తరచుగా వెన్ను నొప్పి వస్తోందా? కారణం ఇదే కావచ్చు
భావోద్వేగ ఒత్తిడి వల్ల రకరకాల అనారోగ్యాలు కలుగుతున్నాయని ఇప్పటికే రకరకాల ప్రయోగాలు చెబుతూనే ఉన్నాయి. మానసిక ఒత్తిడి, భావోద్వేగాలు ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో ఒకసారి తెలుసుకుందాం.
మనిషిలో కలిగే భావోద్వేగాలకు మూల స్థానం మాత్రం మనసె. మనసనే మాటకు ఒక రూపం లేదు. కానీ మానసిక ఒత్తిడి మాత్రం రకరకాల రూపాల్లో బయటపడుతుంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 100 మిలియన్లకు పైగా వ్యక్తులు తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారట. ఒత్తిడి వల్ల కోపం, ఒంటరితనం, ఆందోళన వంటి భావోద్వేగ సమస్యలు మాత్రమే కాదు రకరకాల శారీరక సమస్యలకు కూడా కారణం అవుతుంది. వాటిలో ఒళ్లు నొప్పులనేది ఒత్తిడి వల్ల సర్వ సాధారణం. కేవలం తలనొప్పి మాత్రమే అనుకుంటే పొరపడినట్టే. కాళ్లు, చేతులు, రకరకాల కండరాల నొప్పులకు కూడా మానసిక ఒత్తిడి కారణం అవుతుంది.
మానసిక ఒత్తిడి వల్ల వెన్నునొప్పి కూడా రావచ్చు. అలసట అధికంగా ఉండడం, కండరాల నొప్పులు, తలనొప్పి, కంటి సమస్యలతో కూడా బాధపడవచ్చు. అసలు ఇంత అలసటగా ఎందుకు ఉంటుందో, ఇలా నొప్పి ఎందుకు వస్తుందో కూడా అర్థం కాదు. ఒత్తిడి వల్ల వచ్చే తలనొప్పి కనుబొమ్మల మధ్య కనిపించవచ్చు. పనిభారం వల్ల తలనొప్పి మరింత పెరగవచ్చు కూడా. మంచి నిద్ర తర్వాత కూడా తాజాగా ఉన్న భావన కలుగదు. చిన్న విషయాలకు కూడా చాలా కోపం వస్తుంది. రోజూ వ్యాయమం చేస్తే ఈ సమస్య కొంత మేర పరిష్కారం కావచ్చు.
కొంత మందిలో మానసిక ఒత్తిడి వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా వస్తాయి. కడుపులో అసిడిటి పెరగడం, గ్యాస్ ఎక్కువగా చేరడం, జీర్ణ సంబంధ సమస్యలు రావడం వంటివి కూడా ఒత్తిడి వల్ల రావచ్చు. స్త్రీలలో నెలసరి సమయంలో వచ్చే కడుపునొప్పి కి కూడా పని ఒత్తిడి లేదా మానసిక ఒత్తిడి కారణం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. తరచుగా కడుపులో నొప్పి వస్తుంటే మాత్రం త్వరగా డాక్టర్ ను కలిసి ఎందుకు వస్తుందో నిర్ధారణ చేసుకోవడం అవసరం.
తరచుగా వెన్ను నొప్పి రావడానికి మానసిక ఒత్తిడికి సంబంధం ఉంటుందని నిపుణులు అంటున్నారు. వెన్నునొప్పికి ఒత్తిడికి ప్రత్యక్షసంబంధం ఉందని అధ్యయనాలు రుజువులు చూపుతున్నాయి. కొంత మందిలో చూపులోనూ వ్యత్యాసం వస్తుంది. కంటి వెనుక వైపు తలనొప్పి కూడా వస్తుంది. రంగులను గుర్తించడంలో ఇబ్బంది పడవచ్చు.
ఇలా మనసులోనే మర్మం చాలా వరకు ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వీలైనంత వరకు కూల్ గా ఉండడం వల్ల ఇలాంటి చిన్నచిన్న ఇబ్బందులు లేకుండా ఉండొచ్చని చెబుతున్నారు. దీర్ఘకాలం పాటు కొనసాగే ఒత్తిడి ప్రాణాల మీదకు కూడా తేవచ్చు. కనుక ఒత్తిడి తగ్గించుకునే మార్గాలు అన్వేషించాలి. యోగా, మెడిటేషన్ వంటివి సాధన చెయ్యడం, వాకింగ్, ఈత వంటి వర్కవుట్లు కూడా ఒత్తిడిని దూరం చేసే మార్గాలే. సరైన ప్లానింగ్ తో పనులు పూర్తి చేసుకోవడం అలవాటు చేసుకుంటే పని ఒత్తిడి పెద్దగా బాధించదు. పని చేసుకునే విధానాన్ని సరిగ్గా ప్లాన్ చేసుకోవడం, సమతుల ఆహారం తీసుకోవడం, తగినంత వ్యాయామం చెయ్యడం, సరిపడా నిద్ర పోవడం, లేదా విశ్రాంతి తీసుకోవడం వల్ల ఈ ఒత్తిడిని దూరం చేసుకోవడం సులభమే.