యలు రాకుండా కేర్ తీసుకోవాలి. అయితే కొన్ని వ్యూహాలతో పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచి.. ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు అంటున్నారు నిపుణులు. ఇంతకీ ఆ వ్యూహాలేంటి? పిల్లలపై అవి ఎలాంటి ప్రభావం చూపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
యాక్టివ్‌గా ఉంచండి..
చలికాలంలో పెద్దలతో పాటు పిల్లల కూడా బద్ధకంగా ఉంటారు. ఇలా ఉండడం వల్ల శారీరక శ్రమ తగ్గుతుంది. ఇది వారిలో ఇమ్యూనిటీ తగ్గేలా చేస్తుంది. పిల్లలు డల్‌గా ఉంటారు. సీజనల్ వ్యాధులు రావొచ్చు. కాబట్టి వారు చురుకుగా ఉండేలా మీరు ప్లాన్ చేయాలి. ఇండోర్ స్పోర్ట్స్, యోగా, డ్యాన్స్ వంటివి చేయించొచ్చు. ఇది వారు చురుకుగా ఉండేలా, శక్తివంతంగా ఉండేలా చేస్తాయి. శారీరక శ్రమతో పాటు.. తగినంత నిద్ర ఉండేలా చూసుకోవడం వారి ఆరోగ్యానికి చాలా మంచిది.
స్వెటర్స్ వేయండి..
చలిగాలుల నుంచి పిల్లలను రక్షించడం కోసం మీరు వారికి స్వెటర్స్ వేయాలి. తలకు క్యాప్, తలను పూర్తిగా కవర్ చేసే క్యాప్స్ లేదా హుడీలు వేయొచ్చు. ఇది పిల్లల శరీర ఉష్ణోగ్రతను కాపాడడంలో హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా చల్లగాలులు వారిని అంతగా ప్రభావితం చేయవు. బయటకు వెళ్లేప్పుడు హ్యాండ్ గ్లవ్‌లు, షూలు వేయొచ్చు. ఇవి చలితో పాటు సీజనల్ వ్యాధుల నుంచి వారిని రక్షిస్తాయి. చర్మ సంరక్షణకు మాయిశ్చరైజర్స్, లిప్ బామ్స్ అప్లై చేయాలి.
పరిశుభ్రంగా ఉండేలా చూసుకోండి..
అంటువ్యాధులు ప్రబలకుండా ఉండాలంటే పరిశుభ్రంగా ఉండడమే మొదటి మార్గం. కాబట్టి పిల్లలకు రెగ్యూలర్‌గా చేతులు కడుక్కోవడం నేర్పించండి. మురికిగా అనిపిస్తే వెంటనే వారి చేతులను కడుక్కునేలా వారిని ప్రేరేపించండి. ఇది వారు హెల్తీగా ఉండడంలో హెల్ప్ చేస్తుంది. ముఖ్యంగా భోజనానికి ముందు.. వాష్ రూమ్ వినియోగించిన తర్వాత.. బహిరంగ ప్రదేశాల్లో ఆడిన తర్వాత చేతులు వాష్ చేసుకునేలా చూడండి. మాసిన దుస్తులు విడిచేలా ప్రోత్సహించండి.
మంచి పోషకాహారం అందించండి..
పిల్లల్లో ఇమ్యూనిటీ పెరగడానికి సమతుల్యమైన ఆహారం అవరసం. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో పోషకాహారం కీలకపాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా పిల్లలు హైడ్రేటెడ్‌గా ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి. వారి ఆహారంలో నట్స్, బీన్స్ వంటివి ఉండేలా చూసుకోండి. జింక్‌తో పాటు విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు, కూరగాయాలు, తృణధాన్యాలు ఇవ్వండి. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు కూడా ఇవ్వడం వల్ల పిల్లల్లో రోగనిరోధకశక్తి మెరుగవుతుంది. అయితే పిల్లలకు మీరు ఇలాంటి ఫుడ్ ఇచ్చే ముందు కచ్చితంగా పోషకాహార నిపుణులను, శిశు వైద్యులను సంప్రదించండి.
అలెర్ట్‌గా ఉండండి..
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. కొన్నిసార్లు పిల్లలు జర్వం, దగ్గు వంటి సమస్యల బారిన పడుతూ ఉంటారు. అలాంటి సంకేతాలు మీరు గుర్తించినప్పుడు అప్రమత్తంగా ఉండండి. సమస్య గుర్తించిన వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. దీనివల్ల వారి ఆరోగ్యం మరింత క్షీణించకుండా ఉంటుంది. పిల్లలకు వేయించాల్సిన టీకాల గురించి అస్సలు అశ్రద్ధ వహించకండి. ఇవి అంటువ్యాధుల నుంచి పిల్లలకు రక్షణ అందిస్తాయి. లక్షణాలు, వ్యాధుల తీవ్రతను తగ్గిస్తాయి.
Also Read : వింటర్ స్పెషల్ చిలగడదుంపల సూప్.. బరువు తగ్గడంలో బెస్ట్ రెసిపీ