ఆత్రుత ఎక్కువ పడుతున్నారా? ఆరోగ్యం దెబ్బతినడం ఖాయం
ఆత్రుత పడడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు.
కొంతమందికి ఆత్రుత ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయాన్ని తెలుసుకోవాలనుకుంటారు. తెలుసుకున్న ఆ విషయం పై చర్చ పెడతారు. ఎవరైనా తమతో విభేదిస్తే గట్టిగా మాట్లాడతారు. త్వరగా చిరాకు పడతారు. అవసరానికి మించి ఆందోళన పడుతుంటారు. వీళ్ళకి ఆత్రుత ఎక్కువ అంటూ ఉంటారు. సాధారణ మనుషులతో పోలిస్తే వీరికి ఉత్సాహం, ఆత్రుత, ఒత్తిడి కూడా ఎక్కువే. అయితే ఇలా ప్రతి విషయానికీ ఆత్రుత పడడం అనేది అంత ఆరోగ్యకరం కాదు అని చెబుతోంది ఒక అధ్యయనం. ఇలా ప్రతిదానికి ఆత్రుత పడే వారి కంటే నెమ్మదిగా పనులు చేసే వారే ఆరోగ్యంగా ఉంటారని వివరిస్తుంది ఈ అధ్యయనం. వన్ పోల్ అనే సంస్థ 2000 మందిపై ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. ఆత్రుత అధికంగా పడడం వల్ల వారిలో చిరాకు, కోపం వంటి భావోద్వేగాలు అధికంగా వస్తున్నాయని ఈ అధ్యయనం తేల్చింది.
ఇలా చిరాకు, కోపం తరచూ వస్తూ ఉంటే మానసిక ఆందోళన బారిన పడే అవకాశం పెరుగుతుంది. ఎప్పుడైతే మానసిక ఆందోళన మొదలవుతుందో ఆ పరిస్థితిని తట్టుకునేందుకు మెదడు అడ్రినలిన్, కార్టిసాల్ వంటి హార్మోన్లను ఉత్పత్తిని పెంచేస్తుంది. అలాగే హృదయ స్పందనను కూడా పెంచుతుంది. దీనివల్ల బీపీ ఎక్కువ అయిపోతుంది. శ్వాస కూడా అధికంగా తీసుకుంటారు. ఇలా తరుచూ జరిగితే ఇతర అనారోగ్యాలు వచ్చే అవకాశం పెరిగిపోతుంది.
కాబట్టి ఆత్రుత పడడం అనేది సాధారణ లక్షణంగా భావించవద్దు. మీకు మీలో ఆత్రుత లక్షణాలు కనిపిస్తే మానసిక వైద్యులను కలవడానికి ప్రయత్నించండి. ఈ ఆత్రుత... మానసిక రోగాలకు కారణం అవుతుంది. అధ్యయనంలో భాగంగా 2000 మందిని రెండు భాగాలుగా విభజించారు పరిశోధనకర్తలు. వీరిలో ఆత్రుత, ఆందోళన, కోపం, చిరాకు వంటి వాటిని అధికంగా పడే వారిని ఒక గ్రూపులో ఉంచారు. పెద్దగా మాట్లాడని వారు, నెమ్మదిగా ఉండేవారు, ఎక్కువగా వినడానికి ఇష్టపడేవారిని మరొక గ్రూపులో ఉంచారు. ఈ రెండు గ్రూపుల వారిని పరిశోధించగా ఎక్కువగా ఆత్రుత పడే వారితో పోలిస్తే, తక్కువగా మాట్లాడే వారిలో 32 శాతం తీవ్రమైన మానసిక ఒత్తిడి వచ్చే అవకాశం తక్కువగా ఉన్నట్టు తేలింది.
తరచూ మానసిక ఆందోళన బారిన పడేవారు, డిప్రెషన్ బారిన కూడా త్వరగా పడే అవకాశం ఉంటుంది. మన దేశంలో 14% మంది ప్రజలు డిప్రెషన్ వంటి మానసిక రోగాలతో సతమతం అవుతున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. వీరిలో పది శాతం మందికి అత్యవసర వైద్య సహాయం అవసరం. కానీ మానసిక సమస్యలకు చికిత్స పొందుతున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. ప్రతి 10 మందిలో ఒక్కరు మాత్రమే వైద్య సేవలు తీసుకుంటున్నారు. ఇలా అయితే పదేళ్లలో మానసిక సమస్యల బారిన పడే వారి సంఖ్య అత్యధికంగా పెరిగే అవకాశం ఉంది.
Also read: పిల్లలకు చదివింది గుర్తుండాలంటే వారి జ్ఞాపకశక్తిని పెంచే ఈ ఆహారాలు ఇవ్వండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.