Ethiopian Airlines: గాఢ నిద్రలో పైలట్లు, ల్యాండ్ కాకుండా గాల్లోనే చక్కర్లు కొట్టిన విమానం, చివరికి..
విమానం నడిపే పైలెట్లు నిత్యం అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి సమస్య ఎదురైనా ప్రయాణీకుల ప్రాణాలకు అపాయం కలగకుండా చూసుకోవాలి. కానీ.. ఇద్దరు పైలెట్లు చేసిన పని చూస్తే..

విమానంలోకి ఎక్కాలంటే డబ్బులు ఉండాలి.. సురక్షితంగా దిగాలంటే అదృష్టం ఉండాలని అంటారు పెద్దలు. చాలా సార్లు ఈ మాట వాస్తవం అని నిరూపించాయి. ఒకరకంగా చెప్పాలంటే విమాన ప్రయాణం కత్తిమీద సాములాంటిది. విమానం నడిపే పైలెట్లు సైతం ఎంతో అప్రమత్తంగా ఉండాలి. అయితే, ఇద్దరు పైలట్లు ఏం చేశారో తెలిస్తే తప్పకుండా మీ గుండె జారుతుంది. విమానం వేల అడుగుల ఎత్తులో వెళ్తుంటే ఒళ్లు దగ్గర పెట్టుకుని నడపాల్సింది పోయి.. గురక పెడుతూ నిద్రపోయారు. ఎయిర్ పోర్టు దాటి వెళ్లినా పట్టించుకోలేదు. చివరకు అలారం మోగడంతో వారికి మెలకువ వచ్చింది. ఆ తర్వాత ఏం చేశారో చూడండి.
ఆటో పైలెట్ మోడ్ ఆన్
ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 విమానం సూడాన్‌లోని ఖార్టూమ్ నుంచి ఇథియోపియా రాజధాని అడిస్ అబాబాకు బయల్దేరింది. విమానంలో పూర్తి స్థాయిలో ప్రయాణికులు ఉన్నారు. కొంత దూరం వెళ్లాక.. విమానం 37 వేల అడుగుల ఎత్తుకు చేరింది. అదే ఎత్తులో ప్రయాణం చేస్తుంది. కొంత సేపటి తర్వాత ఇద్దరు పైలట్లు ఆటో పైలట్ మోడ్ ఆన్ చేశారు. ఆ తర్వాత నెమ్మదిగా.. నిద్రలోకి జారుకున్నారు.
విమానం దానంతంట అదే అడిస్ అబాబాలోని ఎయిర్ పోర్టు సమీపంలోకి వచ్చింది. పైలట్లు పడుకోవడంతో విమానం ల్యాండ్ కాలేదు. వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) అప్రమత్తం అయ్యింది. పైలట్లకు సమాచారం అందించింది. నిద్ర మత్తులో ఉన్న పైలట్లు ఏటీసీ హెచ్చరికలను పట్టించుకోలేదు. ఎయిర్ పోర్టు దాటి విమానం ముందుకు వెళ్లింది. విమానంలోని ప్రయాణీకులకు ఏం జరుగుతుందో తెలియక ఆందోళన పడ్డారు. ఎయిర్ హోస్టెస్ కూడా అయోమయానికి గురైంది. పైలట్ల నుంచి ఏ సమాచారం రాకపోవడంతో ఉన్నారా, పోయారా అనే సందేహం కలిగింది. వారి కంగారు చూసి ప్రయాణికులు కూడా వణుకుతూ కూర్చున్నారు. అదే సమయంలో ఆటో పైలెట్ మోడ్ ఆఫ్ అయ్యింది. ఆ వెంటనే గట్టిగా అలారం మోగింది.
కళ్లు తెరిచి చూసి.. షాకైన పైలట్లు
అలారమ్ శబ్దానికి ఉలిక్కిపడి లేచారు పైలట్లు. నిద్రమత్తులో కాసేపు ఏమీ అర్థం కాలేదు. అసలు విషయం తెలియగానే దెబ్బకు మత్తు వదిలిపోయింది. విమానం అప్పటికే ఎయిర్ పోర్టు దాటి వెళ్లిపోయిందని గుర్తించారు. వెంటనే ఫ్లైట్ ను వెనక్కి మళ్లీంచి ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేశారు. సుమారు 25 నిమిషాలు ఆలస్యంగా విమానం ఎయిర్ పోర్టుకు చేరింది. ప్రయాణికులు బతుకు జీవుడా అంటూ బయటపడ్డారు.
అధికారులు ఆగ్రహం
ఈ ఘటనలో పైలట్ల తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఆకాశ మార్గాన వేల అడుగుల ఎత్తులో విమానం వెళ్తున్న సమయంలో పైలట్లు నిద్రపోవడాన్ని ఏవియేషన్ అధికారులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి విమానయాన నిపుణుడు అలెక్స్ మాచెరాస్ ఓ ట్వీట్ చేశారు. తాజా ఈ పరిణామం చాలా ఆందోళనకరంగా ఆయన అభివర్ణించారు. ఆఫ్రికాలోని అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737.. గమ్యానికి చేరుకొనే సరికి 37 వేల అడుగుల ఎత్తులో ఉంది. అయినా అది ఎయిర్ పోర్టులో దిగలేదు. ఎందుకంటే పైలట్లు నిద్రపోతున్నారంటూ వ్యాఖ్యానించారు. ఈ ఘటన విమానయాన రంగంలో అత్యంత ప్రమాదకర ఘటన అని ఆయన పేర్కొన్నారు. దీనిపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ఆ పైలట్లను విధుల నుంచి తొలగించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read: ఓ మై గాడ్, కోవిడ్ సోకినవారికి మూర్చల ముప్పు - మాస్క్ పెట్టుకోపోతే కష్టమే!
Also Read: టాయిలెట్‌లో టైంపాస్? గంటలు గంటలు దానిపై కూర్చుంటే చెప్పుకోలేని రోగం వస్తుందట!
Deeply concerning incident at Africa’s largest airline — Ethiopian Airlines Boeing 737 #ET343 was still at cruising altitude of 37,000ft by the time it reached destination Addis Ababa
— Alex Macheras (@AlexInAir) August 18, 2022
Why hadn’t it started to descend for landing? Both pilots were asleep. https://t.co/cPPMsVHIJD pic.twitter.com/RpnxsdtRBf
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

