ప్రతిరోజూ ఈ ఆహారాలు తింటే హైబీపీని అదుపులో ఉంచుకోవచ్చు
రక్తపోటుతో ఇబ్బంది పడే వారికి కొన్ని రకాల ఆహారాలు అద్భుతంగా పనిచేస్తాయి.
హైబీపీని తక్కువ అంచనా వేయకూడదు. ఇది గుండెపోటుకు కారణం అయ్యే అవకాశం ఉంది. అధిక రక్తపోటును అదుపులో ఉంచుకుంటేనే ఆరోగ్యకరంగా జీవించగలరు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందికి పైగా ప్రజలు హైబీపీతో బాధపడుతున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. ఆధునిక కాలంలో హై బీపీ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. అది కూడా చిన్న వయసులోనే ఈ వ్యాధి బారిన ఎక్కువమంది పడుతున్నారు. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లే రక్తపోటు స్థాయిలలో మార్పులకు కారణమవుతున్నాయి. రక్తపోటు స్థిరంగా లేకపోయినా, పెరిగిపోతున్నా అవి గుండె జబ్బులకు కారణం అవుతుంది. కాబట్టి రక్తపోటును అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది.
అధిక రక్తపోటును అదుపులో ఉంచాలంటే పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. ఈ రెండింటితో పాటు ఇతర పోషకాలు కూడా అవసరమే. పుల్లని పండ్లను ప్రతిరోజు తినేందుకు ప్రయత్నించండి. ద్రాక్ష, నారింజ, నిమ్మ, బత్తాయి వంటివి సిట్రస్ పండ్ల జాతికి చెందినవి. వీటిని ప్రతి రోజు తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.
చికెన్, మటన్‌తో పోలిస్తే చేపలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీనిలో మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది. చేపలు ఎంత తిన్నా కూడా బరువు పెరగరు. చేపలలో ఒమేగా 3 కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల గుండెకు ఆరోగ్యం అందుతుంది. శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించే శక్తి ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలకు ఉంది. అలాగే రక్తపోటు స్థాయిలను కూడా అదుపులో ఉంచుతుంది. ఆహార రూపంలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు చేరేలా చూసుకోవాలి. దీనికి కొవ్వు పట్టిన చేపలను ఎంచుకుని తినడం చాలా అవసరం. ఇలా చేస్తే అధిక రక్తపోటుతో పాటు మధుమేహం, గుండె జబ్బులు కూడా రాకుండా ఉంటాయి.
ఆకుకూరలు అధికంగా ఆహారంలో చేర్చుకుంటే రక్తపోటు అదుపులో ఉంటుంది. ఆకుకూరల్లో మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. పాలకూరలో నైట్రేట్ అని పిలిచే మొక్కల ఆధారిత సమ్మేళనం ఉంటుంది. దీన్ని తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు అన్ని ఆ పచ్చని ఆకుకూరల్లో ఉంటాయి. ఇవి బీపీని తగ్గించి ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.
ప్రతిరోజు గుప్పెడు నట్స్ తినడం అలవాటు చేసుకోండి. రాత్రి బాదంపప్పును నీళ్లలో నానబెట్టి ఉదయం తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. అలాగే గుమ్మడి గింజలు, అవిసె గింజలు, చియా సీడ్స్, పిస్తా, బాదం వంటివి కూడా తింటూ ఉండాలి. వీటన్నింటిలో కూడా రక్తపోటును తగ్గించే పోషకాలు నిండుగా ఉంటాయి. ఇంట్లో వాడే ధనియాలు, నిమ్మగడ్డి, వెల్లుల్లి, ఉల్లిపాయ, కారం, జీలకర్ర, మిరియాలు, దాల్చిన చెక్క, అల్లం వంటివి కూడా రక్తపోటును తగ్గించడానికి సహాయపడతాయి. కాబట్టి ఇంట్లోనే ఆహారాన్ని వండుకొని పైన చెప్పిన సుగంధద్రవ్యాలు అన్నీ వేసుకొని తినడం మంచిది. ఉప్పుని ఎంతగా తగ్గిస్తే అధిక రక్తపోటు అంతగా అదుపులో ఉంటుంది.
Also read: సల్మాన్ ఖాన్‌ను వేధిస్తున్న సమస్య ఇదే, దీంతో ఆత్మహత్యా ఆలోచనలు పెరిగిపోతాయి
Also read: ఈ పండ్లు ఎక్కడైనా కనిపిస్తే కచ్చితంగా తినండి, గుండె జబ్బులు రాకుండా ఉంటాయి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.