Belly Fat: బెల్లీ ఫ్యాట్ కరిగిపోవాలా? ఈ ఆహారపు అలవాట్లతో అది చాలా సింపుల్
బరువు తగ్గడానికి ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంటే సులభం అవుతుందని కొత్త అధ్యయనం వెల్లడించింది.
ప్రపంచంలో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్య అధిక బరువు. మనం తినే ఆహారం వల్ల కొవ్వు పేరుకుపోయి శరీరంలో అనేక మార్పులు వస్తాయి. కొవ్వు ఎక్కువ అయ్యిందని తొలుత కనిపించేది పొట్ట దగ్గరే. అందుకే దాన్ని తగ్గించుకోవడానికి అందరూ నానాతిప్పలు పడిపోతుంటారు. గంటల తరబడి జిమ్ లో చెమటోడ్చి కష్టపడుతూ నోటికి తాళం వేసుకుంటూ ఉంటారు. నడక, ఆహారంలో మార్పులు, కొన్ని ప్రత్యేకమైన వ్యాయామాలు చేయడం ద్వారా పొట్ట కొవ్వును కరిగించుకోవచ్చు. ఇవే కాదు ఆహారం తీసుకునే వేళలో కూడా మార్పులు చేసుకున్న పొట్ట కొవ్వు తగ్గిపోతుందని పరిశోధకులు వెల్లడించారు.
నిర్దిష్ట ఆహారపు అలవాట్లు బరువు తగ్గడంపై ప్రభావవంతంగా పని చేస్తాయని బెల్లీ ఫ్యాట్ ని కరిగిస్తాయని ఇటీవల ఓ అధ్యయనం వెల్లడించింది. కొవ్వు కరిగించుకోవాలని ప్రయత్నించే వాళ్ళు ఈ ఆహారపు అలవాట్లు ఫాలో అవడం వల్ల మెరుగైన ఫలితాలు పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ఏమిటి ఈ అధ్యయనం?
ఇందులో సుమారు 162 మంది పాల్గొన్నారు. మూడు నెలల పాటు నిర్ధిష్ట ఆహారపు అలవాట్లు వాళ్ళు అనుసరించారు. వాళ్ళని మూడు భాగాలుగా విభజించారు. వారిలో 44 మందికి సమయం ప్రకారం ఆహారం ఇచ్చారు. మరో 47 మందికి తక్కువ కార్బోహైడ్రేట్ ఆహారం ఇచ్చారు. మిగిలిన 44 మందికి రెండింటిని కలిపి ఇచ్చారు. ఇందులో పాల్గొన్న వాళ్ళని ఎనిమిది గంటల వ్యవధిని ఫాలో అవమని చెప్పారు. అంటే ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకి లేదా మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 8 గంటల వ్యవధి పాటించమని కోరారు.
ఫలితం ఏమని చెప్తుంది?
అధ్యయనంలో పాల్గొన్న వాళ్ళు మూడు నెలల పాటు ఇదే సమయం ప్రకారం ఆహారం తీసుకోవడం చేశారు. మూడు ఆహారపు అలవాట్లు బరువు తగ్గడానికి మద్దతు ఇచ్చాయని నిపుణులు గుర్తించారు. అయితే పొట్ట చుట్టూ కొవ్వు తగ్గేందుకు సమయం ప్రకారం ఆహారం తీసుకున్న వాళ్ళే ఎక్కువ ఫలితం పొందినట్టు తేలింది. మెటబాలిక్ సిండ్రోమ్ లేదా ఊబకాయంతో బాధపడుతున్న వ్యక్తులకి ఈ నియమావళిని నిపుణులు ప్రత్యేకంగా సిఫార్సు చేస్తున్నారు. బరువు తగ్గడానికి, మరీ ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవాలని అనుకునే వాళ్ళకి తక్కువ కార్బ్ ఆహారం తగినవిధంగా పని చేస్తుందని పరిశోధకులు గమనించారు.
బరువు తగ్గడానికి నిర్దిష్ట ఆహారపు సమయం ఎందుకు?
ఒక వ్యక్తి ఎంత ఆహారం తీసుకుంటున్నాడో నియంత్రించేందుకు ఈ సమయానుకూలం ప్రకారం ఆహారం తీసుకోవడం సహాయపడుతుందని పరిశోధకులు వెల్లడించారు. ఒక నిర్ధిష్ట సమయంలో తినడం వల్ల అతిగా తినే అవకాశం తక్కువగా ఉంటుంది. అప్పుడు బరువు పెరుగుతారు, కొవ్వు పేరుకుపోతుందనే భయం అవసరం లేదు. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతే అది గుండె, పేగులు, కాలేయం వంటి ఇతర అవయవాల చుట్టూ కూడా చేరుకోవడం జరుగుతుంది.
సమయ నియంత్రిత ఆహార విధానం, తక్కువ కార్బ్ ఆహారం తీసుకోవడం వల్ల మితంగా తినడం జరుగుతుంది. సమయం ప్రకారం ఆహారం తీసుకునే వాళ్ళు దీర్ఘకాలికంగా మంచి ఫలితాలు పొందగలుగుతారని నిపుణులు వెల్లడించారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: పసుపు తినడం వల్ల పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెరుగుతుందా?