Periods Mood Swings : పీరియడ్స్ సమయంలో ఊరికే ఏడుపు వస్తుందా? దాని వెనుక కారణాలు ఇవేనట
Menstrual Cycle : పీరియడ్స్ సమయంలో కొందరికి ఎమోషన్స్ రోలర్ కోస్టర్లా ఆడుకుంటాయి. మరికొందరు ఊరికే ఎమోషనల్ అయిపోతుంటారు. దానివెనుకున్న రీజన్స్ ఏంటి? వాటిని ఎలా ఓవర్కామ్ చేయాలో చూసేద్దాం.
Emotional Changes During their Menstrual Cycle : పీరియడ్స్ సమయంలో మీ సిస్టర్, గర్ల్‌ఫ్రెండ్, ఫ్రెండ్, వైఫ్ ఇలా మీ లైఫ్‌లో ఉన్న మహిళలు ఎక్కువగా ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారా? ఎంత ట్రై చేసినా మీ తప్పేమిటో మీకు తెలియట్లేదా? అయితే అది మీ తప్పుకాదు. ఆ సమయంలో వారు ఎందుకు బాధపడుతున్నారో.. ఎందుకు సంతోషంగా ఉన్నారో.. ఎందుకు కోపం చూపిస్తున్నారో.. ఆఖరికి ఎందుకు ఏడుస్తున్నారో కూడా అర్థం కాకపోవచ్చు. అందుకే ఇది మామూలు విషయం అందరూ తెలుసుకోవాల్సిన అతి పెద్ద సెన్సిటివ్ మ్యాటర్.
విషయమేమిటంటే..
పీరియడ్స్ అనేవి అమ్మాయిలకు అతిపెద్ద శత్రువులని చెప్పొచ్చు. అప్పుడు కలిగే నొప్పి, అలసట, మూడ్ స్వింగ్స్ వారిని ఎమోషనల్‌గా వీక్ చేస్తాయి. కాబట్టి వారి ప్రమేయం లేకుండానే చిన్న చిన్న విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ.. ఎక్కువుగా ఫీల్ అయిపోతూ ఏడుస్తూ ఉంటారు. ఆ సమయంలో ఇతరులు వారిని అర్థం చేసుకోవడం కూడా కష్టమే. వేరేవాళ్ల సంగతి అటుంచితే.. ఎందుకు ఏడుస్తున్నారో.. ఏ విషయానికి ట్రిగర్ అవుతున్నారో వారికి కూడా తెలీదు. ఇలా జరగడానికి శరీరంలో ఓ మినీ యుద్ధమే జరుగుతుందట. ఇదంతా హార్మోన్లు ఆడించే జగన్నాటకం.
హార్మోనల్ మార్పులు
పీరియడ్స్ సమయంలో శరీరంలో ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్లో మార్పులు ఉంటాయి. శరీరంలో వీటి ప్రభావం తగ్గి మానసికంగా ఇబ్బంది పడతారు. ఆందోళన, భావోద్వేగం ఇలా అన్ని కలిసి సెన్సిటివ్‌గా మార్చేస్తాయి. ఈస్ట్రోజెన్ సెరోటోనిన్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. దీనివల్ల మానసికంగా కంట్రోల్డ్‌గా ఉండలేరు. ఈస్ట్రోజెన్ స్థాయిలు పడిపోయినప్పుడు సెరోటోనిన్ కూడా తగ్గి.. బాధ, విచారాన్ని పెంచుతుంది. అందుకే ఆ సమయంలో దేనికి ఫీల్ అవుతారో.. ఎందుకు ఫీల్ అవుతారో తెలియదు.
శారీరక మార్పులు
పీరియడ్ క్రాంప్స్, నడుము నొప్పి, కాళ్లు లాగడం, బ్రెస్ట్ సున్నితంగా మారడం వంటి శారీరక లక్షణాలు చిరాకు తెప్పిస్తాయి. వారిని మానసిక వేదనకు గురిచేస్తాయి. వీటివల్ల నిద్ర డిస్టర్బ్ అవుతుంది. అలసటగా ఉంటారు. దీనివల్ల వీరు మరింత ఎమోషనల్‌గా లో అయిపోతారు. పీరియడ్స్ సమయంలో ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉంటుంది. రక్తస్రావం అధికంగా ఉండడం, నొప్పి ఎక్కువగా ఉండేవారిలో ఇవి కాస్త ఎక్కువగానే ఉంటాయి.
ఇలా కంట్రోల్ చేయవచ్చు..
యోగా, మెడిటేషన్, బుక్ రీడింగ్ వంటి వాటివల్ల కాస్త రిలాక్స్ అవ్వొచ్చు. లేదంటే మీకు కంఫర్ట్‌బుల్‌గా, విశ్రాంతినిచ్చే పని చేయవచ్చు. ఎమోషనల్ సపోర్ట్ కోసం ఫ్రెండ్స్ లేదా కుటుంబ సభ్యులతో మాట్లాడవచ్చు. మీ పీరియడ్ సైకిల్ని ట్రాక్ చేయండి. దీనివల్ల మీరు పీరియడ్ వచ్చే సమయానికి మీరు ఎమోషనల్‌గా ఇబ్బంది పడకుండా జాగ్రత్త పడొచ్చు. సమస్య ఎక్కువగా ఉంటే.. థెరపిస్ట్‌ని కలిసి సపోర్ట్ తీసుకోవచ్చు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.